Tuesday, July 15, 2025
Homeకౌలు రైతుకష్టాలు తీరేనా?

కౌలు రైతుకష్టాలు తీరేనా?

అన్నదాత సుఖీభవ అందేదెలా?
అత్యధిక సాగుదారులున్నా ఆదరణ కరువు
అందని ద్రాక్షలా సబ్సిడీలు, రుణాలు

విశాలాంధ్ర- సచివాలయం: సేద్యం వారిదే… సాగుపెట్టుబడి కూడా వారిదే… భూమి మాత్రం వేరొకరిది… పంట పండినా పండకపోయినా, ప్రకృతి విపత్తులొచ్చి పంట చేతికందక నష్టం వచ్చినా భూమి యజమానికి కౌలు చెల్లించాల్సిందే. సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవను త్వరలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా ఇస్తామని చెబుతున్నా… ఇంతవరకు సాగుచేస్తున్న రైతులకు కౌలు కార్డులు ఇవ్వలేదు. కష్టపడి పంటలు పండిరచిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ భూమి కలిగిన రైతులు మాత్రమే ప్రభుత్వం దష్టిలో అన్నదాతలుగా పరిగణింపబడటమే ఈ దుస్థితికి కారణం. ప్రభుత్వం అందించే ఎలాంటి పథకాలు వర్తించకున్నా… సబ్సిడీలు, ఉచిత పథకాలు, పంట నష్టపోతే పరిహారం రాకున్నా వ్యవసాయమే జీవనాధారంగా కైలు రైతులు శ్రమ చేస్తున్నారు. కౌలురైతుల్లో చిన్న, సన్నకారు రైతులే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలోని 60.73 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో 27.15 లక్షల హెక్టార్లు అంటే 44 శాతం వ్యవసాయ విస్తీర్ణంలో కౌలు రైతులు సాగుచేస్తున్నారు. రైతు సంఘాలు మాత్రం రాష్ట్రంలో సుమారు 32 లక్షల మంది కౌలు రైతులున్నారని, వారిలో 10 శాతం మందికి కూడా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు అందటం లేదని చెబుతున్నాయి. కౌలు రైతులు గ్రామాల్లో రెండు రకాలుగా ఉన్నారు. పూర్తిస్థాయిలో భూమి లేనివారు ఇతరుల నుంచి భూమి తీసుకుని సాగు చేస్తున్నారు. వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుని ఉండే రైతులు తమకున్న ఎకరం, రెండకరాలతో పాటు తమ సామర్ధ్యానికి అనుగుణంగా తమ పక్కన ఉన్న భూములనో లేదా ఇతర చోట్ల ఉన్న భూములనో కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఇలాంటి చిన్న, సన్నకారు రైతులు కౌలుకు తీసుకుని చేసే పద్ధతి ఎక్కువ శాతం ఉంటుంది. సాగు వ్యయం భారీగా పెరగటంతో పాటు భూమి యజమానికి లాభనష్టాలతో సంబంధం లేకుండా కౌలు చెల్లించాల్సి రావటం, వడ్డీలేని పంట రుణాలు, రైతు భరోసా, పంటల బీమా, పంట నష్టపరిహారం తదితర పథకాల లబ్ధిదారుల జాబితాలో కౌలు రైతులకు చోటు లభించడం లేదు. దీంతో అనివార్యంగా ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి అధికవడ్డీకి నగదు తీసుకుని సాగు చేయాల్సిన పరిస్థితులు కౌలు రైతులను సంక్షోభంలోకి నెట్టివేశాయని కౌలు రైతు సంఘాలు చెబుతున్నాయి. ఎకరా భూమికి రైతులు చెల్లించే కౌలు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలుకుతోంది. నీరు సమద్ధిగా ఉండి, అనుకూలమైన భూమి ఉంటే కౌలు డబ్బులు అధిక మొత్తంలో చెల్లించక తప్పడం లేదు. ఇలా రైతు కౌలుచేస్తే భూ యజమానికి ఇవ్వగా మిగిలేది కూలి కూడా కష్టమేనని స్పష్టమవుతోంది. అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా తట్టుకొని సాగు చేసినా చివరకు నష్టాలే మిగిలుతున్నాయి. నిబంధనల ప్రకారం కౌలు రైతులను గుర్తించి… వారికి రుణ అర్హత కార్డులు అందచేసి… బ్యాంకు రుణాలు ఇవ్వాలి. కానీ, వీరిపై రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాగం ఎలాంటి దయ చూపడం లేదు. కౌలు రైతులు ఎలాంటి సహకారానికి నోచుకోవడం లేదు. కౌలు రైతులకు ఇతర రంగాల్లో ప్రావీణ్యం లేకపోవడంతో లాభనష్టాలతో సంబంధం లేకుండా కౌలు చెల్లించి వ్యవసాయం కొనసాగిస్తున్నారు. కౌలు రైతులకు ఎక్కడా అధికారిక గుర్తింపు లేకపోవడంతో రైతుల సంక్షేమ పథకానికి వీరు ఆనర్హులుగా మిగిలిపోతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకాలను సైతం అత్యధిక మంది పొందలేకపోయారు. కనీసం బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందలేకపోతున్నారు. వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ వడ్డీకి రుణాలు తెచ్చుకుని వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం అందించే అన్ని రకాల సాయం తమకు దక్కేలా చూడాలని, కూటమి ప్రభుత్వమైనా గత ప్రభుత్వ నిబంధనలు సడలించి సీసీఆర్‌సీ కార్డులు అందించేలా చర్యలు చేపట్టాలని కౌలు రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు