Tuesday, November 18, 2025
Homeకల్తీ మద్యం కలకలం!

కల్తీ మద్యం కలకలం!

- Advertisement -

. ప్రమాదంలో ప్రజల ఆరోగ్యం
. ఏది కిక్కు? ఏది నకిలీ?
. మందుబాబుల బేజారు
. పడిపోతున్న కొనుగోళ్లు… తగ్గుతున్న ఆదాయం
. ఎక్సైజ్‌ శాఖలో ఇంటిదొంగలు
. ప్రభుత్వానికి సవాల్‌గా మారిన ‘కల్తీ’ మాఫియా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో కల్తీమద్యం కలకలం రేపుతోంది. ఎక్సైజ్‌ పోలీసుల దాడుల్లో అనేక చోట్ల కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలే బయటపడటంతో పెద్ద ఎత్తున కల్తీ మద్యం వినియోగం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలతో మందు బాబుల్లో కొత్త టెన్షన్‌ మొదలైంది. ఏది అసలు?, ఏది కల్తీ? తెలియక వారు తికమక పడుతున్నారు. మద్యం కొనేందుకు తటపటాయిస్తున్నారు. వైన్‌షాపులు, బార్ల దగ్గర వాతావరణం మారిపోయింది. దీనికి తాజాగా వెలుగు చూసిన కల్తీ మద్యమే కారణమని భావిస్తున్నారు. మిథనాల్‌ వంటి విషపూరిత రసాయనాలతో తయారు చేసిన మద్యం తాగిన వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాలలో కూడా కల్తీ మద్యం మరణాలు అనేకం నమోదయ్యాయి. అందులో పేద వినియోగదారులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రఖ్యాత బ్రాండ్ల లేబుళ్లతో విక్రయించే నకిలీ బాటిళ్ల ద్వారా నకిలీ మద్యాన్ని మార్కెట్లోకి వదలడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల ఎక్సైజ్‌ దాడుల్లో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో అధికార పార్టీకి చెందిన నాయకుడి కనుసన్నల్లో కల్తీ మద్యం ఫ్యాక్టరీ వ్యవహారం వెలుగు చూసింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌జిల్లా ఇబ్రహీంపట్నంలోనూ కల్తీ మద్యం స్పిరిట్‌లు, వేలాది ఖాళీ సీసాలు బయటపడ్డాయి. స్పిరిట్లను తీసుకొచ్చి…వాటితో కల్తీ మద్యం తయారు చేసి మద్యం దుకాణాలు, బెల్టు షాపుల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం కల్తీ మద్యం సిండికేట్లలో విభేదాల వల్లే ఈ సంగతి బయటకు పొక్కింది. ఆ విషయం తెలిశాకే…ఎక్సైజ్‌శాఖ మొక్కుబడి దాడులకే పరిమితమైనట్లుగా విమర్శలున్నాయి. ఇంకా సిండికేట్ల మధ్య విభేదాలు లేనిచోట్ల పెద్దఎత్తున కల్తీ మద్యం తయారీ ఎక్కడెక్కడ ఉంది? అనేదీ ఆ శాఖ నిగ్గు తేల్చాల్సి ఉంది. తంబళ్లపల్లె నుంచి కల్తీ మద్యం బాటిళ్లు రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అయితే…వాటిని తాగితే మందు ప్రియులు కోరికోరి అనారోగ్యం కొనితెచ్చుకునే ప్రమాదముంది. ఈ మద్యం బాటిళ్లు ఏఏ దుకాణాలకు చేరాయి?, ఏఏ బెల్టు షాపులకు వెళ్లాయి? అనేదీ ప్రభుత్వం గుర్తించాలి. లేకుంటే నాటు సారా తరహాగా మద్యం దుకాణాలకు సరఫరా అయిన కల్తీ సరుకును తాగే ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు భావించాలి. ప్రభుత్వ పర్యవేక్షణలోని మద్యం బాటిళ్లు వైన్‌షాపులకు రావడం లేదనే ఆపోహలున్నాయి.
కల్తీ మద్యం…ప్రభుత్వానికి సవాలే…
ఎన్టీఆర్‌ జిల్లాలో కల్తీ మద్యం మూలాలు వెలుగులోకి రావడం చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అప్పటి నుంచి మద్యం తాగితే కిక్కెక్కుతుందా? లేదా? అనే అనుమానాలూ మద్యం ప్రియుల్లో ఉన్నాయి. దానికితోడు కల్తీ మందు తాగితే…ఆరోగ్యాల పరిస్థితేమిటనే ఆందోళన ఉంది. ఎక్సైజ్‌శాఖ నిర్వహించిన మెరుపు దాడుల్లో కల్తీ మద్యం ఉదంతం వెలుగు చూసింది. ఒక వైపు ఈ కేసులోని నిందితుల అరెస్టులు, దర్యాప్తులతో ఎక్సైజ్‌శాఖ తలమునకలై ఉండగా…మరోవైపు కల్తీ మద్యంపై రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ, వైసీపీలు పరస్పర విమర్శలకు పరిమితమయ్యాయి. కల్తీ మద్యంపై సీబీఐతో విచారించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ రాయడమూ చర్చనీయాంశమైంది. కల్తీ మద్యం వ్యవహారం బయటకు పొక్కడంతో విక్రయాలు తగ్గిపోతున్నట్లు తెలిసింది. కల్తీ మద్యం ప్రభుత్వం ఆదాయంపై ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.78 నుంచి రూ.80 కోట్ల వరకు ఎక్సైజ్‌ రెవెన్యూ రాబడి ఉంది. ఇటీవల కల్తీ మద్యం భయంతో మద్యం ప్రియులు మందు కొనుగోళ్లపై వెనక్కి తగ్గడంతో ఆదాయం పడిపోతోంది. కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆదాయం తగ్గడంతో ఓ పక్క అధికారులు మరోపక్క మద్యం దుకాణాల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ మద్యం తయారీ మూలాలు బయటకు వచ్చాకనే ఎక్సైజ్‌శాఖ అప్రమత్తమైంది. అంతకుముందు ఎలాంటి తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం నకిలీ మద్యం నెట్‌వర్కింగ్‌ను కనుగొనేందుకు ఆ శాఖ దృష్టి పెట్టింది. ల్యాబ్‌లు, గోడౌన్లు గుర్తించేందుకు ప్రత్యేక బృందాల్ని అధికారులు ఏర్పాటు చేశారు. మద్యం షాపులపైనా ఆకస్మికంగాను తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలకు బ్రాండెడ్‌, నాణ్యమైన మద్యమే వినియోగించాలంటూ ఎక్సైజ్‌శాఖ హెచ్చరికలు జారీజేసింది.
కల్తీ మద్యంలో ఇంటి దొంగలు !
మరోవైపు కల్తీ మద్యంలో ఇంటి దొంగలున్నట్లు తెలుస్తోంది. దానిపైనా ఎక్సైజ్‌ అధికారులు ప్రధాన దృష్టి పెట్టారు. కల్తీ మద్యం కేసులో సూత్రధారి, పాత్రధారిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్‌ (ఏ1) చుట్టూ విచారణ చేస్తున్నారు. ఆయనకు చెందిన ఏఎన్‌ఆర్‌ బార్‌ లైసెన్స్‌ను ఇప్పటికే తొలగించారు. ఎన్టీఆర్‌జిల్లా భవానీపురం శ్రీనివాస్‌ వైన్స్‌లోను కల్తీ మద్యం విక్రయాల విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు సిబ్బంది బెల్ట్‌ షాపులకు పెద్దఎత్తున సహకరిస్తున్నారని గుర్తించారు. వారిలో కొందరు కల్తీ మద్యం విక్రయాలకు సహకరిస్తున్నట్లు సమాచారం. దానిపై ఎక్సైజ్‌ శాఖ అంతర్గతంగా విచారణ చేపట్టి… కమిషనర్‌కు నివేదించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా మునకలచెరువు ఎక్సైజ్‌ సీఐ హిమబిందుపై వేటు వేశారు. మరో సీఐపైనా ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. కల్తీ మద్యం తయారీ రాకెట్‌లో ఉన్న వారంతా పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారముంది. ఆయా అంశాలపై అధికారులు పూర్తిస్థాయి దృష్టి పెట్టినప్పటికీ రాజకీయ పలుకుబడితో కల్తీ మద్యం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు తక్షణమే మేల్కొని దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తేనే…కాస్త కట్టడికి అవకాశం ఉంటుంది. లేకుంటే కల్తీ మద్యం తాగి ప్రజలు పిట్టల్లా రాలిపోయే ప్రమాదముంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు