ఎరువుల పంపిణీపై సరికొత్త ఆంక్షలు
- ఖరీఫ్ ఆరంభంలోనే అన్నదాతలకు ఇబ్బందులు
- ఆన్ లైన్ మెలికలు… సర్వర్ల మొరాయింపు
- ఆర్ఎస్కేల చుట్టూ ప్రదక్షిణలు
- కౌలు రైతులకు తీరని అన్యాయం
- పాత పద్ధతిలోనే ఇవ్వాలని రైతు సంఘాల పోరు
- అంతా పారదర్శకమేనంటున్న ప్రభుత్వం
విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ అప్పుడే ప్రారంభమయి జోరందుకుంటున్న వేళ… పొలాల్లో చెమటోడ్చాల్సిన అన్నదాతలు ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసమంటూ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సరికొత్త ‘యాప్’ విధానం క్షేత్రస్థాయిలో రైతులకు సరికొత్త ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అసలే రోజు రోజుకూ పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలు, రసాయన ఎరువుల ధరలతో కుదేలయిన రైతాంగానికి ఈ సరికొత్త డిజిటల్ ఆంక్షలు ఉక్కిర్ఙిక్కిరి చేస్తున్నాయి. పంటల క్షేత్రస్థాయి అవసరాలతో నిమిత్తం లేకుండా, మారుతున్న వాతావరణ పరిస్థితులను అంచనా వేయకుండా, కేవలం యాప్ ఆధారంగా కోటాలు విధించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రైతు సేవా కేంద్రాలకు ఎరువుల కోసం వెళుతున్న రైతులకు అక్కడ సాంకేతిక తిరస్కరణలు ఎదురవుతున్నాయి. ‘మీ భూమి ఆన్ లైన్ రికార్డుల్లో లేదు. గత ఏడాది మీ పొలానికి ఈ-క్రాప్ నమోదు కాలేదు. భూమి విస్తీర్ణానికి ఎంత ఎరువు ఇవ్వాలో యాప్లో ఆప్షన్ చూపించడం లేదు’ అంటూ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడిన రైతులను, చివరకు ‘సర్వర్ డౌన్’ అయ్యిందంటూ వెనక్కి పంపుతున్నారు. పంటకు ఎప్పుడు, ఏ సమయంలో ఎంత ఎరువు వేయాలో అనుభవజ్ఞులైన రైతులకు తెలుసు కానీ, ఎకరాకు ఇన్ని బస్తాలే ఇవ్వాలని, అది కూడా మూడు దఫాలుగా విడతల వారీగా మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ గందరగోళం వల్ల ఎరువులు సకాలంలో దొరక్క వ్యవసాయోత్పత్తి ఘోరంగా దెబ్బతినే ప్రమాదం ఉందని, ఇది యావత్ రాష్ట్రభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నూతన విధానం వల్ల సొంత భూమి లేని కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా, అగమ్యగోచరంగా తయారయింది. భూమి రికార్డుల (వెబ్ ల్యాండ్) ఆధారంగానే ఎరువుల కోటాను యాప్ నిర్దేశిస్తుండటంతో భూ యజమానుల పేర్లు ఆన్ లైన్లో లేకపోవడమో, కౌలు గుర్తింపు కార్డులు సరిగ్గా లింక్ కాకపోవడమో జరిగి, అసలయిన కౌలు రైతులకు ఎరువులు దొరకడమే గగనమైపోయింది. దీంతో వారు వ్యవసాయం చేయాలా? వద్దా? అన్న తీవ్ర సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. నిజానికి ఎరువుల దుర్వినియోగానికి పాల్పడే బడా వ్యాపారస్తులను, కృత్రిమ కొరత సృష్టించే బ్లాక్ మార్కెట్ వీరులను కట్టడి చేయడానికి అనేక మార్గాలు ఉండగా, వాటిని వదిలేసి సామాన్య రైతులను డిజిటల్ నెపంతో వేధించడం ఎంత వరకు న్యాయమని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వెంటనే ఈ యాప్ విధానాన్ని ఉపసంహరించి, పాత పద్ధతిలోనే పంటల అవసరాలకు అనుగుణంగా యమూరియా, డీఏపీ వంటి ఎరువులను రైతులకు, కౌలు రైతులకు పూర్తి స్థాయిలో అందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
20 రోజుల్లో 15 లక్షల బస్తాలిచ్చామన్న మంత్రి
అయితే క్షేత్రస్థాయిలో వస్తున్న ఈ తీవ్ర ఆరోపణలను, అభ్యంతరాలను ప్రభుత్వం గట్టిగా తోసిపుచ్చుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, అంతా సజావుగానే సాగుతుందని సంబంధిత మంత్రి అచ్చెనాయుడు స్పష్టం చేశారు. శాస్త్రవేత్తల సిఫార్సులు, మట్టి పరీక్షల ఆధారంగా ప్రాంతాల వారీగా సమతుల్య ఎరువులు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టామని, కేవలం 20 రోజుల్లోనే ఈ యాప్ ద్వారా రికార్డు స్థాయిలో 15 లక్షలకు పైగా ఎరువుల బస్తాలను రైతులకు విజయవంతంగా పంపిణీ చేశామని మంత్రి గణాంకాలను వెల్లడించారు. ఈ డిజిటల్ సేవల ద్వారా ఇప్పటికే 3 లక్షల మందికి పైగా కౌలు రైతులు ప్రయోజనం పొందారని, ఇది ఎంతో ఆనందదాయకమన్నారు. భూమి ఆరోగ్యం కాపాడాలంటే రసాయన ఎరువుల మోతాదు తగ్గించి మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగించడం తప్పనిసరని, తద్వారా దిగుబడులు, నాణ్యత రెండూ మెరుగుపడతాయని సూచించారు. ఆధునిక సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, అలాగే వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఒకవైపు ప్రభుత్వ గణాంకాలు, సంస్కరణల వాదన ఘనంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో యాప్ తెచ్చిన తంటాలతో విసిగిపోతున్న రైతాంగ నిరసనలను ప్రభుత్వం ఎలా శాంతింపజేస్తుందో, ఈ ఖరీఫ్ సీజన్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


