Tuesday, July 15, 2025
Homeసంపాదకీయంకాల్పుల విరమణ ప్రహసనం

కాల్పుల విరమణ ప్రహసనం

నిష్కారణంగా ఇరాన్‌ మీద యుద్ధం ప్రకటించిన ఇజ్రాయిల్‌కు సకలవిధ సహకారాలు అందించడమూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పనే. మళ్లీ ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించింది తానేనని ట్రంప్‌ చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా యుద్ధాన్ని నివారించడం మంచిదే కాని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కాల్పుల విరమణను మంగళవారం రెండు దేశాలు ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్‌ దాడి తరవాత ట్రంప్‌ శాంతి మంత్రాలు పఠించడం నమ్మశక్యంగా లేదు. ఏ షరతుల మీద ఇజ్రాయిల్‌, ఇరాన్‌ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయోనన్న వివరాలు లేవు. ఇరాన్‌ మీద కసితో ఉన్న ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణను ఉల్లంఘించడంలో ఆశ్చర్యం లేదు. గాజా, పలస్తీనియన్ల మీద ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ అని ప్రకటించిన తరవాత కూడా దాడులు కొనసాగిస్తూనే ఉంది. గాజా నగరం మొత్తాన్ని ఇజ్రాయిల్‌ ధ్వంసం చేసేసింది. ఇప్పటికి ఇజ్రాయిల్‌ దాడిలో 60,000 మంది దాకా మరణించారు. కానీ తమ మీద ఏ కారణమూ లేకుండా ఇజ్రాయిల్‌ దాడిచేయడంతో పాటు అమెరికా కూడా గత ఆదివారం తెల్లవారు రaామున ఇరాన్‌లోని మూడు అణుస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు ఎంత నష్టం కలిగిందన్న నికరమైన అంచనా ఇప్పటి వరకు రాలేదు. ‘‘నన్నూ హతమార్చినా అమెరికాపై పగ తీర్చుకోకుండా ఉండం’’ అని ఇరాన్‌ అధినేత అయతుల్లా ఖొమేనీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు. ఈ పరిస్థితిలో యుద్ధం ఆగిపోతుందని ఊహించడమే కష్టం. కాని మంగళవారం ట్రంప్‌ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించారు. కానీ ఇజ్రాయిల్‌, ఇరాన్‌ కూడా కాల్పుల విరమణకు కట్టుబడడానికి నిరాకరిస్తున్నాయి. ట్రంప్‌ పెద్దరికం ఏమైందో తెలియదు. అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న ట్రంప్‌ కాల్పుల విరమణ గురించి మాట్లాడడం కూడా అసత్యాలు మాట్లాడడంలో ఆయన నైపుణ్యం అయినా అయి ఉండాలి. లేదా యుద్ధ రంగంలో ఉన్న రెండు దేశాలు ఆయన మాటను ఖాతరు చేయకుండానైనా ఉండాలి. రెండూ నిజమే కూడా కావొచ్చు. ఇరాన్‌ లోని బైర్‌ శీబా నగరం మీద ఇజ్రాయిల్‌ కాల్పుల విరమణ తరవాత కూడా విరుచుకుపడిరది. ఆ దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ట్రంప్‌ రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటున్నారు. అయితే ఇరాన్‌ కూడా దాడులు ఆపడంలేదు. ఇజ్రాయిల్‌ మీద భయంకరమైన క్షిపణులు ప్రయోగించింది. ట్రంప్‌ చెప్పిన మాట నిజమే అయితే ఆయన ఇజ్రాయిల్‌ను యుద్ధం విరమించాలని కోరైనా ఉండాలి. లేకపోతే అమెరికా స్వయంగా తమ అణు స్థావరాలను నాశనం చేసినందుకు ఇరాన్‌ ఆగ్రహం చల్లారకుండానైనా ఉండాలి. ఆ కారణంగానే ఇరాన్‌ సైన్యం ఖతార్‌, బహ్రేన్‌, కువైత్‌, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలమీద భీకర దాడులు చేసింది. ఈ దశలో కాల్పుల విరమణకు ఇరాన్‌ అంగీకరిస్తుందనుకోలేం. ఇజ్రాయిల్‌ ఎటూ కాల్పుల విరమణకు కట్టుబడి ఉండే స్వభావం ఉన్న దేశమే కాదు. ఖతార్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేస్తామని ఇరాన్‌ అమెరికాకు తెలియచేసింది. ఇరాన్‌లోని అణు స్థావరాలపై బాంబులు కురిపించడానికి ముందు కూడా అమెరికా ఆ విషయం ఇరాన్‌కు తెలియజేసింది. ట్రంప్‌ స్వయంగా ఈ మాట చెప్పారు. అమెరికా చొరవతో ఏర్పడిన కాల్పుల విరమణకు తాము కట్టుబడి ఉంటామని యుద్ధ పిపాసి, ఇజ్రాయిల్‌ను ఓ తీవ్రవాద దేశంగా మార్చిన ప్రధాన మంత్రి నెతన్యాహూ వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని ఉల్లంఘించడంలో ఆయనకు కొన్ని గంటలైనా పట్టలేదు. ఇరాన్‌ మీద యుద్ధానికి దిగడంలో తమ లక్ష్యం నెరవేరిందని కూడా నెతన్యాహూ చెప్తున్నారు. ఇరాన్‌ నిజంగా కాల్పుల విరమణకు అంగీకరించిన అంశం ధ్రువపడలేదు. తమ దేశం మీద దాడి చేసిన అమెరికాను ఇరాన్‌ అంత సులభంగా వదిలిపెడ్తుందనుకోలేం. పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాలమీద ఇరాన్‌ విరుచుకుపడినందువల్ల ట్రంప్‌ కాల్పుల విరమణ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు. ఇరాన్‌ అణుస్థావరాలమీద దాడి చేసినందుకు ట్రంప్‌పై అమెరికాలోనే తీవ్ర నిరసనలు వ్యక్తం అయినాయి. ఇజ్రాయిల్‌ అమానుష యుద్ధంలో 950 మంది మరణించారని అంచనా. ఇజ్రాయిల్‌ మాత్రం ఇరాన్‌ దాడివల్ల తమ దేశంలో 24 మంది మాత్రమే మరణించారని చెప్పిన అబద్ధమే చెప్తోంది. మృతుల సంఖ్య మీద అబద్ధపు పరదా వేసేస్తోంది.
