అక్రమాలు నిరోధించాలి: ఈశ్వరయ్య
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానంలో పెద్దఎత్తున అక్రమాలు, దందాలు చోటుచేసుకుంటున్నాయని, ఉచిత ఇసుక ఉత్తిమాటగా మిగిలిపోతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేసి… వినియోగదారులకు సక్రమంగా అందించాలని ఈశ్వరయ్య గురువారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీస్తోందని ఆయన తెలిపారు. ఉచిత ఇసుక ఉత్తిమాటగా మిగిలిపోతోందని, భవన నిర్మాణ రంగానికి ఊతమివ్వాలని, పేదవాడి సొంతింటి కల నిజం చేయాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ విధానం… ఆచరణలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటిస్తున్నా వినియోగదారుడికి మాత్రం భారంగానే ఉందని, బ్లాక్ మార్కెట్ దందా, ఇసుక మాఫియా కారణంగా జేబులు ఖాళీకాక తప్పడం లేదని ఆయన తెలిపారు. ఇసుక రీచ్‌ల వద్ద ఉచితం అనే మాట కేవలం బోర్డులకే పరిమితమైందని వివరించారు. ట్రాక్టర్ లేదా ట్రక్కు ఇసుక కావాలంటే ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు చార్జీల కంటే 5 నుంచి 10 రెట్లు అదనపు ధర చెల్లించాల్సి వస్తోందని, ఇసుక ట్రక్కు ధర ఏకంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతుండటం విస్మయానికి గురిచేస్తోందన్నారు. సీనరేజ్ చార్జీలు, లోడింగ్ ఖర్చులు, రవాణా చార్జీల పేరుతో మధ్యవర్తులు, లారీ యజమానులు ఇష్టానుసారం ధరలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు క్షేత్రస్థాయిలో బ్లాక్‌మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతోందని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ… అనధికారిక మార్గాల్లో ఇసుక తరలిపోతోందని వివరించారు. చాలా ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక విక్రయాల బోర్డులు బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ సామాన్య ప్రజలు అధికారికంగా బుక్ చేసుకుందామని వెళ్తే స్టాక్ లేదనీ లేదా సర్వర్ సమస్య అనే సమాధానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ సాయం మధ్యలోనే ఆగిపోతోందన్నారు. ఇసుక కష్టాలు భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఇసుక కొరత, అధిక ధరల వల్ల సామాన్యులు ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేస్తున్నారని తెలిపారు. మేస్త్రీలు, కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇసుకపై వచ్చే భారీ ఆదాయాన్ని వదులుకున్నప్పటికీ… ఆ ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరకపోవడం విచారకరమన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ జోక్యం వల్లనే ఇసుక అక్రమాలు కొనసాగుతున్నాయనేదీ బహిరంగ రహస్యమని తెలిపారు. ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావాలంటే క్షేత్రస్థాయిలో కఠినమైన పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇసుక మాఫియాను, అక్రమ దందాను నివారించాలని, రవాణా ఖర్చులు క్రమబద్ధీకరించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా టెక్నాలజీ ఉపయోగించి పారదర్శకమైన బుకింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా ఇసుక అందించగలిగినప్ప్పుడే ఉచిత ఇసుక పథకం ఆశయం నెరవేరుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం నిర్ధిష్ట చర్యలు చేపట్టాలని సీపీఐ తరపున డిమాండ్ చేశారు.


