గ్రూపు-1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు, ఇంటి స్థలం
మహిళలు సత్తా చాటారు: చంద్రబాబు, లోకేశ్ ప్రశంస
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేత, టీమిండియా సభ్యురాలైన తెలుగమ్మాయి శ్రీచరణికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ నజరానా ప్రకటించారు. శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీంతో పాటు ఇల్లు నిర్మించుకునేం దుకు కడపలో 1000 చ.గ. స్థలం కేటాయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్ 1 అధికారిగా ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాల యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్‌ను శ్రీచరణి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందక్షణా లను వారితో పంచుకున్నారు. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేయగా… చంద్రబాబు, లోకేశ్ ఆమెను అభినందించారు. ప్రపంచ కప్ గెలుచుకోవడం ద్వారా మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు భారత జట్టుకు అందించాలని అభిలషించారు. ఈ సందర్భంగా మహిళా క్రికెటర్లు సంతకాలు చేసిన టీ షర్ట్‌ను ముఖ్యమంత్రికి శ్రీచరణి అందించారు. దానిని ఆప్యాయంగా స్వీకరించిన ముఖ్యమంత్రి… శ్రీచరణి బృందం భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. శ్రీచరణితో పాటు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీశ్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఘనస్వాగతం పలికారు. ఆమెతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. క్యాంపు కార్యాలయంలో శ్రీచరణికి నారా లోకేశ్ స్వాగతం పలికారు.