యుద్ధ విరామం గురించి ట్రంప్‌ ప్రతిపాదించిన మాట నిజమేనని ఇరాన్‌ అంగీకరించింది. కానీ ఇజ్రాయిల్‌ దాడులు ఆపితేనే తాము కాల్పుల విరమణకు అంగీకరిస్తామని ఆ దేశం స్పష్టం చేసింది. ఇరాన్‌తో సాన్నిహిత్యం ఉన్న ఖతార్‌ కూడా కాల్పుల విరమణ గురించి ఇరాన్‌ను ఒప్పించే ప్రయత్నంచేసి ఉండొచ్చు. కానీ కాల్పుల విరమణ ప్రకటించిన తరవాత కూడా ఆ మాట నిలబెట్టుకోకపోవడం ఇజ్రాయిల్‌ నైజం. అందుకనేె రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఉండొచ్చు. అమెరికాను ముగ్గులోకి లాగాలన్న నెతన్యాహు ప్రయత్నం కొంతమేర సఫలమైంది. అందుకే ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడి చేసింది. ఈ యుద్ధంలో ఎక్కువగా నష్టపోయింది ఇరానే అయినప్పటికీ ఇజ్రాయిల్‌కు కలిగిన నష్టం కూడా అపారంగానే ఉంది. ఇరాన్‌ చుట్టూ ఉన్నవి అరబ్‌ దేశాలు, పాకిస్థాన్‌. ఈ కారణంగా ఇరాన్‌ కాల్పుల విరమణకు సిద్ధపడిరదనుకున్నా ఇజ్రాయిల్‌ తన మునుపటి గుణాన్ని మానేసిన దాఖలాలు లేవు. అందుకే కాల్పుల విరమణ గురించి ట్రంప్‌ ప్రకటించినా ఘర్షణ కొనసాగుతూ ఉండొచ్చు. ట్రంప్‌ కాల్పుల విరమణ ప్రకటించిన ఆఖరి నిముషం వరకు తాము దాడులు కొనసాగించామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అర్గాచి ప్రకటించారు. తమ సైనిక దళాల పరాక్రమాన్ని కూడా ఆయన ప్రశంసించారు. కానీ శత్రువును తుదముట్టించేదాకా ఆఖరి రక్తపు బొట్టు చిందించడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఆయనే హెచ్చరించారు. యుద్ధం చేస్తున్న రెండు దేశాలు కాకుండా ట్రంప్‌ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించడం విచిత్రంగా ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కూడా కాల్పుల విరమణ గురించి భారత్‌ కన్నా ముందే ట్రంప్‌ ప్రకటించడాన్ని గుర్తు చేసుకుంటే ఆయన విచిత్ర వైఖరి కొంతలో కొంత అర్థం కావొచ్చు. ఆరు గంటల తరవాత ఇజ్రాయిల్‌, ఇరాన్‌ కాల్పుల విరమణ పాటించడాన్ని మొదలవుతుందని, 12 గంటల తరవాత సంపూర్ణ కాల్పుల విరమణ జరుగుతుందని ట్రంప్‌ చెప్పారు. అలాంటప్పుడు ముందే ట్రంప్‌ ఈ ప్రస్తావన ఎందుకు తేలేదు. స్వయంగా యుద్ధ రంగంలోకి దిగి ఇరాన్‌లోని మూడు అణు స్థావారాల మీద బాంబులు ఎందుకు కురిపించినట్టు. శాంతి సాధనే కొత్త శాంతి దూత లక్ష్యం అయితే ఇజ్రాయిల్‌ కోరిక మేరకు ఇరాన్‌ మీద ఎందుకు విరుచుకు పడ్డట్టో! అణు స్థావరాలను ధ్వంసం చేయడమే తమ లక్ష్యం అయి ఉంటే నిష్కారణంగా ఇజ్రాయిల్‌ దాడి చేసినప్పుడు ట్రంప్‌ ఎందుకు మౌనంగా ఉన్నారు. ఇవి సమాధానం లేని ప్రశ్నలే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు