ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మొదటి 5 బ్యాటర్లలో
భారత్ నుంచి ముగ్గురు
లండన్: అంతర్జాతీయ క్రికెట్‌లో తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ) ప్రకటించింది. దీనిలో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో నిలవగా… ఆయన తర్వాత విరాట్ కోహ్లీ (భారత్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇబ్రాహీం జద్రాన్ (అఫ్గనిస్తాన్) మూడో స్థానంలో నిలిచారు. అలాగే రోహిత్ శర్మ (భారత్) నాలుగో స్థానంలో, శుభ్‌మన్ గిల్ (భారత్) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. భారత జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-5లో ఉండటం గమనార్హం. బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ (అఫ్గనిస్తాన్) అగ్రస్థానంలో ఉండగా, జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లాండ్), కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా), బెర్నార్డ్ స్కోల్ట్జ్ (నమీబియా), ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్) తదుపరి స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్తాన్) మొదటి స్థానంలో ఉండగా, సికందర్ రజా (జింబాబ్వే), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్), మెహిదీ హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్), రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్) టాప్-5లో చోటు సంపాదించారు. ఇక మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన (భారత్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నాట్ స్కివర్-బ్రంట్ (ఇంగ్లాండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్) తదుపరి స్థానాల్లో ఉన్నారు. మొత్తంగా ఈ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటారు.
టీ20ల్లో అభిషేక్, ఇషాన్ హవా… బుమ్రాకు ప్రమోషన్
ఐసీసీ విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా యువ బ్యాటర్లు టాప్ స్థానాల్లో దూసుకుపోతుండగా, బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో స్థానం పదిలం చేసుకున్నాడు. తిలక్ వర్మ 7వ స్థానం నుంచి 6వ స్థానానికి, సంజూ శాంసన్ 22వ స్థానం నుంచి 21వ స్థానానికి చేరుకున్నారు. టాప్ 10లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా, తాజా ర్యాంకింగ్స్‌లో 6వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్ జాబితాలో వరుణ్ రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇకపోతే ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి ఏకైక ఆటగాడిగా హార్దిక్ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ వన్డే, టీ20 ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం
- Advertisement -


