Sunday, February 8, 2026
Homeకార్మికాగ్రహం

కార్మికాగ్రహం

- Advertisement -

. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శనలు
. మోదీకి వ్యతిరేకంగా దద్దరిల్లిన నినాదాలు
. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ : నారాయణ
. ప్రజా హక్కులు హననం, వ్యవస్థలన్నీ నిర్వీర్యం : రామకృష్ణ
. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల్సిందే : రవీంద్రనాథ్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో కార్మిక సంఘాల అధ్వర్యాన భారీ ప్రదర్శనలు, ధర్నాలు, సభలు జరిగాయి. మోదీ అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనకారుల నినాదాలు మిన్నంటాయి. నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మోదీని ఇంటికి పంపుతామని హెచ్చరించారు.
దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా తిరుపతిలో అన్ని కార్మిక సంఘాల అధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మోదీ, అమిత్‌షా ప్రజా ద్రోహులుగా మిగిలిపోయారని మండిపడ్డారు. నేడు దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో శ్రామికులంతా బజారులోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే మోదీ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో స్పష్టమవుతోందన్నారు. కార్మిక హక్కులన్నిటినీ కాలరాసి నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఆ నాలుగు కోడ్‌ల వల్ల సంఘం పెట్టుకోవడానికి గాని, ప్రశ్నించడానికి కానీ వీలు లేదన్నారు. అంబాని, ఆదానీకి, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని. ప్రజాపోరాటాల ద్వారానే మోదీకి బుద్ది చెప్పాలని నారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రామానాయుడు, కె.శివారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర నాయకులు కందారపు మురళి, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు పి.వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో జరిగిన భారీ ప్రదర్శన, సభా కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను కార్పొరేట్‌ శక్తుల ఎదుట కట్టు బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సార్వత్రిక సమ్మెతో అయినా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కార్మికాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, ఉద్యోగులను, కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని, స్కీం వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ, సీఐటీయూ ఒంగోలు నగర కార్యదర్శులు శ్రీరామ్‌ శ్రీనివాసులు, మహేష్‌ అధ్యక్షత వహించగా, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎం.ఎల్‌.నారాయణ, ఎస్‌.కె.మాబు, ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట వెంకటేశ్వర్లు, చీకటి శ్రీనివాసరావు, సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల్సిందే : రవీంద్రనాథ్‌
నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాల్సిందేనని, లేకుంటే మోదీ ప్రభుత్వానికి కాలం చెల్లినట్లేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌ హెచ్చరించారు. కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన జాతీయ సార్వత్రిక సమ్మె విజయవంతం అయిందన్నారు. దేశ వ్యాప్త పిలుపు మేరకు విజయవాడలో రధం సెంటర్‌ నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు వేలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్‌ సెంటర్‌లో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మూలే సాంబశివరావు, సీఐటీయూ ఉపాధ్యక్షులు దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకటసుబ్బయ్య, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, రైతు సంఘాల కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘాల నాయకులు కేశవరావు, యలమందరావు, వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతమ్‌ రెడ్డి, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి.ప్రసాదు, రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌, ఏఐయుటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె.సుధీర్‌ బాబు, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పోరాటం : ఈశ్వరయ్య
కార్మిక హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పోరాటం జరుగుతోందని, మోదీ ప్రభుత్వం కార్మికాగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య హెచ్చరించారు. విజయనగరంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్‌ అధ్వర్యంలో స్థానిక గంట స్థంభం నుంచి స్టేట్‌ బ్యాంక్‌ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వరకు కార్మికులు నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఓమ్ని రమణ, సహాయ కార్యదర్శి ఆలమండ ఆనందరావు, కె.స్రవంతి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలకు సమ్మె గొడ్డలిపెట్టు : జంగాల, వెలుగూరి
సార్వత్రిక సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు గొడ్డలి పెట్టని, రానున్న రోజుల్లో కార్మికులు, కర్షకులు ఐక్యంగా మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బి.ఆర్‌ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, బ్యాంక్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు కిషోర్‌, బాషా, మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. పెదకాకానిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, రెంటాల కుమారి పాల్గొన్నారు.
విజయనగరంలో…: విజయనగరంలో సెంట్రల్‌ బ్యాంకు నుంచిగంట స్థంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.కామేశ్వరరావు, పీఏసీఎస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి సత్యారావు, బి.రాము నాయుడు, టి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
నంద్యాలలో…: కార్మికులు, కష్టజీవులు, రైతులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్‌ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు. దేశ వ్యాప్త కార్మిక సమ్మెలో భాగంగా నంద్యాల పట్టణంలో పట్టణ కార్యదర్శులు శ్రీనివాసులు, లక్ష్మణ అధ్యక్షతన మార్కెట్‌ యార్డ్‌ నుంచి గాంధీ చౌక్‌ వరకు జరిగిన భారీ ర్యాలీ నుద్దేశించి వారు ప్రసంగించారు.
కర్నూలులో…: కార్మిక సంఘాల అధ్వర్యంలో జిల్లా పరిషత్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప, సీఐటీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు, నిర్మలమ్మతో పాటు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు