Homeడేటా సెంటర్లతోభారీ ముప్పు

డేటా సెంటర్లతోభారీ ముప్పు

- Advertisement -

విద్యుత్‌, నీరు ప్రజలకు అందడం గగనమే

. విదేశాల్లో తీవ్ర వ్యతిరేకత
. కార్పొరేట్‌ సంస్థలకు భూముల ధారాదత్తానికి పాలకుల కుట్ర

విశాలాంధ్ర బ్యూరో- విశాఖపట్నం: డేటా సెంటర్ల ఏర్పాటు అత్యంత ప్రమాదకరమని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా సెంటర్లు వద్దంటూ అనేక దేశాల్లో ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. డేటా సెంటర్ల వల్ల లాభాలు ఎంత ఉన్నాయో… నష్టాలు కూడా 100 రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల పేరుతో ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీయొద్దని సూచిస్తున్నారు. నీరు, విద్యుత్‌ కొరత సృష్టించి ప్రజలపై అధిక భారం మోపవద్దని మేధావులు స్పష్టంచేస్తున్నారు. డేటా సెంటర్‌కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఫ్లాట్లు కొనొద్దని, అక్కడ ఉండలేరని ఐరోపాలోని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, డెన్మార్క్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఐర్లాండ్‌లో డేటా సెంటర్‌ పెట్టాలని గూగుల్‌ ప్రయత్నం చేయగా… తమ దేశ ప్రజలంతా వినియోగించే విద్యుత్‌ ఒక్క డేటా సెంటర్‌కే ఇవ్వాల్సి ఉంటుందని, తమ దేశంలో డేటా సెంటర్‌ వద్దని ఐర్లాండ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. నెదర్లాండ్స్‌లో డేటా సెంటర్‌ పెట్టాలని మెటా ప్రయత్నం చేయగా… ఆక్కడి ప్రజలు వ్యతిరేకించటంతో నెదర్లాండ్స్‌ ప్రభుత్వం సైతం వెనక్కి తగ్గింది. అంతేకాకుండా దేశంలో పెద్ద డేటా సెంటర్లు పెట్టటానికి వీలు లేదని ఏకంగా చట్టమే చేసింది. డెన్మార్క్‌ కూడా పెద్ద డేటా సెంటర్లు పెట్టటం వలన పవర్‌ గ్రిడ్లు దెబ్బతినటం తప్ప ఉపయోగం తక్కువని అనుమతులు ఇవ్వటం లేదు.
ఇక గూగుల్‌ లాటిన్‌ అమెరికా దేశాలైన చిలీ, ఉరుగ్వే, మెక్సికో దేశాల్లో డేటా సెంటర్‌ పెట్టాలని ప్రయత్నించింది. ఎలాగోలా ఆ ప్రభుత్వాల నుంచి కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ ప్రజలు, పర్యావరణవేత్తలు నిరసన వ్యక్తం చేయటంతో ఈ పెద్ద కంపెనీలు ముందుకు కదలలేని పరిస్థితుల్లో ఏర్పడ్డాయి. అమెరికాలో డేటా సెంటర్‌ హబ్‌గా పేరొందిన రాష్ట్రం వర్జీనియా… పవర్‌ గ్రిడ్‌ మీద పడే లోడు, పెరిగిన కరెంట్‌ బిల్లులు, వాటి నుంచి నిరంతరం వచ్చే ఉద్గారాలు, శబ్దాలు, విపరీతమైన నీటివినియోగం, అవి తీసుకునే వందల ఎకరాల భూమి, ఇవన్నీ గమనించాక వాటిలో వచ్చే ఉద్యోగాల కన్నా నష్టపోయేది ఎక్కువ అని గ్రహించిన ప్రజలు వాటిని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు ఏ రాజకీయ నాయకుడైనా వాటికి మద్దతుగా మాట్లాడితే అక్కడి ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ డేటా సెంటర్లను వ్యతిరేకిస్తున్నారు. చెప్పులు, గుడ్డలు కూడా ఇక్కడే తయారు చేయాలని, విదేశాల్లో పెట్టుబడి పెట్టడానికి వీలు లేదని రోజూ గొడవ చేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా వీటి విషయంలో మౌనం వహించారు. ఆ దేశాల్లో అవసరాన్ని మించి విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. మన కన్నా నీటి వనరులు ఎక్కువ. అయినా డేటా సెంటర్లు పెట్టటానికి అంగీకరించకపోవడంతో ఈ పెద్ద కంపెనీలు సముద్రం ఒడ్డున ఉండే దేశాల వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు తమ ఈ-వెస్ట్‌ను ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాల్లో డంప్‌ చేస్తూ ఉంటాయి. కొంచెం అటుఇటుగా ఈ డేటా సెంటర్లు కూడా అటువంటివే. ఇక్కడ విశేషం ఏమిటంటే మన ప్రభుత్వాలు వారు అడగని ప్రయోజనాలు కల్పిస్తూ… లాభనష్టాలు బేరీజు వేసే అవకాశం ప్రజలకు ఇవ్వకుండా ఎర్రతివాచీ పరవటంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఒక ప్రాంతంలో డేటా సెంటర్‌ పెడితే… ఆ ప్రాంతం ఎడారిగా మారిపోతుంది. డేటా సెంటర్‌కు విపరీతమయిన నీరు అవసరం. గూగుల్‌ డేటా సెంటర్‌కు ఇరవై బిలియన్‌ లీటర్లు, మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌కు ఆరు బిలియన్‌ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. చెట్లు ఎండి పోతాయి. పశు, పక్షులు అంతరించిపోతాయి. లాస్‌ ఏంజెల్స్‌లో అగ్ని ప్రమాదానికి కారణం డేటా సెంటర్లని అక్కడ మీడియా కోడై కూసింది. నిప్పు పడితే అంతే సంగతులు. ఇప్పటికే భూతాపం, ఇది మరింత పెరుగుతుంది. కరెంటు కోతలు దారుణంగా ఉంటాయి. కారణం డేటా సెంటర్‌ బకాసురిడిలా కరెంటు తినేస్తుంది. ఒక్క డేటా సెంటర్‌ లక్ష కుటుంబాల విద్యుత్‌ను లాగేస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగమంతా కుదేలైపోతుందనీ, ప్రభుత్వాలు తమ ఉనికి కోసం డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయని, డేటా సెంటర్‌ పేరిట ప్రభుత్వ భూములు కారుచౌకగా కొట్టేయాలని కార్పొరేట్‌ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని మేధావుల అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు