విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కౌతాళంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి ప్రకాష్ రెడ్డిని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు నమోదు చేయాలని శనివారం ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్దకడబూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు భీమన్న, తాలూకా ఉపాధ్యక్షులు పుల్లయ్య మాట్లాడుతూ కౌతాళంలో అక్రమ ఆక్రమణలపై వార్తలు ప్రసారం చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి ప్రకాష్ రెడ్డిని వైసీపీ కార్యకర్త బలరాం ఫోన్ లో దుర్భాషలాడుతూ, బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులను బెదరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్నారు. తక్షణమే బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే నాయకులు ఈరన్న, రామన్న, నారాయణ, మల్లికార్జున, లింగమూర్తి, రాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


