. పోలవరం ఎమ్మెల్యేపై రూ.100 కోట్ల దుమారం
. అధిష్టానానికి చేరిన పంచాయితీ
. దేవినేని, కరాటం సంభాషణ హల్చల్
. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ వీడియో వైరల్
. ఏడాది దాటాక అంతర్గతం… బహిర్గతం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కూటమి ప్రభుత్వంలో అంతర్గత పోరు, కుమ్ములాటలు పేట్రేగిపోతున్నాయి. నామినేటెడ్ పోస్టుల నుంచి ఇసుక దందా… అభిప్రాయాల భేదాలు… అవినీతి వాటాలు సమతుల్యంగా కుదరకపోవడం వెరసి విభేదాలు పొడచూపుతున్నాయి. ఎవరికి వారు తాము సమన్వయంగా ఉంటామని పైకి చెబుతూనే… లోపల మాత్రం చేయాల్సిందంతా చేసేస్తున్నారు. వరుసవారీ సంఘటనలు చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసేలా ఉన్నాయి. ‘కూటమి’ ఏడాది పాలన తర్వాత నిర్వహించిన సర్వేలో చాలా మంది ఎమ్మెల్యేలు వెనుకబాటుకు గురైనట్లు సమాచారం వచ్చింది. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఖరి, మరోవైపు అవినీతి ఆరోపణలు… మాజీ మంత్రుల మనస్తాపం ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏకంగా ఏడాదిలోనే రూ.100 కోట్ల అవినీతి సొమ్ము సంపాదించడాన్న ప్రచారం ఆధిష్టానం చెంతకు చేరింది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జనసేన నేత కరాటం రాంబాబు మధ్య జరిగిన సంభాషణ సామాజిక మాద్యమాల్లోకి వచ్చిన తీరుపై అధిష్టానం వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. ఆది నుంచి టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఖరి ప్రభుత్వానికి కంట్లో నలసులా మారిపోయింది. తాజాగా టీడీపీ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రవర్తనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఓ వీడియోకాల్‌లో ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ఆయన ముద్దులు పెడుతున్న దృశ్యాలు సామాజిక మాద్యమంలో హల్చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే బాలరాజు ఏడాదిలోనే రూ.100 కోట్లు సంపాదించారా… ఆ విషయాన్ని తాను యూ ట్యూబ్ ద్వారా తెలుసుకున్నానని, పవన్ కల్యాణ్ దీనిపై మిమ్మల్ని ఎప్పుడూ అడగలేదా… అంటూ ఏకంగా టీడీపీకి చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు… ఆ ప్రాంతానికి చెందిన జనసేన నేత కరాటం రాంబాబుకు ఫోన్ చేసి అడిగిన సంభాషణ సామాజిక మాద్యమాల వేదికగా హల్చల్ చేస్తోంది. అసలే పార్టీ ఎమ్మెల్యే టికెట్టు రాక, ఆ తర్వాత రాజ్యసభ సీటు వస్తుందని ఆశించి దేవినేని ఉమా భంగపాటుకు గురయ్యారు. కనీసం ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్థానంలోను ఉమాకు ఎక్కడా చోటు లభించచకపోవడంతో అప్పటి నుంచి అసంతృప్తిగానే ఉన్నారు. ఆధిష్టానం వివరణ కోరితే దేవినేని, కరాటం వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇసుక దందా ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి. ఎమ్మెల్యే బాలరాజు స్పందిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరణిచ్చారు. దీనిపై ఆధిష్టానం చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు, తన నియోజకవర్గంలో ఏడాది కాలంలో రూ.100 కోట్లు సంపాదించే దిశగా ఏ వనరులు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. దేవినేని ఉమా, కరాటం రాంబాబు మధ్య సంభాషణ ఏ విధంగా వచ్చిందో తనకు తెలియదనీ, అదంతా ఆధిష్టానం చూసుకుంటుందని మీడియా ప్రశ్నలను దాటవేశారు. ఫోన్లో మాట్లాడిన సంభాషణను సామాజిక మాద్యమంలోకి తీసుకురావడం వెనుక కుట్రకోణం ఉందని చెప్పారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వ్తాల్లోకి ఎక్కారు. చంద్రబాబు ప్రభుత్వం ఆవిర్భావం నుంచి తిరువూరులో జరుగుతున్న ఆదిపత్య పోరుపై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ వస్తున్నారు. అది ఆయనకు నిజమే అయినా, బహిరంగంగా సామాజిక మద్యంలోకి వచ్చి వ్యాఖ్యలు చేయడం వార్తల్లోకి ఎక్కడం చంద్రబాబు ప్రభు త్వాన్ని ఇరకటంలో పెట్టేలా చేస్తోంది. తన నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలించుకుపోవ డంపై కొలికపూడి తిరుగుబావుటా ఎగరేశారు. ఎంపీ అనుచరులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ అధ్వర్యంలో భారీగా ఇసుక దందా కొనసాగుతున్నట్లు స్వయంగా కొలికిపూడి చేస్తున్న ఆరోపణలు చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి. తిరువూరు నియోజకవర్గంలోని పెద్దవరం ఇసుక డంపింగ్లను ఆయన పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ ఆయన బహిరంగంగా ఆరోపణలకు దిగారు. పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్ చేస్తున్నారని మండిపడ్డారు. తిరువూరుకు చెందిన గంజాయ్ బ్యాచ్‌కు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందని ఆయన పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు అమరావతి రాజధానికి రెండో విడత ల్యాండ్ పూలింగ్ కింద మరో 43వేల ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించగా, మంత్రివర్గంలో దాన్ని జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యతిరేకించగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలవడం, ఆ వెనువెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంఘటన చోటు చేసుకుంది. దాన్ని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మరచిపోయి రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఉంటుందని మీడియాలో లీకులు ఇవ్వడంపైనా జనసేన శ్రేణులు తప్పుపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో జనసేన నేతలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ప్రమాణస్వీకారంలో బీజేపీకి కేవలం నాలుగు శాతమే ఓట్లు అనే భావనతో టీడీపీ నేతలు ఉండటం తగదని, బీజేపీ లేనిదే ఆ పార్టీకి అన్ని సీట్లు వచ్చేవా అంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ తరహాగా ఏడాది దాటాక కూటమి నేతల్లో ఉన్న మనస్పర్థనలు, ఆదిపత్యపోరు ఒక్కొక్కటీ బయటకు రావడంతో పార్టీ అధినేతలకు పెద్ద తలనొప్పిగా మారింది.


