ఎం.కోటేశ్వరరావు
‘‘పాకిస్థాన్ 60 బిలియన్ డాలర్ల ఆర్థిక నడవా ప్రాజెక్టు నుంచి వైదొలిగిన చైనా, నిధుల కోసం ఏడీబీని ఆశ్రయించిన ఇస్లామాబాద్’’ ఇది కొన్ని పత్రికల్లో వచ్చిన వార్త శీర్షిక. ఇదే అర్ధం వచ్చేవి మరికొన్నింటిలో వున్నాయి. దీనికి కాషాయ దళం చెప్పిన భాష్యం ఏమిటి ! ‘‘భారత జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే కనెక్టివిటీని మోదీ వ్యతిరేకించిన తరువాత (సీపీఈసీ ప్రాజెక్టులో స్పష్టంగా సూచించడం) చైనా పాకిస్థాన్ 60 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు నుంచి వైదొలిగింది. ఇది భారతదేశానికి దౌత్యపరంగా అతిగొప్ప విజయం, పాక్‌కు చావు దెబ్బ’’ అని పేర్కొన్నారు. ఇది నిజమా ? మొదటి అవాస్తవం ఏమిటంటే నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగాక ముందే దానికి నాంది పలికిన 2013లోనే నాటి యూపీిఏ ప్రభుత్వం ఈ పథకానికి అభ్యంతరం తెలుపుతూ వ్యతిరేకించింది. ఎందుకు ? పాక్ ఆక్రమిత్ కాశ్మీరులో భాగమైన గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంలో 600 కిలోమీటర్ల పొడవున పాకిస్థాన్, చైనా నడవా ప్రాజెక్టులో భాగంగా రోడ్డు, రైలు మార్గ నిర్మాణం సాగుతోంది. అది చైనాలోని షింజియాంగ్ స్వయంపాలిత ప్రాంతం నుంచి మొదలై మూడువేల కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ అరేబియా సముద్ర తీరంలోని గ్వాదర్ రేవు వరకు ఉంటుంది. గిల్గిట్ బాల్టిస్థాన్ ప్రాంతంపై మనదేశం హక్కును వదులుకోలేదు గనుక తమ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని మన ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ సర్కార్ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వివిధ సందర్భాలలో నిరసన తెలుపుతూనే ఉంది. వాస్తవం ఇది కాగా కొత్తగా మోదీ వ్యతిరేకత తెలిపినట్లు దానికి తలొగ్గి ప్రాజెక్టు నుంచి చైనా వైదొలిగి నట్లు చెప్పటం జనాల చెవుల్లో పూలు పెట్టటం తప్ప మరొకటి కాదు. ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
నిజానికి మన్మోహన్ సింగ్ గానీ, నరేంద్ర మోదీ గానీ ఈ సమస్య మీద పెద్దగా చేసిందేమీ లేదు. వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇద్దరూ చైనాతో ఇతర సంబంధాలను కొనసాగించారు. షాంఘై సహకార సంస్థలో మనదేశం 2005 నుంచి పరిశీలకురాలిగా 2014వరకు ఉంది. ఆ ఏడాది మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. మన దేశమూ, పాకిస్థాన్ రెండూ 2017లో ఒకేసారి సభ్యత్వం పొందాయి. అప్పుడు పాక్ నడవాను ఒక సమస్యగా మోదీ ముందుకు తేలేదు. నరేంద్రమోదీ హయాంలో 2020 గాల్వన్‌లోయ ఉదంతాల ముందు వరకు చైనాతో సంబంధాలు మరింత ముందుకు పోయాయి. ఐదేళ్ల్ల తరువాత తిరిగి సాధారణ స్థితికి వస్తున్నాయి. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) 25వ వార్షిక సమావేశాలకు నరేంద్రమోదీతో పాటు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు. మోదీ వెంటనే తిరిగి రాగా సెప్టెంబరు మూడున జపాన్‌పై రెండవ ప్రపంచ యుద్ధంలో చైనా సాధించిన విజయం 80వ వార్షికోత్సవ మిలిటరీ పెరేడ్‌లో ఒక అతిధిగా షరీఫ్ పాల్గొన్నారు. ఆ ఉత్సవానికి నరేంద్రమోదీకి కూడా ఆహ్వానం ఉన్నప్పటికీ హాజరు కాలేదు. ఎస్‌సీిఓ సమావేశాలలో సీపీఈసీి గురించి అభ్యంతరాలు తెలిపినట్లుగానీ, చైనా నేతలతో మాట్లాడినట్లుగానీ ఒక్కటంటే ఒక్క వార్త కూడా రాలేదు. వాట్సాప్ యూనివర్సిటీ పండితులకూ అది తట్టకపోవటం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ కొద్ది రోజుల తరువాత మీడియాలో వచ్చిన కథనాలను పట్టుకొని ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్ తనదైన శైలిలో రాసింది. ఆరు రోజులపాటు చైనాలో ఉన్నప్పటికీ షెహబాజ్ షరీఫ్ సీపీఈసీికి రెండవ దశ పెట్టుబడుల విషయంలో విఫలమయ్యారు. పరిమితమైన అవగాహన ఒప్పందాలు మాత్రమే చేసుకున్నారు. పెద్ద పెట్టుబడులేమీ లేదు. సీపీఈసీిి 2.0 ప్రారంభమైనట్లు షెహబాజ్ ఏకపక్షంగా ప్రకటించారు తప్ప చైనా వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు. పెరేడ్‌లో చైనా అధ్యక్షుడు తనతో పాటు పుతిన్, కిమ్‌ను తప్ప షెహబాజ్‌ను పట్టించుకోలేదు. పుతిన్‌తో సంభాషించినప్పుడు చెవులకు ఫోన్లను కూడా సరిగా అమర్చుకోలేకపోయారంటూ రాసింది. పాకిస్థాన్‌తో సీపీఈసీిి పెట్టుబడుల నుంచి వెనక్కు తగ్గినట్లు చైనా అధికారిక ప్రకటనను ఆర్గనైజర్ లేదా కథనాలు రాసిన ఇతర పత్రికలు చూపగలవా ?
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఎటుతిప్పి ఎటురాసినా కీలకమైన రైల్వే ప్రాజెక్టుకు రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఇవ్వటం లేదని చైనా చెప్పిందని, గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు తగ్గిందని, ఆ మొత్తాన్ని ఆసియన్ అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నుంచి తీసుకోవాలని పాక్ నిర్ణయించిందని రాశాయి. పదే పదే ఐఎంఎఫ్ నుంచి రుణాలు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు తాము ఇచ్చిన రుణాలను చెల్లించే సత్తా దానికి ఉందా అనే అనుమానాలు చైనాకు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఒక స్నేహితుడి కోసం మరొకర్ని వదులుకోలేమని ఇటీవల పాక్ ఆర్మీ ప్రధాన అధికారి అసిమ్ మునీర్ చెప్పాడని, దాంతో చైనా పెద్దగా ఆసక్తి చూపటం లేదన్నట్లుగా వర్ణించారు. ఇదే సమయంలో 8.5 బిలియన్ డాలర్లను వివిధ పథకాలకు చైనా అందించేందుకు పాక్ ప్రధానితో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వచ్చిన వార్తలను మన మీడియా పెద్దగా పట్టించుకోలేదు. రెండు బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు తిరస్కరించిన చైనా కొత్తగా 8.5 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినట్లు ? ఈ మొత్తాన్ని సీపీఈసీి 2.0లో ఐదు కొత్త కారిడార్లు, అదే విధంగా ఇతర రంగాలలో వినియోగించనున్నట్లు ప్రముఖ పాక్ పత్రిక డాన్ రాసిందని మన దేశ వార్తా సంస్థ పీటీఐ పేర్కొన్నది. తొలిసారిగా పశ్చిమ దేశాలతో చేతులు కలిపిన ఒక సంస్థ సీపీఈసీిిలో పెట్టుబడులు పెట్టేందుకు చొరవ చూపిందని కూడా వార్తల్లో రాశారు.
నిజానికి ఇలాంటి కథనాలు రావటం ఇదే కొత్త కాదు. 2024 జూన్ 11న మన దేశంలోని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రాసిన కథనానికి ‘‘సీపీఈసీిి 2.0 లేదు, భారీ పెట్టుబడులు లేవని పాకిస్థాన్‌కు చెప్పకనే చెప్పింది’’ అనే శీర్షిక పెట్టింది. ఐదు రోజుల పర్యటన జరిపిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ పర్యటనకు ముందు ఇస్లామాబాద్ అధికారులు సీపీఈసీిని మరొక ఉన్నత స్థాయికి తీసుకువెళతారని చెప్పారని అయితే ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని, పాక్ ఆశల మీద చైనా నీళ్లు చల్లిందని, పరిమిత లబ్ధితోనే తిరిగి వెళ్లినట్లు నికీ ఆసియా రాసిందని దాన్లో పేర్కొన్నారు. ఏడాది క్రితం మోదీ చైనా వెళ్లలేదు, దానితో సాధారణ సంబంధాల స్థితి కూడా లేదు, అప్పుడెందుకు చైనా అలా వ్యవహరించిందో మీడియా ‘‘వంట’’ వారు, కాషాయ దళాలు చెప్పగలవా? ‘‘పాకిస్థాన్ : ఎందుకు చైనా సీపీఈసీి ప్రాజెక్టులు నిలిపివేసింది ?’’ అనే శీర్షికతో దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అబ్జర్వర్ రిసర్చ్ ఫౌండేషన్ (ఓఆర్‌ఎఫ్) వెబ్‌సైట్‌లో 2020 నవంబరు 25వ తేదీన అయిజాజ్ వానీ రాసిన విశ్లేషణను ప్రచురించింది. అప్పుడు గాల్వన్‌లోయ ఉదంతాలతో చైనాతో మన దేశం వైరంలో ఉంది తప్ప మిత్రదేశంగా లేదు కదా, ఆనాడే అలా ఎందుకు రాయాల్సి వచ్చినట్లు ? నరేంద్రమోదీ నిరసన లేదా పలుకుబడి ఏమైనట్లు ? అప్పటికే కొన్ని అంశాలను నిలిపివేసినట్లు అయిజాజ్ వానీ రాశారు. పాకిస్థాన్‌లో మాంద్యం, అవినీతి, బెలూచిస్తాన్ ఇతర తిరుగుబాట్లు వంటి అంశాలతో అనేక ప్రాజక్టులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు.
సీపీఈసీి అవకాశాన్ని పాకిస్థాన్ వృధా కావించిందని, మద్దతు గురించి చైనా పునరాలోచనలో పడిరదని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయ మాజీ ఫ్రొఫెసర్ సజ్దాద్ అష్రాఫ్ 2025 మే రెండవ తేదీన రాశారు. పదేళ్ల తరువాత పాకిస్థాన్ అసమర్ధత, రాజకీయ అవకతవకల వంటి కారణాలతో అనేక కీలక ప్రాజెక్టులు ఆలస్యం, వాయిదా పడటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం.2015 ఏప్రిల్ 20న షీ జింపింగ్ ఇస్లామాబాద్‌లో ఎంతో అట్టహాసంగా ప్రాజెక్టును ప్రారంభించారు. పదేళ్ల్ల తరువాత తలపెట్టిన 90 పథకాల్లో 38 పూర్తి కాగా మరో 23 నిర్మాణంలో ఉన్నాయి. మూడోవంతును ఇంతవరకు ముట్టుకోలేదు. దీనికి బాధ్యత పరిమితంగా చైనాది కాగా ఎక్కువగా ఇస్లామాబాద్‌దే ఉంది. అత్యంత కీలకమైన ప్రత్యేకించి సెజ్‌లు, పారిశ్రామికవాడలు పూర్తికాలేదు. దీనికి పాకిస్థాన్ రాజకీయ నేతలు, ఆసక్తి కనపరచని ఉన్నతాధికారులదే బాధ్యత. వీటికి కేటాయించిన వనరులను ఆర్థికంగా పెద్దగా చెప్పుకొనేందుకు ఏమీ ఉండని లాహారో మెట్రో రైలు ప్రాజెక్టులకు మళ్లించారు. ఇలాంటి వాటికి తోడు 2021 నుంచి ప్రాజెక్టులలో పని చేస్తున్న చైనా సిబ్బందికి రక్షణ కల్పించటంలో తీవ్ర పరిస్థితి ఏర్పడిరది. అప్పటి నుంచి 14దాడులు జరగ్గా 20 మంది మరణించారు, 34 మంది గాయపడ్డారు. వీటిలో ఎక్కువభాగం బెలూచిస్తాన్‌లో జరిగాయి. దౌత్యపరంగా ఇప్పటికీ సీపీఈసీికి చైనా మద్దతు ఉన్నప్పటికీ 2023 తరువాత కొత్త పెట్టుబడుల పట్ల వెనక్కి తగ్గుతున్నది.
పాక్ ప్రాజెక్టులపై కాషాయ దళాల ప్రచారం నిజమా?
- Advertisement -


