నా చుట్టూ ఉన్న లోకం విరిగి
నా స్వప్నాలపై పడింది.
తూర్పు సూర్యుడు పడమరలో కలసిపోయినట్టు
జీవితం సాగిపోయింది.
పారేసుకున్నది ఏరుకోవడంలో
పోగొట్టుకున్నది వెతుక్కోవడంలో
బతుకంతా ‘ప్రేమను గుమ్మరించి’
బంధాల్ని నిలుపుకోవడంతోనే సరిపోయింది.
‘నిందలు వేలెత్తి చూపినా’ లెక్కసేయక
మారని దారిలో నవ్వుతూ కొంత కాలం
‘కాలమేఘం’ సృష్టించిన తుఫాన్లను,
‘నమ్మకద్రోహ’ బాధల బడబాగ్నులను
ఎదుర్కోవడంలో మరికొంతకాలం
ధిక్కారస్వరం ‘గుడ్లురిమితే’ ఉరమనీ
బాగుపడితే చాలనుకోవడంలో
ఇంకొంత కాలం, గడిచిపోయింది.
ఎటువైపు చూసినా
ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుళ్లతో సాగిన కాలం,
బస్తాలకొద్దీ చేదు స్మృతులూ, గుర్తొస్తుంటే
ఎవరో భూకంపంలా
గుండెల్ని బాదుతున్నట్టు కన్నీళ్లు ఉబికొస్తున్నాయి,
అలా జరిగుండకపోతే ఎంత బాగుండునని.
దాపరికపు ఒడిలో
ఒంటరిగా మిగిలిపోయిన నేను
ఇంకేం చేయగలననుకుంటున్న
సమయంలో, నే కూర్చున్న పార్కులో
శతాబ్దాల చరిత గలిగిన వటవృక్షం
ఎందరికో నీడనిస్తూ కనపడింది.
బోధిసత్వునిలా కళ్లు తెరిచి
పార్కు నుంచి బయలుదేరా,
సముద్రాన్ని లంఘించడానికి వెళుతున్న అంజనీసుతునిలా!
వేమూరి శ్రీనివాస్, 9912128967
గతం-అవగతం
- Advertisement -


