Wednesday, January 21, 2026
Homeన్యాయ వ్యవస్థకు సవాళ్లు

న్యాయ వ్యవస్థకు సవాళ్లు

- Advertisement -

నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీజేఐ బీఆర్‌ గవాయ్‌

విశాలాంధ్ర`హైదరాబాద్‌:భారత న్యాయ వ్యవస్థ చాలా భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ బీఆర్‌ గవాయ్‌ అన్నారు. నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవం శనివారం హైదరాబాద్‌లోని షామీర్‌ పేట్‌లోని జస్టిస్‌ సిటీ క్యాంపస్‌లో జరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ గౌరవ అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, నల్సార్‌ ఛాన్సలర్‌ జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ అధ్యక్షత వహించారు. విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ శ్రీకృష్ణ దేవరావు తన ప్రారంభోపన్యాసంలో వార్షిక నివేదికను, గత సంవత్సరం విశ్వవిద్యాలయం సాధించిన విద్యా విజయాలను సమర్పించారు. విద్యా నైపుణ్యం, రాజ్యాంగ విలువలు, సమ్మిళిత వృద్ధికి నల్సార్‌ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. నల్సార్‌ ఇటీవలే ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఆధునీకరించడంపై సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి పని చేసిందని వివరించారు. నల్సార్‌కు నిరంతర మద్దతు ఇస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీజేఐ బీఆర్‌ గవాయ్‌ మాట్లాడుతూ మన భారతీయ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ సవాళ్లకు తగినట్లు పౌరులు రాణిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. మన దేశం, న్యాయ వ్యవస్థ… రెండూ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొన్ని కేసుల్లో విచారణ దశాబ్దాల పాటు సాగుతుందని, కొన్నేళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్లు నిర్దోషులని కొన్ని కేసుల్లో తేలుతున్నాయని అన్నారు. మన వద్ద ఉన్న ఉత్తమ ప్రతిభ ఆ సమస్యలను తీర్చుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. నల్సార్‌ను ప్రత్యేకంగా చూపించేది దాని విద్యా నైపుణ్యం మాత్రమే కాదని, చట్ట విలువల పట్ల దాని లోతైన నిబద్ధత అని అన్నారు. విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా కేంద్రాల పనిలో, అలాగే సామాజిక న్యాయంపై దాని బలమైన దృష్టిలో ఈ నీతి ఎలా స్పష్టంగా కనిపిస్తుందో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. న్యాయవాద వృత్తి విస్తృత పాత్రను ప్రతిబింబిస్తూ, వర్ణ వివక్ష, సామాజిక వివక్షత వంటి అణచివేత వ్యవస్థలను సవాలు చేసిన న్యాయవాదుల వారసత్వాన్ని స్వీకరించాలని ఉద్బోధించారు. పరివర్తన సాధనంగా చట్టానికి ఉన్న సామర్థ్యాన్ని పట్టభద్రులకు గుర్తు చేశారు. కేవలం ఉన్నత నైపుణ్యాల కారణంగా కాకుండా సృజనాత్మకత, నిర్మాణాత్మక వల్లే న్యాయవాద వృత్తిలో విజయం సాధ్యమని తెలిపారు. కొత్త ప్రపంచ, సాంకేతిక పరిణామాలకు ప్రతిస్పందనగా వృత్తి అభివృద్ధి చెందుతున్నప్పటికీ, బలమైన చట్టపరమైన పునాదులపై ఆధారపడి ఉండాలని కోరారు. విదేశీ డిగ్రీలను అభ్యసించే పెరుగుతున్న ధోరణిని ప్రస్తావిస్తూ… సహచరుల ఒత్తిడి కారణంగా మాత్రమే విదేశీ విద్య వైపు పోవద్దని హెచ్చరించారు. అంతర్జాతీయ అర్హత స్వయంచాలకంగా శ్రేష్ఠతకు గుర్తు కాదని ఆయన నొక్కి చెప్పారు. ఈ ధోరణి భారతీయ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ న్యాయ విద్యపై విశ్వాసం లేకపోవడాన్ని కూడా ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఎల్‌ఎల్‌ఎం కార్యక్రమాలలో ఎక్కువ పెట్టుబడి పెట్టాలని సీజేఐ గవాయ్‌ సూచించారు. అంతిమంగా దేశ న్యాయ వ్యవస్థ ప్రయోజనం కోసం ఉత్తమ న్యాయవాదులను నిలుపుకోవడం, పెంపుదించుకోవల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ముఖ్య అతిథిగా కాకుండా సంరక్షకుడిగా చివరి మాటలను సూచిస్తూ… స్నేహితులు, కుటుంబం, పుస్తకాలు, అభిరుచులు, ఆరోగ్యం, ఊహ అనే ఐదు ముఖ్యమైన విషయాలు ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంచాలన్నారు.
ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు, ఆంధ్ర ప్రదేశ్‌ న్యాయమూర్తులు, అలాగే తెలంగాణ మంత్రులు కూడా హాజరయ్యారు. 460 డిగ్రీలు, డిప్లొమాలు, పీహెచ్‌డీ (డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ), ఎల్‌ఎల్‌ఎం(మాస్టర్‌ ఆఫ్‌ లాస్‌), పీజీ డిప్లొమా ఇన్‌ టాక్సేషన్‌ లాస్‌, పీజీ డిప్లొమె ఇన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ మేనేజ్‌మెంట్‌లకు సంబంధించి డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అలాగే 58 బంగారు పతకాలను కూడా ప్రదానం చేశారు. ఎల్‌ఎల్‌ఎంలో ముస్కాన్‌ కార్లా రెండు బంగారు పతకాలను గెలుచుకున్నారు. బి.హరిణి, హుజైఫా షేక్‌, నందిని శివేరే ఒక్కొక్కటి సాధించారు. ఎంబీఏ బీఏఎల్‌ఎల్‌బీలో ముస్కాన్‌ అల్వి బంగారు పతకం గెలుచుకున్నారు. బీఏఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌లో ఇషికా గార్గ్‌ ఎనిమిది బంగారు పతకాలను, కె.ఎస్‌.శైలేంద్ర ఏడు బంగారు పతకాలను, అర్చిత ఆరు బంగారు పతకాలను, భవ్య నాలుగు, తేజస్వి, శ్రుతి, అఖిల్‌ సూర్య మూడు పతకాలను గెలుచుకున్నారు. శ్రుతి, సాన్వి రెండు చొప్పున సాధించారు. శ్రీవల్లి, అనుష్క, అరివలగన్‌, జాహ్నవి, ప్రద్యుమ్న, షమిక్‌, విష్ణు ఒక్కొక్కరు ఒక్కో బంగారు పతకం సాధించారు ఈ సందర్భంగా పిల్లల హక్కులు, తులనాత్మక క్రిమినల్‌ చట్టాలు, కాంట్రాక్టులపై చిత్రపరమైన హ్యాండ్‌బుక్‌, నల్సార్‌ లా సమీక్ష జర్నల్‌ పుస్తకాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వాసంతి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు