Homeసంపాదకీయంసుప్రీంకు ఎక్కిన రామ మందిర చోరీ

సుప్రీంకు ఎక్కిన రామ మందిర చోరీ

- Advertisement -

అయోధ్యలోని రామ మందిరంలో నిధులు, భక్తులు సమర్పించిన కానుకలు దొంగిలించిన కేసు విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జోయ్మాల్యా బాగ్చి, మోహన విచారణ జరపడానికి ఒప్పుకున్నారు. రామ మందిరంలో చోరీ నిగ్గు తేల్చడానికి స్వతంత్ర నియంత్రణకు ఆదేశించాలని పిటిషన్లు దాఖలు చేసిన వారు అభ్యర్థించారు. నరేంద్ర కుమార్ గోస్వామీ దాఖలు చేసిన పిటిషన్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో, కంప్రోట్లర్ ఆడిటర్ జనరల్ వ్యవస్థతో విచారణ చేయించేలా ఆదేశించాలని కోరారు. అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌లో కూడా సీబీఐ దర్యాప్తు జరిపేలా ఆదేశించాలని కోరారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి.) ఎంపీ సుధాకర్ సింఘ్ దాఖలు చేసిన పిటిషన్‌లో మాత్రం రామమందిర నిధుల వ్యవహారంలో ఫోరెన్సిక్ దర్యాప్తు చేయించాలని కోరారు. సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి కూడా కోరారు. సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో రామ మందిరానికి చెందిన ఆర్థిక రికార్డులు, పత్రాలు, డిజిటల్ రికార్డులు, యు.పి.ఐ. లావాదేవీలు, బ్యాంక్ లావాదేవీల వివరాలను కూడా దర్యాప్తులో చేర్చాలని అభ్యర్థించారు. రికార్డులను తారుమారు చేయడాన్ని నిరోధించి వీటన్నింటినీ సంరక్షించాలని సింగ్ పిటిషన్‌లో కోరారు. ఈ వ్యవహారంపై విచారించడానికి సుప్రీంకోర్టు ముందు నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై విచారణ సాగుతోంది.
రామ మందిరంలో చోరీ గురించి ఇప్పటికే సమాంతరంగా రెండు దర్యాప్తులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఒక వేపు విచారణ కొనసాగిస్తుండగా ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారందరినీ జూన్ 29న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. విచిత్రం ఏమిటంటే వీరిని తమ కస్టడీకి పంపించాలని పోలీసులు కోరలేదు. సిట్ దర్యాప్తులో అవినాశ్ శుక్లాను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేసి కస్టడీకి పంపిన మాట నిజమే అయినప్పటికీ వారందరూ కింది స్థాయి సిబ్బందే. ఈ వ్యవహారంలో రామ మందిర తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అవినాశ్ మిశ్రా… రాజీనామా చేశారు. కాని వీరి మీద ఇంతవరకు ఎఫ్.ఐ.ఆర్. అయినా దాఖలు చేయలేదు. ఈ చోరీ విషయంలో పాత్ర ఉన్న వారే సిట్ ఏర్పాటు చేయడం, దర్యాప్తునకు ఆదేశించడం వల్ల ప్రయోజనం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐ.ఎ.ఎస్. అధికారి, లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. అయితే దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న విజయ్ విశ్వాస్ పంత్ మీద ఇది వరకే మోసానికి పాల్పడ్డాడన్న ఆరోపణతో ఐ.పి.సి. 420, 426 కింద కేసులు నమోదైనాయి. ఈ కేసులు ఇంకా తెమలలేదు. 420వ సెక్షన్ కింద కేసు ఉన్న వ్యక్తిని దర్యాప్తు బృంద అధికారిగా ఎలా నియమిస్తారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.)కు, విశ్వ హిందూ పరిషత్తుకు రామ మందిర ట్రస్ట్ పై తిరుగులేని ఆధిపత్యం ఉంది. రామ మందిర తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన చంపత్ రాయ్ ఈ కుదురులోని వారే. ఆయనను నియమించింది ప్రధానమంత్రి కార్యాలయమే. అందువల్ల ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద తలకాయల మీద ఏ చర్యా లేకుండా కింది స్థాయి ఉద్యోగులను బలి చేయడం వల్ల ఫలితం ఏం ఉంటుందన్నది సహజంగా ఉత్పన్నమయ్యే ప్రశ్నే. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వారు సీబీఐ, కాగ్ చేత దర్యాప్తు చేయించాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను మన్నించినా పెద్ద తలకాయలకు నష్టమేమీ ఉండదు. సీబీఐ, కాగ్ లాంటి వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి కనక పెద్ద తలకాయల మీద చర్య తీసుకునే అవకాశం సహజంగానే ఉండకపోవచ్చు. సుప్రీంకోర్టు తనంత తాను ఈ పెద్ద తలకాయల మీద కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించే సాహసం చేసే అవకాశమే లేదు. పైగా రామ మందిరంలో చోరీ గురించి ఇంత గోల చేస్తున్న వారు వక్ఫ్ ఆస్తుల లూటీపై ఎందుకు ప్రశ్నించరు అని వితండవాదానికి దిగి అసలు సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ ధర్మాన్ని అపఖ్యాతి పాలు చేసే ప్రయత్నం జరుగుతోందని యోగీ ఆదిత్య నాథ్ అంటున్నారు. సిట్ దర్యాప్తు తొలి నివేదిక వెలువడింది. కానీ ఇందులో ఉన్న వివరాలు అంతగా ప్రాధాన్యత ఉన్నవి కావు. పెద్ద తలకాయలపై అనుమానం వ్యక్తం చేసిందీ లేదు. ఇప్పటి దాకా వివిధ దర్యాప్తుల తీరు చూస్తే మొత్తం వ్యవహారాన్ని మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. సిట్ తొలి నివేదిక వెలువడిన తరవాత చంపత్ రాయ్ నోరు విప్పలేదు. వచ్చే 22వ తేదీన తుది నివేదిక వెలువడిన తరవాత తన వాదన వినిపిస్తానని చంపత్ రాయ్ అంటున్నారు. అంటే తుది నివేదికలోనూ తనకు కలిగే నష్టం ఏమీ ఉండదన్న భరోసా ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. చంపత్ రాయ్ లాంటి వారి ప్రధాన బాధ్యులను బోనెక్కించకుండా సత్యం బయట పడే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది ? ఈ వివాదం చెలరేగిన తరవాత ట్రస్ట్ సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ఆమోదించడం మినహా చేసిందేమీ లేదు. అసలు మొత్తం ట్రస్ట్‌ను అలాగే కొనసాగిస్తూ సత్యం బయట పెట్టడం ఎలా సాధ్యం అవుతుందని అసలు ప్రశ్న. చంపత్ రాయ్ నిర్వహిస్తున్న బాధ్యతలను అదే ట్రస్ట్ సభ్యుడైన కృష్ణమోహన్ సింగ్‌కు చంపత్ రాయ్ ఇప్పటిదాకా నిర్వహించిన బాధ్యతలను అప్పగించారు. అసలు ఈ చోరీలో బాధ్యత మొత్తం ట్రస్ట్‌లో ఉన్న వారిదే అయినప్పుడు అందులోనే కొందరికి బాధ్యతలు అప్పగించడం వల్ల ఉండే ప్రయోజనమల్లా వాస్తవాన్ని కప్పి పుచ్చే ప్రయత్నమే. ట్రస్ట్ మీద ఆధిపత్యం వదులుకోవడానికి సంఘ్ పరివార్ ఏ మాత్రం సిద్ధంగా లేదు. ఇలాంటి సమయంలో సుప్రీం కోర్టు వైఖరి ఎలా ఉంటుదన్నదే అసలు ప్రశ్న.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు