Homeఆంధ్రప్రదేశ్టిటిడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

టిటిడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

- Advertisement -

దాతలకు కల్పించే సౌకర్యాల్లో మార్పులు

ప్రివిలైజెస్ ను తగ్గిస్తూ కొత్త పాలసీ ప్రవేశపెట్టాం

నేటి అర్థ రాత్రి నుండి అమ‌లు

ఎస్ఎస్‌డి భ‌క్తుల‌కు నూత‌న షెడ్లు, క్యూలైన్లు

రూ.17.84 కోట్లతో ఒంటిమిట్టలో 100 గదుల నిర్మాణం

వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియామ‌కం

టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

విశాలాంధ్ర – తిరుమల:

టీటీడీలోని వివిధ ట్ర‌స్టులు మ‌రియు స్కీమ్‌ల‌కు విరాళాలు అందించే దాత‌ల‌కు క‌ల్పిస్తున్న ప్రివిలేజెస్‌లో ప‌లు మార్పులు చేస్తున్న‌ట్లు టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు చెప్పారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం టీటీడీ బోర్డు స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం టీటీడీ ఛైర్మ‌న్, ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా టీటీడీ ఛైర్మ‌న్ మాట్లాడుతూ, విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి (యూనిఫార్మిటీ) తీసుకురావడానికి టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రివిలేజెస్‌లో పలు మార్పులు చేపట్టామ‌న్నారు. ఈ కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయ‌ని తెలిపారు. అయితే, ఇప్పటికే వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.
రూ.6.31 కోట్ల‌తో తిరుమ‌ల‌లో ఎస్ ఎస్ డి టోకెన్లు క‌లిగిన భ‌క్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ స‌మీపంలో శాశ్వ‌త షెల్ట‌ర్లు, క్యూలైన్లు, మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు టెండ‌ర్లు ఆమోదం.
తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యామ్‌లు మరింత ప‌టిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్లు మంజూరుకు ఆమోదం.
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయ‌డంలో భాగంగా జి ఎన్ సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ జనరేటర్‌ను విష్‌ విండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంత‌రాయంగా విద్యుత్ అందించేందుకు ఆమోదం.
తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 ఏళ్లు పైబడిన సందర్శకులకు రూ.50 గా ( జీఎస్టీ తో కలిపి) ప్రవేశ రుసుము నిర్ణయించడ‌మైన‌ది. త‌దుప‌రి మ్యూజియం నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను టాటా సంస్థ ద్వారా నిర్వ‌హించేందుకు గాను ఆ సంస్థ‌ను కోరాల‌ని నిర్ణ‌యం.
తిరుమల కాకులమానుతిప్ప సమీపంలోని 25 ఏళ్లకు పైబడిన పాత ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయ‌డానికి రూ.5 కోట్లు మంజూరుకు ఆమోదం.
భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో నిర్వహణ పనులను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం.
తిరుమ‌ల‌లోని టీబీసీ మ‌రియు ఏ టి సి విశ్రాంతి భ‌వ‌నాల వ‌ద్ద ఉన్న 12 పాత భ‌వ‌నాల‌ను తొల‌గించి, వాటి స్థానంలో దాత‌ల స‌హ‌కారంతో నూత‌న భ‌వ‌నాన‌లు నిర్మించేందుకు నిర్ణ‌యం.
2027వ సంవ‌త్స‌రానికి సంబంధించి శ్రీ‌వారి క్యాలెండ‌ర్లు, డైరీలు ముద్రించేందుకు టీటీడీ బోర్డు నిర్ణ‌యించింది. ఇందులో డైరీలు 10 ల‌క్ష‌లు, 12 పేజీల‌ క్యాలెండ‌ర్లు 13.50 ల‌క్ష‌లు, 6 పేజీల‌ క్యాలెండ‌ర్లు 75 వేలు ముద్రించేందుకు ఆమోదం.
తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్‌లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు, ఎఫ్ఎంఎస్ సేవ‌ల‌కు రూ.2.91 కోట్లు మంజూరు.
ఒంటిమిట్ట శ్రీ సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామివారి మూల‌వ‌ర్ల‌కు బంగారు కవచాల తయారీకి టీటీడీ ట్రెజరీలోని వెయ్యి గ్రాముల‌ బంగారాన్ని వినియోగించుకునేందుకు ఆమోదం.
రూ.17.84 కోట్లతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వద్ద యాత్రికుల సౌకర్యార్థం 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మాణానికి టెండ‌ర్లు ఆమోదం.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల అభివృద్ధి కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు టీటీడీ బోర్డు ఆమోదం.
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై “సాలహారం” నిర్మాణం, మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్ల‌తో టెండ‌ర్ కు ఆమోదం.
టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధర్వణ వేదాలను నిరంతరాయంగా పారాయణం జరిగేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో కూడా నిత్య పారాయణం, లోక కల్యాణం జరిగేలా వేద పారాయణ స్కీం ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల పారితోషికాన్ని ఆయా క‌ళాకారుల నైపుణ్యాన్ని బ‌ట్టి పెంచేందుకు ఆమోదం.
టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం.
ఈ స‌మావేశంలో పలువురు బోర్డు స‌భ్యులు, అద‌న‌పు ఈవో సిహెచ్ వెంక‌య్య చౌద‌రి, జేఈవో డా.ఎ.శ‌ర‌త్‌, సివిఎస్వో ముర‌ళీకృష్ణ‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు