విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని పొడి చెత్తను పంచాయతీకి అందించి, లక్కీ డ్రా కూపన్లు పొందాలని అనంతపురం డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (డీడీఓ) శకుంతల ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ప్రసన్నాయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ‘దసరా ధమాకా-స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఓ శకుంతల మాట్లాడుతూ… గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. స్వచ్ఛ రథం వాహనం ద్వారా ప్రతి ఇల్లు తిరిగి, పొడి చెత్త సేకరణ మరియు పరిశుభ్రత ప్రాముఖ్యతపై ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. 10 కేజీలకు పైగా పొడి చెత్తను పంచాయతీకి అందించిన వారికి లక్కీ డ్రాలో పాల్గొనడానికి ప్రత్యేక కూపన్ ఇస్తామన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని చేపట్టిన ఈ వినూత్న అవకాశాన్ని గ్రామస్తులందరూ వినియోగించుకుని తమ ప్రాంతాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ అశోక్ బాబు, పంచాయతీ కార్యదర్శులు హాజీవలి, మాధవి, నాయకులు పంజగల శ్రీనివాసులు, స్వర్ణ గ్రామం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పొడి చెత్త ఇవ్వండి.. లక్కీ డ్రా కూపన్లు పొందండి: డీడీఓ శకుంతల పిలుపు
- Advertisement -


