ధర్మేంద్ర కుమార్తె ఈషా
ముంబై: ఇటీవల కన్నుమూసిన ప్రముఖ హిందీ నటుడు ధర్మేంద్రకు ఆస్కార్ వేడుకలో తగిన గౌరవం దక్కలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన కుమార్తె, నటి ఈషా స్పందించారు. ఈ వేడుకలోని ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్లో ధర్మేంద్ర పేరును విస్మరించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఈషా… ఆస్కార్ వేదికపై తన తండ్రి పేరు ప్రసారం కాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందేం లేదన్నారు. ఒకవేళ ఆయన జీవించి ఉన్నా కూడా ఇలాంటి వేడుకల గురించి పట్టించుకునేవారు కాదన్నారు. ఆయన ఎప్పుడూ గుర్తింపు కోసమో, హోదా కోసమో పాకులాడలేదని స్పష్టం చేశారు. తన తండ్రి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, ఆయనకు ప్రేక్షకుల హృదయాల్లో సంపాదించుకున్న స్థానం మాత్రమే ముఖ్యమని తెలిపారు. ఇలాంటి అధికారిక గౌరవాలు ఆయన కోరుకోరని స్పష్టంచేశారు. దీనిపై హేమమాలిని కూడా స్పందిస్తూ.. ఆస్కార్ వేడుకలో ధర్మేంద్రను విస్మరించడం బాధాకరమే అయినా, ఆయనకు అభిమానుల ప్రేమే గొప్ప అవార్డు అని అభిప్రాయపడ్డారు. నవంబర్ 2025లో ధర్మేంద్ర మరణించిన తర్వాత జరిగిన 2026 ఆస్కార్ వేడుకలో ఆయనను స్మరించుకోకపోవడం వివాదస్పదమైంది. అయితే, లైవ్ టెలికాస్ట్‌లో ఆయన పేరు లేకపోయినప్పటికీ, అకాడమీ అధికారిక వెబ్సైట్ గ్యాలరీలో ఆయన పేరును చేర్చారు.
గుర్తింపు కోసం మా నాన్న ఏనాడూ పాకులాడలేదు
- Advertisement -


