కాకినాడ జిల్లా కిర్లంపూడిలో విషాదఛాయలు
కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి, వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభం(73) కన్నుమూశారు. కొంతకాలంగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు సీఆర్‌ఆర్‌టీ సాయంతో చికిత్స అందించారు. మరుసటిరోజు కుటుంబసభ్యులు సమీపంలో ఉన్న సింధు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. ప్రొస్టేట్‌తో పాటు కిడ్నీలు, శ్వాసకోశ సమస్యలు ఉండటంతో డయాలసిస్, ఇతర చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి మంగళవారం సాయంత్రం పద్మనాభం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తన తండ్రి పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందారని, బుధవారం కిర్లంపూడికి పార్థివదేహాన్ని తీసుకొస్తామని కుమారుడు గిరి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పద్మనాభం 1953 జనవరి 22న ప్రస్తుత కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 1967లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. భార్య పద్మావతి, కుమారులు వీర రాఘవరావు(బాలు), చెల్లారావు (గిరిబాబు), కుమార్తె క్రాంతి ఉన్నారు.
రాజకీయ ప్రస్థానం..
ప్రత్తిపాడు నుంచి 1978లో జనతాపార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ముద్రగడ గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున పోటీచేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా సమర్పించారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీతో కలిసి కత్తిపూడిలో బహిరంగ సభ పెట్టిన ముద్రగడ.. కాంగ్రెస్‌లో చేరారు. 1989లో ఆ పార్టీ తరఫున గెలిచి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994లో ప్రత్తిపాడు నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 1999లో తెదేపాలో చేరి కాకినాడ నుంచి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. 2004లో మరోసారి ఎంపీగా పోటీచేసినా విజయం దక్కలేదు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ప్రత్తిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త కాగా కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలు.
కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది.
2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ 70 వేలకు పైబడి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన సవాల్‌కు కట్టుబడి 2024 జూన్ 20న గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు.
ముద్రగడ మరణంపై గవర్నర్, సీఎం సహా ప్రముఖుల విచారం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిపై గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఆయన అందించిన సేవలను గవర్నర్ గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముద్రగడ మరణం బాధాకరం: సీఎం చంద్రబాబు
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్త విచారం కలిగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘పద్మనాభం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను్ణ అని పేర్కొన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తెలిపారు. ‘ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. పద్మనాభం 4 సార్లు శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు్ణ అని గుర్తుచేశారు.
మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం : జగన్
పద్మనాభం మృతిపై వైకాపా అధ్యక్షుడు జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబును ఫోన్‌లో పరామర్శించారు. కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి అలుపెరగకుండా పోరాడారు. మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.


