Homeఆంధ్రప్రదేశ్శివరాత్రి తలపించిన సోమవారం..!

శివరాత్రి తలపించిన సోమవారం..!

- Advertisement -

భక్తులు భారీగా పోటేత్తినా చక్కగా సేవలందించిన అధికారులు..!

విశాలాంధ్ర _శ్రీకాళహస్తి
ఇసుకేస్తే రాలనంత జనం… ఎటుచూసినా శివనామస్మరణ చేస్తూ పోటేత్తిన భక్తజనం.. మహాశివరాత్రి తలపించేలా భారీ ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చినా, ఉన్న కొద్ది పాటి అధికారులు, సిబ్బందితోనే ఆలయాధికారులు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆలయంలో చేపట్టిన పలు భారీ సంస్కరణలు ,ముందస్తు ప్రణాళికలు నిన్నటి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే ఆదేశాల్లో భాగంగా ఎక్కడా ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా వేలాదిమంది మంది భక్తులకు శివయ్య దర్శనభాగ్యం అధికారులు కల్పించారు. కింది స్థాయి అటెండర్‌ నుంచి పై స్థాయి అధికారి వరకు ఆలయంలోనే తిష్టవేసి భక్తులకు అసౌకర్యం లేకుండా చూశారు. ఆలయ ఈవో బి.వెంకటేశులతో పాటు చైర్మన్‌ కొట్టేసాయి ప్రసాద్, బోర్డు సభ్యులు వాకిచర్ల గుర్రప్పశెట్టి, మురళి,లు సైతం ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు ఆలయంలోనే ఉండి భక్తులకు సేవలందించారు. ఆలయ ఈవో బి కే వెంకటేశులు స్వామివారి సన్నిధి, అమ్మవారి సన్నిధి, కంచు గడప వద్ద భక్తుల రద్దీని క్యూలైన్లను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించారు.మాసశివరాత్రితో పాటు సోమవారం ఆరుద్ర నక్షత్రం, అమావాస్య రావడంతో ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఎన్నో ఏళ్ల ఒకసారి మాత్రమే వచ్చే అద్భుతమైన రోజులో శివయ్యను దర్శించుకోవడం ఎన్నో జన్మల పుణ్యమని భక్తుల నమ్మకం. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కావడంతో దీంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా తమిళనాడు, కర్నాటకతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఉదయం నాలుగుగంటలకే ఆలయం వద్దకు చేరుకున్నారు. తాకిడి గమనించిన ఆలయాధికారులు ఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈవో ఆలయాధికారులతో చర్చించి ఏర్పాట్లపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. అందరికి విధులు కేటాయించి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, 35 మంది హోంగార్డులు, 185 మంది ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఉన్న కొద్దిపాటి ఆలయ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ విధులు కేటాయించారు.
ఉదయం నుంచి ఆలయంలోనే విధులు
ఆలయ ఈవోతో పాటు చైర్మన్‌ కొట్టేసాయి ప్రసాద్ స్వామి సన్నిధి వద్ద, బోర్డు సభ్యుడు గుర్రప్పశెట్టి కంచు గడప వద్ద తదితరులు కూడా స్వామి వారి ఆలయం వద్దే కూర్చుని క్యూలైన్లను నియంత్రించారు. అడ్డదారిలో ఎవర్ని వెళ్లనీయకుండా అందరికి దర్శన భాగ్యం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పడంతో ఇబ్బంది లేకుండా చేశారు. ఇక ఆలయ ప్రధాన గేటు నుంచి ఆలయం వరకు భారీగా క్యూలైన్లు అన్ని నిండిపోయి రోడ్డుపైకి రావడంతో వారందరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు , చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు అందజేశారు. ఎప్పడకప్పుడు క్యూలైన్లను ఆపకుండా దర్శనాలకు అనుమతించారు. పర్వదినం రోజు ఉదయం నుంచి భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. సుమారు 80 వేల మంది పైచిలుకు భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయాధికారులు చెప్పారు. రాత్రి 10.30 దాటిన భక్తుల తాకిడి తగ్గకపోవడంతో క్యూలైన్లలో ఉన్న భక్తులందరికి దర్శనం కల్పించాలని నిర్ణయించి ఆ మేరకు దర్శనం ఏర్పాటు చేశారు.
వేలాది మంది భక్తులకు చక్కగా ఏర్పాట్లు
భక్తుల రద్దీ, ఏర్పాట్లపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి ఎప్పటికప్పుడు ఆలయాధికారులతో ఫోన్‌లో సంప్రదించి దిశా నిర్ధేశం చేశారు. ఎండవేడిమి అధికంగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లలో నిరంతరం మంచినీరు అందించారు. ఇక అన్నదానం కూడా అందరికి అందేలా చర్యలు తీసుకున్నారు. సాధారణంగా ముక్కంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినంకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా అధికారులను, పోలీసులను, బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తుంటారు. కానీ మహాశివరాత్రి తలపించేలా అశేష భక్తులు తరలి వచ్చినా ఎలాంటి ముందుస్తు బందోబస్తు, ఏర్పాట్లు లేకపోయినా అధికారులు ఏ ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా నిర్వహించారు. ఎమ్మెల్యే సైతం అధికారులను అభినందించారు. అందరూ కలిసి సమిష్టిగా కలిసి పనిచేశారని కొనియాడారు.
ఏకాంత సేవ ఆలస్యం..!
కనివిని రీతిలో ఆలయానికి భక్తులు పోటెత్తడం తో క్యూలైన్ లో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పించాలని ఆలయ ఈవో బి కే వెంకటేశులు ఆదేశించటంతో చివరి భక్తుడు వరకు దర్శన ఏర్పాట్లు చేశారు. రాత్రి 10.45 తరువాత ఆలస్యంగా ఏకాంత సేవ నిర్వహించారు. సాధారణంగా ఏకాంత సేవ 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆలయ చరిత్రలో ఇలా మొదటిసారి జరగటం గమనార్హం.భక్తులు స్వామి అమ్మవార్లని చూడలేకపోయామనే బాధ పడకుండా అందరికి దర్శన సౌకర్యం ఏర్పాటు చేయటం జరిగింది అని ఆలయ ఈవో బి కే వెంకటేశులు తెలిపారు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ లు విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వెంకటస్వామి, ఆలయ సూపర్డెంట్, నాగభూషణం , ఆలయ పిఆర్వో లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులందరూ ఆలయంలోనే తిష్ట వేసి భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దర్శనం చేయించారు. మహాశివరాత్రి తలపించేలా అశేష భక్తజనం పోటెత్తినా అధికారులు చక్కగా ఏర్పాట్లు చేశారని సుధూరు ప్రాంతం భక్తులు, స్థానికులు సైతం కొనియాడారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి అమ్మవార్లని దర్శించుకున్నట్లు తెలియచేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు