బలూచిస్థాన్‌లో సైన్యంపై రెబల్స్ దాడులు: రక్షణ మంత్రి ఆసిఫ్
ఇస్లామాబాద్: బలూచిస్థాన్‌లో భద్రతా బలగాలు భౌగోళికపరంగా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ వెల్లడించారు. 12 చోట్ల రెబెల్స్ దాడులు చేశారని, ఇది తీవ్రమైన భద్రతా పరిస్థితిని నెలకొల్పిందని చెప్పారు. బలూచిస్థాన్‌లో వేర్పాటువాదులు రెచ్చిపోతున్నారని, సైన్యంపై దాడులు పెరుగుతున్నాయని అన్నారు. బలూచ్ ప్రావిన్సులోని పట్టణాలపై ఏకకాలంలో రెబల్స్ మెరుపు దాడులు చేసినట్లు తెలిపారు. దీంతో 80 మంది భద్రతా సిబ్బంది చనిపోగా, 30కిపైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయన్నారు. బలూచ్‌లో ఉగ్రవాద నిరోధక చర్యలలో 177 మంది తిరుగుబాటుదారులు హతమైనట్టు వెల్లడించారు. ‘భౌగోళికంగా పాకిస్థాన్ భూభాగంలో బలూచిస్థాన్ 40 శాతానికి పైగా ఉంది. దీనిని నియంత్రించడం జనసాంద్రత ఉన్న నగరాన్ని నియంత్రించడం కంటే చాలా కష్టం.. భారీ సంఖ్యలో బలగాలను మోహరించాల్సిన అవసరం ఉంది. మన సైనికులను అక్కడ మోహరించి, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి తెలిపారు. గత వారంతంలో జరిపిన హింసలో 33 మంది పౌరులు, 17 మంది సైనికులు చనిపోయినట్టు పాక్ అధికారులు వెల్లడించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎలఏ)తో చర్చలు ఉండబోవని ఆసిఫ్ తేల్చిచెప్పారు. నేరస్థులకు, వేర్పాటువాద సంఘాలకు మధ్య సంబంధం ఉందని, బీఎలఏ బ్యానర్ కింద నేర ముఠాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ‘బలూచ్‌లోని గిరిజన పెద్దలు, అధికార యంత్రాంగం, వేర్పాటువాద ఉద్యమాలను నడుపుతున్న వారు ఒక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.. ఈ స్మగ్లర్లు గతంలో చమురు అక్రమ రవాణా ద్వారా రోజుకు 4 బిలియన్ల పాక్ రూపాయల వరకు సంపాదించారు’ అని ఆసిఫ్ వెల్లడించారు.


