న్యూదిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్‌ఫేక్‌లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. గంభీర్ తన పిటిషన్‌లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ టెక్నాలజీ, ఫేస్ స్వాప్, వాయిస్ క్లోనింగ్ ద్వారా తాను చెప్పని మాటలు చెప్పినట్లు చూపించే వీడియోలు తయారు చేస్తున్నారని తెలిపాడు. ఈ కేసులో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు, అలాగే మెటా, గూగుల్, యూట్యూబ్, ‘ఎక్స’ వంటి టెక్ కంపెనీలను ప్రతివాదులుగా చేర్చాడు. తన పిటిషన్‌లో గంభీర్ మొత్తం 16 మంది ప్రతివాదులపై కేసు వేస్తూ, తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాలంటూ కోర్టును కోరాడు. ఈ సందర్భంగా ఆయన రూ.2.5 కోట్ల నష్టపరిహారం కోరడమే కాకుండా, నకిలీ కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, భవిష్యత్తులో తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిషేధించాలని అభ్యర్థించాడు. గంభీర్ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టనుంది.


