ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశంపై సుప్రీం ఆగ్రహం
న్యూదిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అందరినీ కలవరపాటుకు గురిచేసిందని, న్యాయవ్యవస్థను కించపరచే ఎలాంటి చర్యలను అనుమతించేది లేదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దీనిపై సుమోటో చర్య తీసుకుంటామన్నారు. ‘న్యాయవాదులు, న్యాయమూర్తులతో సహా అందరినీ ఈ అంశం కలవరపాటుకు గురిచేసింది. కొన్ని రోజులు ఆగండి. దీనిపై నేను సుమోటో విచారణ చేపడతాను. సంస్థను అప్రతిష్ఠపాలు చేసే ఎలాంటి చర్యను అనుమతించేది లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అని సీజేఐ అన్నారు. పాఠశాల విద్యార్థులకు ఇలాంటి పాఠాలు నేర్పించడం ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని, ఇది చాలా విచారకరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై అనేక ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదేదో ప్రణాళికబద్ధంగా… ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నంగా కనిపి స్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతకంటే తాను ఏమీ చెప్పదలచుకోలేదన్నారు. ఏదేమైనా ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిuల్, అభిషేక్ సింఘ్వీకి కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశాన్ని ఎన్సీఈఆర్టీ బోధిస్తోందని సీనియర్ న్యాయ వాది కపిల్ సిబల్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు స్పందించింది. దీనికి ముందు, కపిల్ సిబల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స’లో ఒక పోస్ట్ పెట్టారు. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థపై అవినీతి’ అంశం చేర్చారు. మంత్రులు, ప్రభుత్వోద్యోగులు, విచారణ సంస్థలు సహా రాజకీయ వేత్తలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు వీటిని దాచిపెడుతున్నాయి? అని సిబల్ ప్రశ్నించారు.


