ఏదిఏమైనా భారత్ మాతోనే: అమెరికా
వాషింగ్టన్: షాంఘై సహకార సదస్సు (ఎస్సీఓ) నాటకీయంగా ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ విమర్శించారు. ‘భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం… దాని విలువలు అమెరికాకు దగ్గరగా ఉంటాయి. చైనా, రష్యాకు కాదు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం ఉక్రెయిన్ యుద్ధానికి ఊతమివ్వడమే’ అంటూ బెసెంట్ వ్యాఖ్యానించారు. రష్యాకు చైనా, భారత్ అండగా ఉండటం వల్లనే అమెరికా సహా మిత్రదేశాలు రంగంలోకి దిగి ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయని వెల్లడిరచారు. భారత్-అమెరికా బంధం బలమైనదన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్నాగానీ వాటిని పరిష్కరించుకోగలవని చెప్పారు. వాణిజ్య చర్చలు మందకొడిగా సాగడం కూడా భారత్‌పై ఆంక్షలకు ఓ కారణంగా తెలిపారు. రష్యాపై చర్యలకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడిరచారు.
భారత్‌తో వాణిజ్యం ఏకపక్షం: ట్రంప్
భారత్‌తో వాణిజ్యం పూర్తిగా ఏకపక్షంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధిక సుంకాల కారణంగా భారత్‌కు అమెరికా వస్తువులను విక్రయించలేకపోతున్నట్లు తెలిపారు. జీరో టారిఫ్‌లకు భారత్ అంగీకరించింది కానీ అప్పటికే సమయం మించిపోయిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ముగిసిన కొన్ని గంటలలోనే ట్రంప్ పోస్టు పెట్టారు. అమెరికా మాజీ ఎన్ఎస్ఏ జాక్ సులేవాన్ మాట్లాడుతూ పాకిస్థాన్‌తో కుటుంబ వ్యాపార ఒప్పందాల కోసం భారత్‌తో స్నేహాన్ని అమెరికా అధ్యక్షుడు వదులుకున్నట్లు తెలిపారు.
ఇదిలావుంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో భారత్‌పై మళ్లీ నోరుపారేసుకున్నారు. నియంతలతో మోదీ వేదిక పంచుకోవడం సిగ్గు చేటని అన్నారు. యూరప్, ఉక్రెయిన్‌తో కలిసి పనిచేయాలని భారత్‌కు సూచించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలన్నారు.


