కేవీవీ. ప్రసాద్
కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం భారత రైతాంగంపై ఎడాపెడా దాడికి పూనుకుంటోంది. మరో పక్క శ్రమజీవులైన కార్మికవర్గంతో పాటు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కులకు భంగం కలిగే చట్టాలను తెచ్చి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే ప్రమాదాన్ని తెస్తున్నది. అదేవిధంగా అమెరికా తదితర దేశాలతో ఫ్రీట్రేడ్ ఆగ్రిమెంట్ చేసుకుంటూ చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. మోదీ విధానాల పుణ్యమాని గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆహార భద్రత పెనుప్రమాదంలో పడనుంది. సంవత్సరాలుగా కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కాలరాసేలా స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారుల, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి అమలుకు పూనుకొన్న నేపధ్యంలో కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం) నాయకత్వంలోని రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కౌలు, రైతుకూలీ సంఘాలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. సమ్మె జయప్రదానికి సదస్సులు, ర్యాలీలు, కరపత్రాలు, పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా విస్తత ప్రచారం నిర్వహించాయి. లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం రూ॥26వేలుగా నిర్ణయించి అమలుచేయాలని, శాశ్వత ఉద్యోగాలకు తిలోదకాలిచ్చి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కొనసాగింపు, పనిగంటలు 8 నుండి 12 గంటలకు పెంపు, రాత్రి వేళల్లో మహిళల పని షరతు, విశాఖ ఉక్కుతో పాటు దేశ వ్యాపితంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం తదితర కార్మిక, ఉద్యోగుల హక్కులకు భంగం కలిగే విధానాలకు నిరసనగా కార్మికవర్గం కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది. మన దేశం రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తే భారత్ ఎగుమతులపై విధిస్తున్న సుంకాలను 50శాతం నుండి 18శాతానికి తగ్గిస్తామని అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులపై 0శాతానికి తగ్గుతాయని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ప్రకటించారు. అగ్రిమెంట్‌పై ప్రధాని, వాణిజ్య శాఖా మంత్రి దోబూచులాట వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ ఒప్పందం వ్యవసాయ రంగాన్ని మరింత నష్టాల్లోకి నెడుతుందనేది వ్యవసాయ, ఆర్థికరంగ నిపుణుల అంచనా. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులైన సోయాబీన్, మొక్కజొన్న, పప్ప్పు ధాన్యాలు, భారత్ మార్కెట్లను ముంచెత్తునున్నాయి. అమెరికా నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సున్నా శాతం సుంకాలు విధించడంతో మన ఉత్పత్తుల ధరలు పడిపోయి మన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం వుంది. అమెరికా ప్రభుత్వం ద్వారా ఒకొక్క రైతుకు 66,314 డాలర్లు సబ్సిడీ అందుతుంది. సాగు ఖర్చులో 39శాతం సబ్సిడీ ఇస్తారు. అదే మన దేశంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 7శాతం సబ్సిడీ మాత్రమే. దేశంలో గిట్టుబాటు ధరలు లభించక చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు అప్ప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు 31 మంది రైతులు ఆత్మహత్యల పాలౌతుండగా ప్రతి రోజూ 2,400 మంది వ్యవసాయం వదిలి ఇతర వ్యాపకాలకు తరలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే రైతులకు కనీస మద్దతు ధరలు కూడా లభ్యం కాక మరింత అప్ప్పుల్లో మునిగి తేలే ప్రమాదం ఉంది. అమెరికాలో ఉన్న 18.4 లక్షల రైతుల ప్రయోజనం కోసం 14.9 కోట్ల మంది భారత రైతుల భవిష్యత్తును నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫణంగా పెడుతున్నది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 12 సంవత్సరాలలో భారత రైతాంగాన్ని, వ్యవసాయ రంగం నుండి దూరం చేసేలా మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రూపొందించింది. చట్టాల రద్దుకై 13 మాసాల చారిత్రాత్మక పోరాటం సాగింది. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపధ్యంలో రైతాంగానికి క్షమాపణలు చెప్పిన మోడీ రైతు సంఘాలకు లిఖితపూర్వక హమీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా మూడు నల్ల చట్టాల స్థానంలో రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా డిజి{ల్ అగ్రికల్చర్ మిషన్, మార్కెట్ చట్టం, సహకార చట్టం, విత్తన చట్టం, ప్రకతి వైపరీత్యాల చట్టం, విద్యుత్ చట్టం, గిరిజన హక్కుల చట్టం, ఉపాధి హమీ చట్టం, ఎరువుల విధానం, రసాయనాల చట్టం రూపొందించారు. రైతుల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా చట్టాల రూపకల్పన చేస్తూ వ్యవసాయాన్ని కార్పోరేట్ల పరం చేసేందుకు దోహదపడుతున్నది మోదీ ప్రభుత్వం. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం2005ను రద్దు చేసి పేదలకు ఉపాధి లేకుండా చేసే “విబిజిరామ్జీ” 2025 ఉపాధి చట్టాన్ని తెచ్చింది. కేంద్ర నిధుల్లో భారీ కోత పెట్టి రాష్ట్రాలపై భారాన్ని మోపుతూ కూలీల వేతనం, పనిదినాలు తగ్గేలా చట్టంలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖా మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. చట్టబద్ద ఎం.ఎస్.పి. (సి2G50శాతం) ప్రస్తావన లేదు. ప్రకతి వైపరీత్యాలు, తెగుళ్ళు నాశిరకం విత్తనాలు, మందులు, కల్తీ, ఎరువులు, పురుగు మందుల కొరత కారణంగా నష్టపోయిన రైతులకు ఒక్క పర్యాయం రుణమాఫీ చేయాలన్న రైతు సంఘాల డిమాండ్ బడ్జెట్లో ప్రతిబింబించలేదు. రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కేటాయింపు మాత్రం నామమాత్రం. దేశవ్యాప్తంగా రైతాంగ ఉత్పత్తుల గిట్టుబాటు ధరల స్థిరీకరణకు కేవలం 4,100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాద శక్తులకు, స్వదేశీ కార్పోరేట్లకు దాసోహం అవుతున్నది. శ్రమజీవులైన కార్మికులు, రైతులు, కౌలురైతులు, గ్రామీణ పేదల జీవనోపాధి దెబ్బతీసే విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరుగుతున్న దేశవ్యాపిత సమ్మె జయప్రదానికి కార్మిక వర్గంతో పాటు రైతులు, గ్రామీణ పేదలు సమాయత్తం కావాలి. ప్రధాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం


