ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో జాప్యం
విద్యార్థుల భవిష్యత్తో సర్కార్ చెలగాటం
- పక్క రాష్ట్రాల్లో అడ్మిషన్ల జాతర
- ఏపీలో గందరగోళం
- తల్లిదండ్రుల్లో మానసిక క్షÃభ
విశాలాంధ్ర – సచివాలయం: “ఇంటర్ పూర్తయింది. ర్యాంకు సాధించి నచ్చిన కాలేజీలో ఇంజినీరింగ్ సీటు కొట్టాలి. ఐటీ ఉద్యోగంలో స్థిరపడాలి” ఇదీ ప్రతిభావంతులైన మధ్యతరగతి విద్యార్థుల కల. కానీ, వీరు కంటున్న కలలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ఏపీఈఏపీ సెట్ ఫలితాల విడుదలలో అంతులేని ఆలస్యం చేస్తూ… విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ చెలగాటమాడుతోంది. ఏటా ఇదే సమయానికే ఫలితాలు వెల్లడై, ర్యాంకులొచ్చి, కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైపోయేది. కానీ ఈసారి పరిస్థితి దానికి భిన్నంగా, అత్యంత దయనీయంగా మారింది. ఫలితంగా “ఇక్కడ వేచి చూస్తే ఏడాది వృధా అవుతుంది” అనే భయంతో వేలాది మంది విద్యార్థులు పక్క రాష్ట్రాల బాట పడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలను ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు విద్యాశాఖ పక్కాగా నిర్వహించింది. ఏప్రిల్ 16నే ఫలితాలను రికార్డు స్థాయిలో విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇంటర్ బోర్డు చూపిన వేగం… ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం ఎందుకు చూపలేకపోతున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏపీఈఏపీ సెట్ పరీక్షలు ముగిసి రోజులు గడుస్తున్నా… ఫలితాలు ఎప్పుడు ఇస్తారనే దానిపై నేటికీ అధికారిక ప్రకటన లేదు. ఈ అయోమయం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర మానసిక క్షÃభకు గురిచేస్తోంది. ఏపీలో అనిశ్చితిని ఆసరాగా చేసుకుని పొరుగు రాష్ట్రాల విద్యాసంస్థలు అడ్మిషన్ల జాతరను ముమ్మరం చేశాయి. ఇంటర్‌లో వచ్చిన ఫలితాలను బట్టి 25 శాతం వెయిటేజ్ ఈఏపీ సెట్‌లో ఇవ్వాల్సి ఉంది. ఇంటర్ ఫలితాలు ప్రకటించిన తరువాత ఈఏపీ ¾సెట్ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ప్రకటిస్తోంది. ఈ ఏడాది సప్లిమెంటరీ విద్యార్థులతో పాటు బెటర్మెంట్ రాసే అవకాశం ద్వితీయ సంవత్సరం ఉత్తీర’త సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది. ఈ నెల 5వ తేదీతో ముగిసిన సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. బెటర్మెంట్ ఫలితాల్లో వచ్చినా ర్యాంకులను ఇంకా పెండింగ్ లో పెట్టింది. తెలంగాణ ఈ నెల 19 నుంచే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేసింది. తమిళనాడు, కర్నాటక, కేరళతో పాటు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇక్కడ ఫలితాలు ఆలస్యమైతే… అక్కడ ఎక్కడ సీట్లు దొరకవోనని భయపడుతున్న ఏపీ తల్లిదండ్రులు, వేరే దారి లేక రూ. లక్షలు వెచ్చించి మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏపీ సంపద, ప్రతిభ రెండూ పక్క రాష్ట్రాల పాలవుతున్నాయి. ఈ జాప్యం వెనుక ప్రభుత్వం కావాలనే ఒక పక్కా స్కెచ్ ప్రకారం వ్యవహరిస్తోందనే అనుమానాలు విద్యా వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. కన్వీనర్ కోటాలో ఏపీ కాలేజీల్లో చేరిన వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌ను ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తే… ఓపిక నశించిన విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతారని, తద్వారా వందల కోట్ల రూపాయల ఫీజుల భారం ప్రభుత్వంపై తప్పతుందనే ‘టాక్’ నడుస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తూ… స్థానిక విద్యా వ్యవస్థను మరింత కుదేలు చేస్తోందని కళాశాల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఇంజినీరింగ్ చేరాలనుకునే వారి ప్రథమ ప్రాధాన్యత కంప్యూటర్ సైన్స్ వైపే ఉంటోంది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ ఐటీ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఉద్యోగాల కోత తీవ్రంగా నడుస్తోంది. మల్టీనేషనల్ కంపెనీలు ప్రతి నెలా వందలాది మందిని తొలగిస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులకు సరైన కెరీర్ గైడెన్స్ ఇవ్వాల్సిన ప్రభుత్వం… కనీసం ఫలితాలు కూడా ఇవ్వకుండా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. “పక్క రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత ఏపీలో షెడ్యూల్ ఇస్తే విద్యార్థులు నష్టపోతారు. రాష్ట్రంలో మూడేళ్లకోసారి వృత్తి విద్య కోర్సులకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ధారిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరంతో గత మూడేళ్ల కాలపరిమితి ముగిసింది. రాన్‌ను కొత్త విద్యా సంవత్సరానికి ఫీజులను నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటి వరకు కమిషన్ చైర్మన్‌ను, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. కొత్త కమిషన్ నియామకం ఎప్పుడు జరుగుతుంది… ఒకవేళ నియమించినా… సకాలంలో కమిటీ ఫీజులను నిర్ధారిస్తుందా లేదా అనే అనుమానం నెలకొంది. లేదంటే పాత ఫీజులనే ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తుందా అనేది చూడాల్సి ఉంది. మరోపక్క కళాశాలల గుర్తింపు ప్రక్రియను కూడా ఇప్పటి వరకు యూనివర్సిటీలు పూర్తిచేయలేదు. వీటన్నింటినీ పూర్తిచేసి ఆగస్టు ఒకటో తేదీలోపు అడ్మిషన్లను ఉన్నత విద్య ప్రారంభిస్తుందా లేదో వేచి చూడాలి. “ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫలితాలు విడుదల చేసి, కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించాలి” అని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.


