Homeతిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు

- Advertisement -

ఏపీ సహా 6 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు
కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆరోపణలతో ప్రారంభమైన సంచలన కేసు ఇప్పుడు మనీ లాండరింగ్ కోణంలోకి వెళ్లింది. సిట్ సేకరించిన ఆధారాల ఆధారంగా నిధుల ప్రవాహం, అక్రమ ఆస్తుల కొనుగోళ్లు, హవాలా లావాదేవీలు, టెండర్ అవకతవకల ద్వారా పొందిన లాభాలు వంటి అంశాలపై ఈడీ దృష్టి కేంద్రీకరించింది. బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరుతోపాటు, దిల్లీ, ముంబై, రాజ్‌కోట్, బికనీర్, డెహ్రాదూన్, రూర్కీ, అహల్యానగర్, దిండిగల్ తదితర ప్రాంతాల్లో ఈ కేసుతో ప్రమేయమున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేశ్ మన్సుఖ్‌లాల్, అపూర్వ వినయకాంత్, శాంతారామ్, అజయ్ కుమార్, మహేశ్‌కుమార్, ఆశిష్ అగర్వాల్ ఇళ్లలో సోదాలు చేసి సుమారు రూ.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెల్సింది. స్థిర, చరాస్తుల్లో రూ.45 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఈడీ సోదాలు ఈ కేసులో అత్యంత కీలక మలుపుగా భావిస్తున్నారు.
కేసు పూర్వాపరాలు
సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో నెయ్యి సరఫరా కాంట్రాక్టులు, టెండర్ల కేటాయింపు, హవాలా లావాదేవీలు, అక్రమ కమిషన్లు, నిధుల మళ్లింపు వంటి అంశాలు బయటపడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ పర్యవేక్షణలో జరిగిన సిట్ దర్యాప్తు అనంతరం 2026 జనవరిలో తుది ఛార్జ్‌షీట్ దాఖలైంది. అందులోమొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019-2024 మధ్యకాలంలో లక్షల కిలోల కల్తీ లేదా నకిలీ నెయ్యి సరఫరా జరిగినట్లు, ఈ వ్యవహారం విలువ సుమారు రూ.235 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అంచనా వేశాయి.టెండర్లలో అక్రమాలు, కమిషన్లు, హవాలా లావాదేవీలు జరిగినట్లు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. సిట్ నివేదిక ప్రకారం కొంతమంది డెయిరీ సంస్థల ప్రతినిధులు, మధ్యవర్తులు, అధికారుల మధ్య అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, విజయవాడ, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల ద్వారా హవాలా మార్గంలో డబ్బు బదిలీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కోణంలోనే ఈడీ దూకుడు పెంచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు