Homeఆంధ్రప్రదేశ్డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

- Advertisement -

శామ్యూల్ జవహర్‌కు సీపీఐ నేతల వినతి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: నంద్యాల జిల్లా సీపీఐ డోన్ మండల కార్యదర్శి బి.నారాయణపై దాడి చేసిన పట్టణ సీఐ ఇంతియాజ్ బాషాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి… కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌కు సీపీఐ బందం వినతిపత్రం అందజేసింది. విజయవాడ ఏపీఎసఆర్టీసీ ప్రాంగణంలోని ఎన్టీఆర్ భవన్‌లో గల ఎస్సీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్‌ను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు, పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్.రంగనాయుడు, సహాయ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మోట రాముడు, సీపీఐ మండల కార్యదర్శి నారాయణ బుధవారం కలిశారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కె.తిమ్మాపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టీడీపీ కార్యకర్తలు అవినీతి, అక్రమా లకు పాల్పడిన ఘటనలను వివరించారు. అవినీతిపై సీపీఐ డోన్ మండల కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు ఎం.నారాయణ, సీపీఐ తిమ్మాపురం గ్రామ కార్యదర్శి వి.సురేశ్ గ్రామసభలో డోన్ మండల పరిషత్ అధికారి (ఎంపీడీవో), ఏపీవోకు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ ఫిర్యాదుపై స్థానిక ప్రజల సమక్షంలో విచారించగా…అవినీతి, అక్రమాలు నిజమేనని టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు అంగీకరించాడని పేర్కొన్నారు. తనపై ఫిర్యాదు చేశారన్న అక్కసుతో శ్రీనివాసులు…సురేశ్‌ను నానా దుర్భాషలాడారని తెలిపారు. ఈ విషయమై డోన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సీపీఐ నాయకులు నారాయణ, సురేశ్ వెళ్లగా… స్థానిక డోన్ ఎమ్మెల్యే కె.సూర్యప్రకాశ్‌రెడ్డి ఇంటికి టీడీపీ కార్యకర్తలు వెళ్లి ఫిర్యాదు చేశారన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా ఈ విషయంపై విచారిస్తామని చెప్పి… నారాయణ, సురేశ్‌ను జీపులో ఎక్కించుకుని డోన్ పట్టణ సీఐ కార్యాలయంలో నిర్బంధించి, దుర్భాషలాడడం, కాళ్లు కట్టి తలక్రిందులుగా వేలాడదీసి ఇష్టానుసారం చిత్రహింసలకు గురిచేశారన్నారు. సీఐ ఇంతియాజ్ బాషా గతంలో రైల్వే యూనియన్ గుర్తింపు ఎన్నికల సమయంలోనూ ఎంప్లాయీస్ సంఘ్ నేతలకు అనుకూలంగా, టీడీపీ స్థానిక నాయకుల ప్రమేయంతో రైల్వే ఉద్యోగి విజయకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ సీపీఐ నిరసన తెలిపిన సందర్భంలోను ఆనాడు మొక్కుబడిగా విచారించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ముస్లిం కావడంతో సీఐ ఆ కేసును నీరుగార్చారని, రైల్వే గేట్‌మేన్‌గా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేష్‌పై దాడి జరిగినప్ప్పుడు రాజీ కావాలని బాధితుడిపైనే ఒత్తిడి తెచ్చారని వివరించారు. ఈ విధంగా అనేక ఘటనల్లో సీఐ ఏకపక్షంగా వ్యవహరించడం తీవ్ర ఆక్షేపణీయమని తెలిపారు.
డోన్ రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లలో పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేయడం విచారకరమని, ప్రజలపై దాడులు జరిగినప్ప్పుడు నిష్పక్షపాతంగా న్యాయం చేయాల్సిన పోలీసులు…. ఏకపక్షంగా అధికార పార్టీ అనుంగులవలె వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా పేర్కొన్నారు. తక్షణమే స్పందించి అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన సీపీఐ నాయకులపై దాడిచేసి, చిత్రహింసలకు గురిచేసిన సీఐ ఇంతియాజ్ బాషాపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులంటే ప్రజలకు నమ్మకం కలిగేలా, ఫెండ్లీ పోలీసింగ్ పదానికి అర్థం చేకూరేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు