పద్నాలుగు రోజులపాటు బిహార్ లో జరిగిన ఓట్ చోరీ యాత్ర సోమవారం ముగిసింది. ఈ యాత్ర కేవలం కాంగ్రెస్ యాత్ర కాదు. అది ఒక్క రాహుల్ గాంధీ యాత్ర కాదు. ఈ పధ్నాలుగు రోజుల పొడవునా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జె.డి.) నేత తేజస్వీ యాదవ్ ఈ యాత్రలో భాగస్వామి అయ్యారు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటన లోని వివిధ పార్టీల నాయకులు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆఖరి రోజు యాత్రలో ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని పార్టీలు కూడా యాత్రలో కనిపించారు. ఆచరణలో ప్రతిపక్ష పార్టీలు ఇంత పకడ్బందీగా ఇదివరకెన్నడూ కనిపించి ఉండదు. ‘‘ఇండియా’’ ఐక్య సంఘటనలోని పార్టీల నాయకులు గతంలో అనేక సార్లు ఉమ్మడి సమావేశాలు నిర్వహించి ఉండవచ్చు. జనం మధ్య కనిపించి ఉండవచ్చు. కానీ సోమవారం నాడు కనిపించిన ప్రతిపక్ష ఐక్య సంఘటన అపూర్వమైంది. ముగింపు సమావేశంలో ప్రధానంగా రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. కూటమి గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. ‘‘ఓట్ చోరీ అంటే అధికార దోపిడీ, రిజర్వేషన్ల దోపిడీ, ఉపాధి దోపిడీ, విద్య దోపిడీ, ప్రజాస్వామ్యం దోపిడీ, యువత భవిష్యత్తు దోపిడీ అని రాహుల్ గాంధీ గర్జించడం మోదీ ప్రభుత్వాన్ని కంపింప చేసింది. ‘‘ఫ్యాక్టరీలు గుజరాత్‌లో పెడ్తారా, విజయం బిహార్ లో కావాలా? ప్రజాస్వామ్య రక్షణ కావాలా లేదా రాచరికం కావాలా?’’ అని ప్రశ్నించి తేజస్వీ యాదవ్ అధికార పక్షం గుండెల్లో గునపాలు దింపారు. బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ, ఉత్పత్తిదారు, పంపిణీదారు అని కూడా తేజస్వీ దుయ్యబట్టారు. జైలులో పెడ్తామన్న బెదిరింపులతో భయపడేదే లేదు అని ప్రతిపక్ష నాయకులు స్పష్టం చేశారు. బిహార్ ప్రజాస్వామ్యానికి జన్మస్థలం లాంటిదని, అలాంటి చోట ప్రజాస్వామ్యాన్నే సమాధి చేయాలని బీజేపీ అగ్ర నాయకులిద్దరూ కుట్ర చేస్తున్నారని తేజస్వీ నిజానికి అత్యంత దగ్గరగా ఉన్న ఆరోపణ మోపారు. బిహార్ లో అధికారంలో ఉన్న డబులు ఇంజన్ సర్కారులో ఒక ఇంజన్ అవినీతితో నడుస్తోందని, రెండో ఇంజన్ నేరమయమై పోయింది అని తేజస్వీ యాదవ్ ఘాటైన విమర్శలు సంధించారు. వచ్చే నవంబర్ లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ చెప్పిన మాటల లక్ష్యం ఆ ఎన్నికలు కూడా అయి ఉండొచ్చు. కానీ సమగ్ర, నిశితమైన ఓటర్ల సవరణ పేరుతో జరుగుతున్న మార్పులు చేర్పుల్లో జరుగుతున్న దుర్మార్గాన్ని బిహార్ మూలమూలకే కాదు, దేశవాసులందరికీ చేరవేయడంలో ఈ పధ్నాలుగు రోజుల యాత్ర సఫలమైంది. ఫలితాల మాట బిహార్ శాసనసభ ఎన్నికల తరవాత తేలొచ్చునేమో కానీ జనాన్ని చైతన్యవంతులను చేయడానికి, ఎన్నికల కమిషన్ ను మోదీ ఎలా గుప్పెట్లో పెట్టుకుని ఎన్ని దుర్మార్గాలకు పాల్పడుతోందో బయట పెట్టడానికి ఈ యాత్ర బాగా దోహదం చేసింది. బిహార్ మొత్తం ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరాన్ని గుర్తు చేసింది. రాహుల్ తేజస్వీ కేవలం ఓట్ల దొంగతనం గురించే కాకుండా అవినీతిని కూడా పెద్ద ఎత్తున ఎత్తి చూపడం ద్వారా అవినీతిని కూడా ప్రధాన చర్చనీయాంశం చేసేశారు. ఒక్క ఇంజినీర్ ఇంట్లో వందకోట్లకు పైగా పట్టుబడ్డ అంశాన్ని ప్రధానాంశంగా మలిచారు. నోట్ల కట్టలను తగులబెడ్తున్నారని గుర్తు చేశారు. అధికారం తమ చేతుల్లోకి వచ్చిన తరవాత అవినీతికి పాల్పడ్డ ఏ అధికారినీ వదలిపెట్టబోమని తేజస్వీ హెచ్చరించారు. ప్రతిపక్షాలు ఇస్తున్న హామీలన్నింటినీ నితీశ్ కుమార్ కాపీ కొట్టి అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడిరది. బిహార్ లో రెండు వారాలపాటు జరిగిన ఓట్ చోరీ యాత్రలో భాగస్వాములైన పార్టీలన్ని తమ శక్తి సామర్థ్యాలను స్పష్టంగా ప్రదర్శించాయి. యాభై ఏళ్లనాటి ఎమర్జెన్సీని పదే పదే ప్రస్తావించే మోదీ ప్రభుత్వం సరిగా అదే జూన్ 25న బిహార్ లో సమగ్ర, సునిశిత ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇది ఎమర్జెన్సీ కన్నా ఎంత భీకరమైందో ప్రతిపక్షాలు ఎత్తి చూపాయి. పెద్ద నోట్లరద్దు, జి.ఎస్.టి. మొదలైన చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఎలా కుళ్లబొడిచిందో ప్రతిపక్షాలు గుర్తు చేశాయి. ఓటర్ల జాబితా సవరణ మిషతో ఇప్పుడు ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్లబొడుస్తున్న వైనాన్ని ప్రతిపక్షాలు సమర్థంగా ఎత్తి చూపగలిగాయి. బిహార్ జనాభాలో 20 శాతం మంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తారన్న సాకుతో ఆ ఓటర్ల పేర్లన్నీ జాబితాలోంచి తొలగించే ప్రయత్నం సాగింది. కానీ ప్రజలు ఆందోళనకు దిగడంతో చివరకు 65 లక్షల మంది ఓటర్లను ఓటర్ల జాబితానుంచి తొలగించారు. ఈ సమస్యకు ఇంకా తెరపడలేదు. బిహార్ ప్రజలు తమ హక్కులను కాపాడుకోవడాని మళ్లీ ఉద్యమించడానికి వెనుకాడరు అని గత రెండు వారాల పరిణామాలు భరోసా కల్పిస్తున్నాయి.
ఓటర్ అధికార యాత్ర పూర్తి అయిన సందర్భంలో రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబు వస్తోంది జాగ్రత్త అని హెచ్చరించారు. మహాత్మా గాంధీని హతమార్చిన శక్తులే ఇప్పుడు రాజ్యాంగ హత్యకు పాల్పడుతున్నాయి కానీ ఇది ససేమిరా జరగనివ్వబోం అని రాహుల్ స్పష్టం చేశారు. కర్నాటకలోని మహదేవ్ పురాలో జరిగిన ఓట్ల చోరీని బయట పెట్టడం ఆటం బాంబు అయితే ఇక హైడ్రోజన్ బాంబు వస్తోంది కాచుకోండి అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. రెండు వారాలుగా బిహార్ లోని వివిధ ప్రాంతాలలో సాగిన ఓట్ అధికార్ యాత్రకు జనం నుంచి వచ్చిన స్పందన చూస్తే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారన్న ఆశాభావం కలుగుతోంది. ఈ సారథ్యం వహించిన పార్టీలు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ వచ్చే శాసనసభ ఎన్నికలు ఈ పరిస్థితిని తారుమారు చేయడం ఖాయం అన్న విశ్వాసం కలుగుతోంది. ఈ పరిణామం సాకారం అయితే అది కేవలం బిహార్ కే పరిమితం కాదు. దాని ప్రకంపనలు దేశం నలుమూలలా ప్రతిధ్వనించక మానవు. బిహార్ లో జరిగిన యాత్ర కేవలం ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా జరిగింది మాత్రమే కాదు. నితీశ్ కుమార్ దుష్పరిపాలనను ఎండగట్టడానికి మాత్రమే పరిమితం అయింది కాదు. యాత్ర పొడవునా జన విస్ఫోటనం చూస్తే బిహార్ ప్రజల స్వరం దేశమంతటా ప్రతిధ్వనిస్తోందన్న భావన కలుగుతోంది. ఈ యాత్ర కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, మోదీ, అమిత్ షా ద్వయం కుయుక్తులకు, ప్రజాస్వామ్యాన్ని అంతంచేసే ప్రయత్నాలని నిలవరించడానికి ఉద్దేశించిందని శిలా లిఖితమైన మాటలా గోచరిస్తోంది. నిరంకుశ ధోరణులు ఎదురైనప్పుడల్లా ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం కట్టారని గుర్తుంచుకోవాలి.
ఓట్ల దోపిడీదార్లకు హెచ్చరిక
- Advertisement -


