ఇంట్లోకి చొరబడి కాల్చిచంపిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు
న్యాయ విచారణకు సైఫ్ రాజకీయ బృందం డిమాండ్
ట్రిపోలీ: లిబియా మాజీ అధినేత గద్దాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని నలుగురు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. జింటాన్‌లోని గద్దాఫీ ఇంటిలోకి చొరబడి ఆయనను కాల్చి చంపినట్లు సైఫ్ సలహదారుడు వెల్లడించారు. ఈ దాడి సూత్రధారి ఎవరో తేలాల్సి ఉన్నట్లు చెప్పారు. హత్యకు ముందు తన భద్రత విషయంలో సైఫ్ మిత్రుడి వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు. హంతకులు సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలిసింది. 2011 నాటి ప్రజా విప్లవం తర్వాత పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న సైఫ్ ఈ మధ్యకాలంలోనే ప్రజల్లోకి వచ్చారు. రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలనుకున్నారు. కానీ ఆ కల నెరవేరకుండానే హత్యకు గురయ్యారు.మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ముసుగు వేసుకున్న నలుగురు సైఫ్‌పై దాడి చేశారు. దీనిని ఆయన న్యాయవాది మార్సెల్ సెకాల్డి, రాజకీయ సలహాదారు అబ్దుల్లా ఉస్మాన్ అబ్దుల్ రహీం ధృవీకరించారు. సైఫ్‌కు అపాయం ఉన్నట్లు కొద్ది రోజులుగా ఆయన భద్రతా బందానికి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. గద్దాఫీ తెగకు చెందిన పెద్దలు అదనపు భద్రతను ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు కానీ సైఫ్ ఒప్ప్పుకోలేదు. భద్రతా వైఫల్యాన్నే ఆసరాగా చేసుకున్న దండగులు ఆయన నివాసంలోకి చొరబడి హత్య చేశారు. తండ్రి బతికున్నప్ప్పుడు సైఫ్‌ను ఆయన రాజకీయ వారసుడిగా భావించేవారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్న ఆయనను. తొలినాళ్లలో సంస్కరణవాదిగా చెప్ప్పుకునేవారు. 2011 అరబ్ స్ప్రింగ్ విప్లవ సమయంలో నిరసనకారులను ఎలుకలుగా అభివర్ణించి, రక్తపు ఏరులు పారిస్తామని హెచ్చరించడంతో సైఫ్ ప్రతిష్ట దెబ్బతింది. గద్దాఫీ హత్య తర్వాత జింటాన్ మిలిషియాకు పట్టుబడ్డారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, ట్రిపోలీ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే 2017లో అమ్నెస్టీ ద్వారా సైఫ్ విడుదలయ్యారు. సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ మరణం లిబియా రాజకీయాల్లో సంచలనంగా మారింది. 2021లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీని ప్రకటించడంతో గద్దాఫీ మద్దతుదారులు ఏకమయ్యారు. కానీ ఆ ఎన్నికలు వాయిదా పడటంతో సైఫ్ జింటాన్‌లోనే ఉన్నారు. సైఫ్ మరణంపై గద్దాఫీ మద్దతుదారుల ఆగ్రహంతో లిబియాలో మళ్లీ అంతర్గత కýహాలు మొదలయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ హత్యను పిరికిపంద చర్యగా సైఫ్ రాజకీయ బృందం పేర్కొంది. ఈ ఘటనపై అంతర్జాతీయ విచారణను డిమాండ్ చేస్తోంది. లిబియా అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తును ప్రారంభించింది. 444 కాంబాట్ బ్రిగేడ్ వంటి సాయుధ సంస్థలు ఈ హత్యతో సంబంధం లేదని ప్రకటించాయి.


