. పార్లమెంటు మకర ద్వారం వద్ద ధర్నా
. మార్మోగిని ‘మోదీజీ`ఎల్పీజీ’ నినాదం
. పేరు నరేంద్రుడు… పని లొంగిపోవడమని ఎంపీల చురకలు
. విదేశాంగ విధానంతో రాజీ: రాహుల్ విమర్శ
పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతూ, చమురు క్షేత్రాలపైనా దాడులు జరుగుతూ, కీలక హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడం ఇంధన కొరతకు దారితీసింది. ఈ పరిణామాల క్రమంలో ప్రతిపక్ష సభ్యులు గురువారం పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సమాధానం కోసం డిమాండ్ చేశారు.
న్యూదిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతూ, చమురు క్షేత్రాలపైనా దాడులు జరుగుతూ, కీలక హోర్ముజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడం ఇంధన కొరతకు దారితీసింది. ఈ పరిణామాల క్రమంలో ప్రతిపక్ష సభ్యులు గురువారం పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నుంచి సమాధానం కోసం డిమాండ్ చేశారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మకర ద్వారం వద్ద ఎంపీలు ధర్నా చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖడ్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు డీఎంకే, టీఎంసీ, ఎస్పీ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ‘పేరు నరేంద్రుడు… పని లొంగిపోవడం’, ‘మోదీజీ, ఎల్పీజీ’ అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. పశ్చిమాసియా పరిస్థితి, భారత్‌పై ప్రభావం గురించి పార్లమెంటులో పూర్తిస్థాయి చర్చ కోసం ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఇదే క్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై నిప్ప్పులు చెరిగారు. విదేశాంగ విధానంతో రాజీ పడటమే క్లిష్ఠ పరిస్థితులకు దారితీస్తున్నట్లు ఆక్షేపించారు. అసమర్ధ విదేశాంగ విధానం వల్ల భారతదేశ ఇంధన భద్రతకు విఘాతం కలిగిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చిన వేళ దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడే పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సంక్షోభ నివారణకు సమయం ఉందని, ప్రమాదం ముంగిట చేరకముందే తగు ఏర్పాట్లు చేసుకోవడం వివేకమని హితవు పలికారు. భయపడవద్దని ప్రజలకు సూచించే ప్రధాని స్వయంగా వణికిపోతున్నారని, ఇందుకు అమెరికాలో ఎప్స్టీన్ ఫైళ్లు, అదానీ కేసులే కారణమని రాహుల్ అన్నారు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పార్లమెంటు వద్ద ఆందోళనలో భాగంగా ప్రభుత్వం నుంచి సమాధానం కోసం ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. రాహుల్ మాట్లాడుతూ పరిస్థితి మరింత జఠిలమే ప్రమాదమున్నందున సమస్య పెరగకముందే అప్రమత్తం కావాలన్నారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని సర్కారుకు సూచించారు. తప్ప్పుడు విదేశాంగ విధానం వల్ల దేశ ఇంధన భద్రత రాజీ పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిన్న ప్రధాని కుర్చీ ఖాళీగా ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఓపక్క భయపడవద్దని దేశ పౌరులకు చెబుతున్న ఆయనే భయపడిపోతున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘విదేశాంగ విధానాన్ని మార్చుకోవడం అవసరం. గ్యాస్, పెట్రోల్ సమస్య… సంక్షోభంగా మారబోతోంది. లోపభూయిష్టమైన విధానమే సమస్యను తెచ్చిపెట్టింది’ అని విమర్శించారు. ఎల్పీజీ కొరతపై పార్లమెంటులో మాట్లాడేందుకు ప్రయత్నించగా, తనకు అనుమతి లభించలేదని రాహుల్ తెలిపారు. సాధారణంగా పద్ధతి ప్రకారం మాట్లాడేందుకు అనుమతి కోరవచ్చు కాబట్టి దేశంలో ఎల్పీజీ గ్యాస్, ఇంధన పరిస్థితిపై ప్రకటన కోసం అనుమతి ఇవ్వమని అడిగాను. కానీ ఇప్ప్పుడు సభలో కొత్త పద్ధతి మొదలైంది. మంత్రి దీనిపై నిర్ణయిస్తారు. అప్ప్పుడు నేను మాట్లాడాలి. ఆ తర్వాత మంత్రి సమాధానం ఇస్తారు’ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత వ్యంగ్యంగా అన్నారు. ఇప్పటికే దేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొత్త బుకింగ్‌లు నిలిచిపోయాయి. ఎల్పీజీ కేంద్రాల వద్ద జనం బారులు తీరే పరిస్థితి నెలకొంది. దీంతో అనేక రెస్టారెంట్లు, పీజీలు, వసతి గహాల్లో వంటలు వండే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిణామాల క్రమంలో సత్వర పరిష్కారానికి ప్రధాని చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దేశ ప్రజలు ఇక్కట్ల పాలవుతారని రాహుల్ గాంధీ హెచ్చరించారు. పార్లమెంటు వద్ద నిరసనలో భాగంగా తోటి ఎంపీలతో కలిసి టీ తాకుతూ, బిస్కెట్లు తిన్నారు. గ్యాస్ సంక్షోభం వల్ల ఛాయ్, బిస్కెట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇటుకలతో ఏర్పాటు చేసిన పొయ్యిలతో ప్రియాంక తదితర మహిళా ఎంపీలు నిరసన తెలిపారు.


