Homeపని ఇక్కడ, పన్ను అక్కడ?

పని ఇక్కడ, పన్ను అక్కడ?

- Advertisement -

. కాంట్రాక్టర్ల నుంచి పన్నుల వసూళ్లు పెరగాలి
. రాష్ట్రంలోనే పన్నులు చెల్లించాలి
. లబ్ధిదారులకు సంక్షేమ లేఖలు
. విద్యార్థులకు గుర్తుండేలా స్నాతకోత్సవాలు జరగాలి
. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో పని చేస్తూ, వేరే రాష్ట్రాల్లో కార్యాలయాలు పెట్టుకున్న కాంట్రాక్టర్ల విషయంలో చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చందబ్రాబు ఆదేశించారు. ‘కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టుకున్నారు. పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారు. టెండర్లు, వర్క్ ఆర్డర్లలోని కాంట్రాక్టర్ల నుంచి ఆదాయం రావటం లేదు. ఇది సరి కాదు. జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల పనుల్లో కాంట్రాక్టర్లు చెల్లించే పన్నులు మన రాష్ట్రంలో చెల్లించేలా చూడాలి’ అని సీఎం ఆదేశాలిచ్చారు. పన్ను వసూళ్ల విషయంలో వేధించకుండా, ఎగవేతలు లేకుండా చూడాలని సూచించారు. అందరూ పన్నులు చెల్లించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇందుకోసం ఏఐ వినియోగించి… పటిష్ట కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు అయిన గురువారం సూపర్ సిక్స్, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. పరిశ్రమలు, సేవా రంగాభివృద్ధితో ఆదాయం వస్తుందని చంద్రబాబు అన్నారు.
ప్రతి రంగంలోనూ వృద్ధి సాధించడం ద్వారా జీఎస్డీపీ లక్ష్యాన్ని చేరుకోవాలని మార్గనిర్దేశనం చేశారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన ఓనర్షిప్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధుల మీద ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుకూ ప్రతి నెలా ఏం లబ్ధి కలిగిందో తెలిసేలా చేయాలని, ఏ కుటుంబానికి ఎంత ప్రయోజం ఉందో తెలిస్తే అంతా పారదర్శకంగా ఉంటుందని సీఎం అన్నారు. పెన్షన్, ఉచిత సిలెండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్సుమెంట్ వంటివి లబ్ధిదారులకు తెలియాలన్నారు. ‘పథకం అమలు చేసే ముందు, ఖాతాల్లో డబ్బు జమ చేసే ముందు… ప్రతి లబ్ధిదారు కుటుంబానికి సంక్షేమ లేఖలు అందాలి. దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలి. డీబీటీ పథకాల్లో ప్రోగ్రామబుల్ వోచర్లT లబ్ధిదారులకు ఇస్తే వినియోగించుకుంటారు. మార్చి 9 నాటికి 50.45 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారు. రూ.1,775 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ చేసింది. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకుని పీ4 సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్ధంగా చేపట్టాలి. కుటుంబ సాధికారిత సాధించేలా చర్యలు తీసుకోవాలి. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలి’ అని చంద్రబాబు సూచనలు చేశారు.
త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల
సంక్షేమ పథకాల అమలుకు క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం వెల్లడించారు. అన్నదాత సుఖీభవ ద్వారా శుక్రవారం మూడో విడత నిధులు విడుదల చేస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా 7.50 కోట్ల భోజనాలు పేదలకు అందించగలిగామని చెప్పారు.‘రూ.వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మత్తులు చేపట్టాం. పల్లె పండుగ కింద గ్రామాల్లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశాం. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా కలెక్టర్లు పని చేయాలి. ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం లేదా ఇంటి మంజూరుకు… ఉగాదికి 2.50 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటికీ జేజేఎం కింద తాగునీటి కుళాయి ఇస్తాం. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చూస్తాం. పెట్టుడులు గురించి ఎలా ఆలోచిస్తున్నామో… పేదల సంక్షేమం… వారి సాధికారత గురించీ కలెక్టర్లు ఆలోచించాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుత అవసరాలు, అభివృద్ధికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలని చంద్రబాబు సూచించారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలు అనుసరిస్తున్న పాఠ్యాంశాలు… మన విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలను సమీక్షించాలన్నారు. తమిళనాడు, కర్నాటక, ఏపీ రాష్ట్రాలు ఉన్నత విద్యలో అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులకు గుర్తుండి పోయేలా విశ్వవిద్యాలయాల్లో స్నాతకోత్సవాలు జరగాలన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా సంస్థల రేటింగ్ ఎలా ఉందో పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు