బాధిత న్యాయ విద్యార్థిని ఆవేదన
కోల్‌కతా : దక్షిణ కోల్‌కతాలో న్యాయ కళాశాలలో విద్యార్థినిని బంధించిన కిరాతకులు దుర్మార్గానికి ఒడిగట్టారు. తనను వదిలేయాలంటూ ఆమె ఎంతగా ప్రాధేయపడినా కనికరం కూడా చూపలేదు. ఈ నేపథ్యంలో ఆ మృగాళ్ల నుంచి తనకు ఎదురైన భయానక పరిస్థితులను బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా (31) ను కాళ్లు పట్టుకొని బతిమిలాడినా తనను వదిలిపెట్టలేదని… పైగా ఈ దుశ్చర్యను వారు ఫోన్లలో రికార్డు చేశారని ఆమె వాపోయారు.
బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా…
మోనోజిత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ దక్షిణ కోల్‌కతా జిల్లా యూనిట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని అతను ప్రతిపాదించగా… తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ ఆమె నిరాకరించడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌కు హాని చేస్తానని, తన తల్లిదండ్రులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూ కళాశాలలో బంధించాడని బాధితురాలు వాపోయారు. మరో ఇద్దరు విద్యార్థులు జుబీర్ అహ్మద్ (19), ప్రామిత్ ముఖర్జీ (20) లతో కలిసి తనపై దాడి చేయగా ప్రతిఘటించేందుకు ప్రయత్నించానని బాధితురాలు పేర్కొన్నారు. ‘వీడియోలు తీశారు. హాకీ స్టిక్‌తో కొట్టారు. లైంగిక చర్య జరిపే ఉద్దేశంతో నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించారు. నేను నిరాకరిస్తూ… దగ్గరికి రాకుండా ప్రతిఘటించి మోనోజిత్ని వెనక్కి నెట్టేశాను. ఏడుస్తూ వదిలిపెట్టాలని వేడుకున్నాను. బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. అతడిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అంగీకరించలేదు. మోనోజిత్ కాళ్లు పట్టుకొని వదిలేయాలని ప్రాధాయపడినా… వదల్లేదు. ఆ తర్వాత నన్ను సెక్యూరిటీ గార్డు రూమ్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. తీవ్ర భయాందోళనకు గురయ్యా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరినా ఎవరూ సహాయం చేయలేదు. ప్రధాన నిందితుడు అత్యాచారం చేస్తుంటే మిగతా ఇద్దరూ వీడియోలను రికార్డు చేశారు. నేను సహకరించకపోతే ఆ వీడియోలను అందరికీ చూపిస్తామని బెదిరించారు. అక్కడి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించిన క్రమంలో హాకీ స్టిక్‌తో దాడి చేశారు. నాకు న్యాయం చేయండి’ అని బాధితురాలు పోలీసులను కోరారు.
నిందితుల ఫోన్లు సీజ్
ఈ ఘటనకు ముందు తనను, మరో ఏడుగురిని క్యాంపస్ లోపల ఉన్న యూనియన్ గదిలోకి పిలిపించారని, అక్కడ మనోజిత్ మిశ్రా వ్యక్తిగత జీవితం, అతనికున్న పలుకుబడి గురించి మాట్లాడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ యూనియన్ పట్ల విధేయతతో ఉండాలని కోరగా… అందుకు తానూ అంగీకరించానన్నారు. పరీక్షలకు సంబంధించిన ఫారంలను నింపేందుకు విద్యార్థిని బుధవారం మధ్యాహ్నం కళాశాలకు వెళ్లగా… ఆమెను బంధించి రాత్రివేళ ఈ దుశ్చర్యకు ఒడిగట్టారు. ఆ తర్వాత రాత్రి 10.50 గంటల సమయంలో ఆమెను వదిలిపెట్టగా… బాధితురాలి ఫిర్యాదు మేరకు కస్బా పోలీసులు కేసు నమోదు చేశారు.


