బిహార్‌లో ప్రత్యేక లోతైన ఓటర్ల జాబితా తయారీలో జరుగుతున్న అక్రమాలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు పట్టాలు తప్పినట్టే. ఈ కేసును ఆగస్టు 12,13 తేదీల్లో విచారిస్తామని న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్ బాగ్చీతో కూడిన బెంచి మంగళవారం తెలియజేసింది. ఓటర్ల జాబితా తయారీలో జరుగుతున్న అవకతవకలను నిరోధించడానికి సుప్రీంకోర్టు ఆంక్షలేవీ విధించలేదు కనక ఎన్నికల కమిషన్ తాను అనుకున్న రీతిలో ఓటర్ల జాబితాలో సవరణలు చేస్తుంది. మరో రకంగా చెప్పాలంటే తాము ఫలానావారు భారత పౌరులు కాదు అని భావిస్తే వారిని ఓటర్ల జాబితాలోంచి తొలగిస్తుంది. కొత్తగా తయారు చేస్తున్న జాబితా ఆధారంగా కాకుండా మునుపటి జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించలేదు కనక ఎన్నికల కమిషన్ జాబితా నుంచి తొలగించిన వారికి ఓటు హక్కు లేకుండానే నవంబర్‌లో బిహార్ శాసనసభ ఎన్నికలు జరిగిపోతాయి. ఎన్నికల కమిషన్‌ను వినియోగించుకుని తమకు అనుకూలంగా ఫలితాలను సాధించాలనుకుంటున్న బీజేపీ లక్ష్యం నెరవేరినా ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ గత జులై ఒకటో తేదీ నుంచి ప్రత్యేక లోతైన ఓటర్ల జాబితా సిద్ధం చేసే పనిలో ఉంది. ఎన్నికల కమిషన్ రూపొందించిన కొత్త నియమాల ప్రకారం 2023లో ఓటర్ల జాబితాలో చోటు దక్కని వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. అలాంటి వారిని గుర్తించడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఎన్నికల కమిషన్ స్వయంగా జారీ చేసిన గుర్తింపు కార్డులను ప్రామాణికంగా పరిగణించరట. మొదట సుప్రీంకోర్టు వీటిని కూడా ప్రామాణికంగా స్వీకరించాలని సూచించింది. కానీ ఎన్నికల కమిషన్ ఆ సూచనను పట్టించుకోలేదు. తరవాత వీటిని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు నిర్ణీత ఉత్తర్వు ఏదీ జారీచేయకుండానే ఆదేశం లాంటిది జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేయించుకోవాలనుకునే వారు తాము పేర్కొన్న 11 పత్రాలలో ఏదో ఒకటి సమర్పించాలని ఎన్నికల కమిషన్ అంటోంది. ఓటర్లకు రెండేసి ఫారాలు ఇస్తామని చెప్పింది. కానీ కొందరికి ఒకే ఫారం ఇచ్చారని, చాలా ఫారాల మీద ఎన్నికల కమిషన్ తరఫున పని చేసే సిబ్బందే సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వరసలో ఒక కుక్కకు కూడా ఓ పత్రం జారీ అయింది. ఎన్నికల కమిషన్ ప్రస్తుతం చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపు 65 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి మాయమయ్యే అవకాశం ఉంది. తొలగించాలనుకుంటున్న 65 లక్షల మందిలో మరణించిన వారు, అందుబాటులో లేని వారు కూడా ఉన్నారు. కొత్త నిబంధనల ప్రకారం 2003 తరవాత ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన వారు తమ పౌరసత్వాన్ని కూడా నిరూపించుకోవాలట. పౌరసత్వం నిర్ధారించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. కనీసం ఈ అంశంపైనైనా సుప్రీంకోర్టు బెంచి ఎన్నికల కమిషన్‌ను కట్టడి చేయడానికి సాహసించలేదు. ఇంతకు ముందు ఫారం 6 నింపి తాము భారత పౌరులమని చెప్తే సరిపోయేది. ఫారాలు నింపడానికి గడువు నాలుగైదు రోజుల కింద ముగిసింది. ఆగస్టు ఒకటవ తేదీన ముసాయిదా జాబితా వెలువరిస్తారు. అభ్యంతరాలను పరిష్కరించిన తరవాత సెప్టెంబర్ 30 న తుది జాబితా వెలువరిస్తారు. ఆ తరవాత ఎన్నికలకు నెలన్నరకన్నా ఎక్కువ సమయం ఉండదు. ఎన్నికల కమిషన్ చేపట్టిన కార్యక్రమానికి ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి ఏ నిర్దిష్టమైన ఆదేశమూ లేదు కనక ఎన్నికల కమిషన్ తాను అనుకున్న పద్ధతి ప్రకారం పని కానిచ్చేస్తుంది.
ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న విధానంపై అనేక మంది సుప్రీం కోర్టులో అర్జీలు దాఖలు చేశారు. బిహార్‌లో ఓటు హక్కు హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు మౌలికమైంది. అయినా సుప్రీంకోర్టు ఈ కేసు విచారణకు అవసరమైన ఆసక్తి కనబరుస్తున్నట్టు లేదు. మోదీ ప్రభుత్వ పనుపున ఎన్నికల కమిషన్ చేస్తున్న పని నిరాటంకంగా కొనసాగడాన్ని ఆపే ఉద్దేశం సుప్రీంకోర్టుకు ఉన్నట్టు లేదు. పౌరసత్వ సమస్యను లేవనెత్తి, కోట్లాది మంది ప్రజల దగ్గర లేని పత్రాలు కావాలని ఒత్తిడి చేయడం ద్వారా ముస్లింలకు ఓటు హక్కు లేకుండా చేసే ప్రయత్నం సాగుతోంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గ్రహించలేదని కాదు. మామూలు సమయాల్లో న్యాయమూర్తులు అనేక తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈసారి కూడా భారీగా ఓటర్ల పేర్లు తొలగిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తామని న్యాయమూర్తులు సూర్యకాంత్, బాగ్చీ హెచ్చరించడం నిజమే. కానీ విచారణ తేదీని ఆగస్టు 12-13 తేదీలకు పొడిగించడం వల్ల ఎన్నికల కమిషన్ ప్రయత్నాన్ని సుగమం చేయడానికే మొగ్గు చూపినట్టయింది. ఈ పిటిషన్ విషయంలో ఆయన వైఖరి అనుమానాలకు తావిస్తోంది. వచ్చే నవంబర్‌లో సూర్యకాంత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. ఆయన మీద ఇంతకు ముందే అవినీతి ఆరోపణలతోపాటు అనేక ఆరోపణలున్నాయి. న్యాయమూర్తి సూర్యకాంత్‌ను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించే సమయంలోనే వివాదం తలెత్తింది. ఆ సమయంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎ.కె.గోయల్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాకు 2018 జనవరి 12 న ఓ లేఖ రాసి సూర్యకాంత్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే రోజు అప్పటి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి చలమేశ్వర్‌తో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో జరుగుతున్న అవకతవకలను బయట పెట్టారు. న్యాయమూర్తి సూర్యకాంత్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం 2018 జనవరి 11 న సిఫార్సు చేసింది. అప్పుడే న్యాయమూర్తి గోయల్ రాసిన లేఖలో సూర్యకాంత్ మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించకుండా నియమించకూడదని ఆ లేఖలో పేర్కొన్నారు. కాని ఆ లేఖను పట్టించుకోకపోగా న్యాయమూర్తి ఎ.కె. మిత్తల్‌ను కాదని సూర్యకాంత్‌ను నియమించేశారు. న్యాయమూర్తి గోయల్ రాసిన లేఖలో సూర్యకాంత్ మీద అవినీతి ఆరోపణలే కాక కులతత్వ ఆరోపణలు కూడా ఉన్నాయని, ఆయన సమకూర్చుకున్న ఆస్తుల మీద కూడా విచారణ జరగాలని కోరారు. సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన ఏడాదికి పైగా ఆ పదవిలో ఉంటారు. ఆయన మీద గతంలో వచ్చిన ఆరోపణలు చూస్తే బిహార్ ఓటర్ల జాబితా కేసులో ఆయన వైఖరి ఏమిటో సులభంగానే అర్థం అవుతుంది. ఏడురోజులుగా పార్లమెంటు ఆవరణలో నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్షాలకు ఫలితం ఏమైనా దక్కుతుందా!
పట్టాలు తప్పిన ఓటర్ల జాబితా కేసు
- Advertisement -


