వెనిజులా మహిళ మరియా మచాడోకు నోబెల్ శాంతి
తీవ్రంగా స్పందించిన శ్వేతసౌధం
స్టాక్‌హోమ్: ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి పురస్కారం దక్కాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు ఆడియాశలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే వారికి అందించే ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు దక్కింది. 2025 సంవత్సరానికిగాను ఈ అత్యున్నత గౌరవానికి ఆమె ఎంపికయ్యారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆమె సాగించిన పోరాటానికిగాను ఈ బహుమతి ఒక గుర్తింపు అని నోబెల్ కమిటీ అభివర్ణించింది. వెనిజులాలో ప్రజాస్వామ్యం దిశగా శాంతియుత పరివర్తన కోసం, ప్రజల హక్కుల కోసం మరియా కొరినా మచాడో చేస్తున్న నిరంతర కృషిని కమిటీ ప్రత్యేకంగా ప్రశంసించింది. వెనిజులాలో ఉన్నత వర్గాలు సంపదను పోగేసుకుంటుంటే… మెజారిటీ ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విడిపోయిన ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మచాడో కీలక పాత్ర పోషించారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు, ప్రాతినిధ్య ప్రభుత్వం అనే ఉమ్మడి లక్ష్యం కోసం ఆమె అందరినీ ఏకం చేశారని కమిటీ కొనియాడిరది. అధికార శక్తులు విజృంభిస్తున్న తరుణంలో మరియా కొరినా మచాడో వంటి స్వేచ్ఛా సంరక్షకులను గుర్తించడం చాలా కీలకమని కమిటీ అభిప్రాయపడిరది. ఆమె శాంతి, ప్రజాస్వామ్యం అనే రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని నిరూపించారని, పౌరుల హక్కులకు రక్షణ లభించే భవిష్యత్తుకు ఆమె ఒక ఆశాదీపం అని నోబెల్ కమిటీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ పురస్కారం కింద మరియా మచాడోకు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనార్ల (సుమారు 1.2 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి లభించనుంది. మరియా కొరినా మచాడోను నోబెల్ శాంతి బహుమతికి ఎంపికచేయడంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఎంపిక ప్రపంచ శాంతి పట్ల నిబద్ధతను కాకుండా, రాజకీయ పక్షపాతాన్ని ప్రతిబింబిస్తోందని ఘాటుగా విమర్శించింది. ఈ విషయంపై వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘శాంతి కంటే రాజకీయాలకే నోబెల్ కమిటీ పెద్దపీట వేస్తుందని మరోసారి రుజువైంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో నోబెల్ పురస్కారం ఎంపిక ప్రక్రియపై మరోసారి అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. కాగా, నోబెల్ కమిటీ ప్రకటనతో తనను శాంతి బహుమతికి ఎంపిక చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. తాను అనేక యుద్ధాలు ఆపి… ప్రపంచ శాంతి నెలకొల్పానని, నోబెల్ శాంతి పురస్కారం తనకే ఇవ్వాలని ఆయన గత కొన్నాళ్లుగా భారీగా ఆశలు పెట్టుకున్నారు. వివిధ దేశాలు కూడా ట్రంప్‌కు మద్దతు పలికాయి. కానీ, నోబెల్ కమిటీ ఆలోచనలు మరోలా ఉన్నాయని తాజా ప్రకటనతో స్పష్టమైంది.
నోబెల్ కమిటీ ఏమందంటే…
డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వంపై నోబెల్ కమిటీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ఆయనకు శాంతి బహుమతి 2025 ఇస్తారన్న ప్రచారాలపై మాత్రం ఆ కమిటీ కార్యదర్శి క్రిస్టియన్ బెర్గ్ హర్ప్వికెన్ మాట్లాడారు. అందులోనూ డొనాల్డ్ ట్రంప్ పేరును ప్రస్తావించలేదు. ప్రత్యేకమైన అర్హతలు ప్రతి నామినీకి ఉన్నాయని, అంతేగానీ, బయట జరుగుతున్న ప్రచారాలు తమ చర్చలపై ప్రభావం చూపవని స్పష్టం చేశారు. ఈ కమిటీని నార్వే పార్లమెంట్ నియమిస్తుంది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. వారే పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తూ నామినేషన్లను పరిశీలిస్తారు. ఇటీవల, ఇజ్రాయిల్-గజా మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి 2025 ఎంపికపై మాత్రం ఇది ఎలాంటి ప్రభావం చూపదని నార్వే నోబెల్ కమిటీ ఇప్పటికే తెలిపింది.


