. మూడు మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు
. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సీఎం చంద్రబాబు
. రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల కోసం అవసరమైన భూముల్లో విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 12వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనల్ని ఎస్‌ఐపీబీ ఆమోదించింది. వీటి ద్వారా రూ.1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడచిన 16 నెలల్లో జరిగిన 12 ఎస్‌ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తంగా రూ. 8,08,899 కోట్ల పెటు ్టబడులు, 7,05,870 ఉద్యోగాలు రానున్నా యి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియజేయాలన్నారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలి. క్షేత్ర స్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలి. గత పాలకులు భూమి కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించాలి. ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఇలాంటి వాటిని గుర్తించి ప్రమోట్ చేయాలి. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైనా… రాష్ట్ర ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు చేజారకుండా చూడాలన్నారు. పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండ్ బ్యాంక్ సిద్దం చేసుకోవాలని, ప్రైవేటు భూ యజమానులెవరైనా తమ భూములను పరిశ్రమలకు ఇవ్వడానికి ముందుకు వస్తే ప్రోత్సహించాలని సీఎం కోరారు.
మెగా సిటీలు… మాస్టర్ ప్లాన్లు
రాష్ట్రంలో మూడు మెగా సిటీలు, 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని… క్లస్టర్ వారీ విధానంతో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖను మెగా సిటీగా అభివృద్ధి చేయాలి. అలాగే తిరుపతి, అమరావతి నగరాలను కూడా మెగా సిటీలు చేయాలి. ఇప్పటికే అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతి మెగా సిటీలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ఈ మెగా సిటీలను టూరిజం, ఐటీ సహా వివిధ పరిశ్రమలకు అనుకూలంగా ఉండేలా చూడాలి. ఈ మేరకు టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు సమన్వయం చేసుకుని ఈ మెగా సిటీలు అభివృద్ధి జరిగేలా చూడాలి. అలాగే వీటికి టౌన్ షిప్స్ ఇంటిగ్రేషన్ జరగాలి, నివాసయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దాలి. గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయి. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలకు భూ లభ్యత ఉండేలా చూసుకోవాలి. టూరిజం అభివృద్ధికి ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించాలి. ప్రముఖ బ్రాండ్ లకు చెందిన హోటళ్లు నిర్మించేలా చూడాలి. రాష్ట్రంలో మూడు ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు అవుతున్నాయి. దీనికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంది. ఈ మేరకు మూడు కారిడార్లకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తామని సీఎం వెల్లడిరచారు.
సదస్సుకు ముందే శంకుస్థాపనలు
ఈ నెల, 14,15వ తేదీల్లో విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈలోగా ఎస్‌ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల్లో వేగంగా శంకుస్థాపనలు జరిగేలా చూడాలని అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో తనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు ఆయా జిల్లాల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవి కుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసం శెట్టి సుభాశ్, సీఎస్ విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


