కృష్ణ కానూరి
ఇటీవల వెలుగులోకి వచ్చిన “ఎప్‌స్టీన్ ఫైల్స” సర్వత్రా ప్రకంపనలు సష్టిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే ‘అత్యంత శక్తిమంతులు’ తమ అధికారం వెనుక దాచుకున్న వికృత ముఖం. “ఎప్‌స్టీన్ ఫైల్స” అనేవి కాగితాలు కావు. న్యాయాన్ని తాకట్టు పెట్టిన ఒక చీకటి సామ్రాజ్యపు అంతర్గత నివేదికలు. ఎందరో అభాగ్యులైన ఆడపిల్లల జీవితాలను బలితీసుకున్న ఈ ‘అరాచక సామ్రాజ్యం’ ఎలా సాధ్యమైంది ? ఎవరెవరు ఈ చీకటి ఒప్పందాల్లో భాగస్వాములయ్యారు ? ఈ ప్రశ్నల వెనుక ఉన్న నివ్వెరపరిచే నిజాన్ని, మన కళ్లెదుటే ఉన్న వ్యవస్థాగత లోపాలను లోతుగా విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఆగిపోదు అనడానికి ఇదే సాక్ష్యం. కామపిశాచి జెఫ్రీ ఎప్‌స్టీన్ చనిపోయినా, అతడు సృష్టించిన పాపపు పునాదులు కూకటివేళ్లతో ఇప్ప్పుడు బయటపడుతున్నాయి. ఈ ఫైల్స్‌లో వినిపిస్తున్న, కనిపిస్తున్న ప్రపంచ మేధావుల, కుబేరుల పేర్లు వారి ముసుగులు బయటపడ్డాయి. ఎలాన్ మస్క్ తన దీవిలోని ‘వైల్డ్ పార్టీల’ కోసం ఆరా తీయడం, బిల్ గేట్స్ రష్యన్ యువతులతో ఉన్న సంబంధాలను ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు వాడుకోవడం, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ పదేపదే ఎప్‌స్టీన్ ఆతిథ్యాన్ని స్వీకరించడం వంటి అంశాలు టెక్ ప్రపంచపు నైతిక పతనాన్ని చాటుతున్నాయి. మరోవైపు, బ్రిటిష్ రాజవంశీయుడు ఆండ్రూ అసభ్యకర స్థితిలో ఉన్న ఫొటోలు బయటపడటం, డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ వంటి అగ్రరాజ్య నేతల పేర్లు వందల సార్లు ప్రస్తావనకు రావడం అధికార గర్వంతో సాగిన అరాచకాలకు అద్దం పడుతున్నాయి. చివరకు మానవతావాదిగా పేరుగాంచిన నోమ్ చోమ్స్కీ వంటి మేధావి సైతం ఒక కామపిశాచి ఇమేజ్‌ను కాపాడటానికి సలహాలివ్వడం చూస్తుంటే, అధికారం, సంపద ముందు సామాజిక విలువలు ఎంతటి దారుణంగా బలైపోయాయో స్పష్టమవుతోంది.
వ్యవస్థల ఘోర వైఫల్యం : 2008లోనే ఒక కామపిశాచిగా, శిక్ష పడిన నేరగాడిగా ముద్రపడిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు దశాబ్దాల పాటు స్నేహాన్ని ఎలా కొనసాగించగలిగారు ? ఇది కేవలం వ్యక్తిగత బలహీనత కాదు, ప్రపంచవ్యాప్త దౌత్య, నిఘా న్యాయవ్యవస్థల ఘోర వైఫల్యం. చట్టం సామాన్యుడిపై విరుచుకుపడే వేళ, ఎప్‌స్టీన్ వంటి “నేరగాళ్ల నెట్‌వర్క” ధనబలంతో నేరాన్ని కూడా ఆభరణంగా మార్చుకునే ఒక “ప్రైవేట్ నెట్‌వర్క” ఉన్నత వర్గాల్లో ఉందని ఈ ఫైల్స్ స్పష్టం చేస్తున్నాయి. నిఘా సంస్థల కళ్లెదుటే అక్రమ రవాణా జరుగుతున్నా, శక్తిమంతుల నీడలో ఆ నేరాలు కనిపించకుండా పోయాయి.
భారతీయ వ్యవస్థపై ప్రభావం : ఇది అమెరికాకు మాత్రమే పరిమితమైన కుంభకోణం కాదు భారతీయ ముఖచిత్రాన్నే మార్చేసిన ఫైల్స్ కూడా. భారత్ వంటి దేశాల్లో దౌత్యపరమైన అంశాల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యం ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది. అనిల్ అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు అంతర్జాతీయ దౌత్యం కోసం ఎప్‌స్టీన్ వంటి నేరగాడిని ఆశ్రయించారనే వార్తలు బయటపడటం, దేశ భద్రత, నైతికత ఏ స్థాయిలో పతనమైందో సూచిస్తున్నాయి. మన దేశంలోనూ లైంగిక దాడులు, మానవ అక్రమ రవాణా వెనుక పెద్దల హస్తం ఉండటం మనకు కొత్తేమీ కాదు. ఎందరో ‘భారతీయ ఎప్‌స్టీన్స్ రాజకీయ అండదండలతో, అధికారుల అండతో యథేచ్ఛగా సాగిస్తున్న అరాచకాలు ఇక్కడి వ్యవస్థల వైఫల్యానికి సాక్ష్యాలు.
మీడియా ప్రజల గొంతా ? లేక అధికార పీఆర్ ఏజెన్సీయా ? : ఎప్‌స్టీన్ కుంభకోణంలో మీడియా నిశ్శబ్దంగా నేరంలో భాగమయ్యింది. భారతదేశంలోనూ సరిగ్గా ఇదే ధోరణి కనిపిస్తోంది. నేడు మీడియా ‘ప్రజల కాపలాదారు’హోదాను వదిలేసి, అధికార పీఠాలకు ‘ప్రజా సంబంధాల సంస్థ’ గా మారిపోయింది. కేవలం టీఆర్పీ వచ్చే అంశాల మీద మాత్రమే కేకలు వేసే మీడియా, ప్రభుత్వానికో లేదా బడా పారిశ్రామికవేత్తలకో ఇబ్బంది కలిగించే వాస్తవాల దగ్గర మౌనం పాటిస్తోంది.
వ్యవస్థాగత వైకల్యం : ఎప్‌స్టీన్ ఫైల్స్ వెలుగులోకి తెచ్చిన భయంకరమైన సత్యం కేవలం ఒక వ్యక్తి చేసిన అకృత్యాలు మాత్రమే కాదు, దశాబ్దాల పాటు ఆ నేరాలను అరికట్టలేకపోయిన వ్యవస్థాగత మందకొడితనం. భారతదేశంలోనైనా, అంతర్జాతీయంగానైనా న్యాయం జరగడంలో కలిగే మితిమీరిన ఆలస్యం ముఖ్యంగా విచారణ సంస్థల కార్యకలాపాల్లో రాజకీయ జోక్యం మితిమీరడం వల్ల అవి స్వతంత్రంగా పనిచేసే శక్తిని కోల్పోయి, పాలకుల చేతిలో ‘జేబు సంస్థలుగా’ మారుతున్నాయి. నిష్పాక్షికంగా నేరాలను వెలికితీయాల్సిన ఈ సంస్థలు, అధికారంలో ఉన్నవారి ప్రయోజనాల కోసం రాజకీయ ఆయుధాలుగా మారిపోతున్నాయి. ఫలితంగా, విచారణల పేరుతో జరిగే సుదీర్ఘ కాలయాపన నేరగాళ్లకు రక్షణ కవచంగా మారి, బాధితులకు అందకుండా పోతోంది.
మన వ్యవస్థల అంతర్మథనం : భారతదేశంలో ఒక సామాన్యుడిపై కేసు నమోదైతే చట్టం వేగంగా కదులుతుంది, కానీ అది ఒక ‘పెద్ద’ మనిషికి తగిలితే మాత్రం విచారణ సంవత్సరాల తరబడి సాగుతుంది లేదా అసలు ఎఫఐఆర్‌లో పేరు కూడా చేరకుండా కనుమరుగైపోతుంది. ఎప్‌స్టీన్ కేసులో బాధితులైన అభాగ్యులే నేడు పోరాడుతుంటే, మన దగ్గర బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం, ‘సామాజిక పరువు’ పేరుతో వారి నోళ్లు మూయించడం వంటివి జరుగుతున్నాయి.
అధికారం ముందు తలవంచే వ్యవస్థ : ఈ ఫైల్స్ ప్రపంచానికి ఒక చేదు నిజాన్ని పరిచయం చేస్తున్నాయి. అధికారం ఉన్న వారి కోసం చట్టం ఒకలా, సామాన్యుడి కోసం మరోలా పనిచేస్తోందన్నది అక్షర సత్యం. ధనబలం ఉంటే చట్టంలోని లొసుగులు వరాలుగా మారతాయి. పలుకుబడి ఉంటే ఎంతటి నేరమైనా ఇట్టే మాయమైపోతుంది.
ఆకలిని ఆయుధంగా మార్చిన అరాచకం : ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ చదువుతుంటే నైతికత ప్రాణం కోల్పోయిన సమాజపు వికృత రూపం కళ్ళముందు కదలాడుతోంది. ప్రపంచ దేశాల్లోని నిరుపేద కుటుంబాల ఆడపిల్లలు “వస్తువులుగా” మాత్రమే కనిపించడం హేయమైన విషయం.ఈ సమాజంలో పేదరికం ఒక ఆర్థిక బలహీనతే కాదు, శక్తిమంతులు దోపిడీ చేయడానికి ఉపయోగించుకునే రహదారి. తూర్పు యూరప్ నుంచి అమెరికా వీధుల వరకు, ఆకలితో అలమటించే బిడ్డల నిస్సహాయతను తమ విలాసాల కోసం పెట్టుబడిగా మార్చుకున్న ఈ ‘పెద్ద మనుషుల’ వైఖరి సభ్యసమాజపు ఉనికినే ప్రశ్నిస్తోంది. ఇది కేవలం నేరం కాదు, మానవత్వం మీద జరిగిన అత్యంత క్రూరమైన దాడి.
వ్యక్తిపై కాదు వ్యవస్థాగత కుళ్లుపైనే అసలైన పోరాటం : ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేవి కేవలం కొన్ని పేర్ల జాబితా కాదు.. అవి వ్యవస్థలో పేరుకుపోయిన మురికికి నిదర్శనం. ఒక నేరగాడిని శిక్షించడం వల్ల ఒక నేరం అంతమవ్వచ్చు, కానీ ఆ నేరగాడిని కాపాడిన వ్యవస్థను వదిలేస్తే చరిత్ర పునరావృతమవుతూనే ఉంటుంది. కొత్త చట్టాల కంటే నేడు మనకు కావాల్సింది నిజాయితీ గల రాజకీయ సంకల్పం, పాలకుల జేబులో బందీ కాని స్వతంత్ర విచారణ సంస్థలు, అధికారానికి భయపడని మీడియా. ఇవి లేకపోతే భారతదేశంలో ‘ఎప్‌స్టీన’ అనే పేరు వినిపించకపోవచ్చు, కానీ అరాచకాలు చేసే ‘వ్యవస్థ’ మాత్రం నిరంతరం వర్ధిల్లుతూనే ఉంటుంది. నేరగాళ్లకు రాజభోగాలు కల్పించే సమాజం ఏనాటికీ సురక్షితం కాదు. ఈ వాస్తవాలు వెలుగులోకి రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నత వర్గాలు అనుభవిస్తున్న చట్టవిరుద్ధమైన రక్షణ కవచం బద్దలవ్వాలి. మనం వ్యవస్థను ప్రశ్నించకపోతే, బాధితుల కన్నీళ్లను లెక్కచేయకపోతే.. రేపు ఇంకొక రూపంలో, ఇంకొక పేరుతో మరో ఎప్‌స్టీన్ పుడుతూనే ఉంటాడు. మనం చేయాల్సిన పోరాటం వ్యక్తులపై కాదు, నేరగాళ్లను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ వ్యవస్థాగత కుళ్లుపై ! చట్టం ధనవంతుడికి వంగి, సామాన్యుడిని అణిచివేసినంత కాలం ఏ దేశమైనా నైతిక సంక్షోభంలో ఉన్నట్టే. ఇది కేవలం ఒక సంచలనం కాదు.. రాబోయే వినాశనానికి ఒక తీవ్ర హెచ్చరిక. సెల్ : 7981305779


