Homeఆంధ్రప్రదేశ్తిరుమల నెయ్యి సేకరణపై ఉన్నత స్థాయి కమిటీ

తిరుమల నెయ్యి సేకరణపై ఉన్నత స్థాయి కమిటీ

- Advertisement -

విశాలాంధ్ర – సచివాలయం: తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో నెయ్యి సేకరణ ప్రక్రియలో తలెత్తిన నాణ్యత లోపాలు, విధానపర మైన విఫలాలపై విచారణను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణ కోసం ఫిబ్రవరి 20, 2026 న నియమించబడిన ఏకసభ్య కమిటీ, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఏప్రిల్ 24 న ప్రభుత్వానికి తన నివేదికను అందజేసింది. నెయ్యి కొనుగోలులో జరిగిన వ్యవస్థాగత లోపాలు, టెండర్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జవాబుదారీతనం లేకపోవడాన్ని కమిటీ ఎత్తిచూపింది. ఈ క్రమంలో కమిటీ చేసిన కీలక సిఫార్సులను పక్కాగా అమలు చేసేందుకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గురువారం జీవో ఆర్టీ నంబర్ 900 ద్వారా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరించే ఈ ఉన్నత స్థాయి కమిటీలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ఏకసభ్య కమిటీ గుర్తించిన అంశాలను చట్టపరమైన కోణంలో విశ్లేషించి, నిబంధనలను అతిక్రమించిన వారిపై పరిపాలనాపరమైన లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి, అలాగే క్రిమినల్ చర్యలకు అవకాశం ఉందా అనే విషయాలపై స్పష్టమైన సిఫార్సులు చేయనుంది. దీంతో పాటు టీటీడీలో నెయ్యి సేకరణ విధానాన్ని ప్రక్షాళన చేస్తూ భవిష్యత్‌లో అత్యంత పారదర్శకమైన, నాణ్యమైన సేకరణ ప్రక్రియను అమలు చేయడానికి అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఈ కమిటీ ప్రతిపాదించనుంది. ఈ వ్యవహారం భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అత్యంత సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం ఈ కమిటీకి కేవలం వారం రోజుల గడువును మాత్రమే నిర్దేశించింది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి నిర్ణయాత్మక చర్యలు తీసుకోనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు