Sunday, December 7, 2025
Homeవిశ్లేషణపాడె రాజకీయాలుకవి గాయకుల మరణాలు

పాడె రాజకీయాలుకవి గాయకుల మరణాలు

- Advertisement -

దుర్గం రవీందర్‌
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ కవి గాయకుడు అందేశ్రీ చనిపోయినప్పుడు పాడే మోసి వార్తలకు వస్తువయ్యాడు. ఇందులో కవుల పట్ల అభిమానం కన్నా రాజకీయం ఉందన్న విషయం అవగతం అవుతూనే ఉన్నది. మొన్న మాజీ మంత్రి హరీష్‌రావు తండ్రి చనిపోయినప్పుడు ఒక రెడ్డి శాసనసభ్యుడు, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను పాడె మోయనివ్వలేదని, భుజం మార్చుకోవడానికి వెళ్తే తోసి వేశాడని ఒక వార్త వైరల్‌ అయింది. బీసీ ఉద్యమకారులైన కొందరు, బీసీలను పాడె కూడ మోయనివ్వరా అని హడావిడి చేశారు. 2018 ఆగస్టులో ఎన్టీఆర్‌ కొడుకు హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పుడు హైదరాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన పాడె మోసి ఆ కుటుంబ పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి బావమరిదికి తెలంగాణ ప్రభుత్వం అధికారం లాంఛనాలతో సాగనంపడం గమనించదగిన విషయం. ఇంకా ఆయనకు అప్పటి ముఖ్యమంత్రి స్మృతి వనం కూడా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇవన్నీ పాడె రాజకీయాలు. ఆత్మీయులు, రక్త సంబంధీకులు చనిపోయినప్పుడు ప్రేమతో అతని పాడె మోసి సాగనంపుతారు. నేను ఇష్టపడే అలిశెట్టి ప్రభాకర్‌, జి.కృష్ణ మొదలుకొని చాలామంది పాడె మోశాను.
తెలంగాణలో కొన్ని కులాల్లో, కొన్ని ప్రాంతాల్లో మొదట పాడె నెత్తిన వారికి మూడవరోజు బరువు దింపుడు కార్యక్రమం అని ఒకటి ఉంటుంది. భుజానికి నేతిని రాసి స్నానం చేయిస్తారు. పంక్తిలో తొలి భోజనం వారికే పెడతారు. ఇది మృతుని కుటుంబీకులు పాడె మోసిన వారికి థాంక్స్‌ చెప్పడం లాంటిది. ఘంటసాల వెంకటేశ్వరరావు చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయన గొంతు అరువు తీసుకున్న ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తదితరులు వెళ్లగలిగిన అవకాశం ఉండి వెళ్లలేదు. ప్రముఖ అస్సామీ కవి, గాయకుడు జూబిన్‌ గార్గ్‌ మొన్న సింగపూర్‌లో నమ్మిన వారి చేతుల్లోనే అసువులు బాసినప్పుడు ఆయనను సాగనంపడానికి ముఖ్యమంత్రితో సహా చాలామంది వచ్చారు. ఐదు రోజులు సంతాపం ప్రకటించారు. ప్రతి అస్సామీ, వారికి తోచిన పద్ధతిలో శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ అంతగా రాజకీయాలు గోచరించలేదు. అలాగే మరో అస్సామీ గాయకుడు భూపేన్‌ హజారికా మరణించినప్పుడు యావత్‌ అస్సాం కంటతడి పెట్టింది. ఆయన కడచూపూ కోసం లైన్‌లో నిలబడి ఐదు రోజులు జనం ఎదురు చూశారు. సుకవి మరణించినప్పుడు సమాజం, దేశం కంటతడి పెడుతుంది, అలాగే సమాజం -దేశం కష్టాల్లో ఉన్నప్పుడు కవులు కలత చెందుతారు. ‘‘యే మేరే వతంకే లోగో, జర అంకోమే బర్‌ లే పాని’’ అని కవి ప్రదీప్‌ రాసిన గీతం మనం అందరం విన్నదే. అతన్ని జనం ప్రేమగా కవి ప్రదీప్‌ అని పిలుచుకున్నారు. బహుశా అతనెప్పుడు తాను కవిని అని చెప్పుకుని ఉండడు. ఇది సుకవులకు కుకవులకు ఉన్న తేడా.
ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించినప్పుడు కరోనా ఉంది కాబట్టి కొద్దిమంది ఆరాధ్య బ్రాహ్మలు, అతి కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఆయనను శైవ ఆచారం ప్రకారం కూర్చోబెట్టి ఖననం చేశారు. బడే గులాం అలీఖాన్‌ హైదరాబాద్‌లో మరణించినప్పుడు అతని అభిమానులు వేలాదిమంది ఇక్కడ హరిబౌలిలో ఆయనను సగౌరవంగా సాగనంపారు. ఆయన సమాధిని ఆర్వీ రామారావ్‌ నాకు చూపించాడు కూడా. గద్దర్‌ మరణించినప్పుడు ఆయనను చివరి చూపు చూడ్డానికి వేలాదిమంది వచ్చారు. ఆయన కోరుకున్నట్టు బౌద్ధమతం ఆచారాల ప్రకారం ఆయన్ని గౌరవంగా పంపించారు. ఆయనకు నివాళి అర్పించడానికి కూడా రాజకీయవాదులు పోటీలు పడ్డారు. ఆయన మరణాన్ని ఆయన ఇష్టపడని రాజకీయవాదులు వాడుకున్నారు, వాడుకుంటున్నారు. పాపం గూడ అంజయ్య ముఖ్యమంత్రి దర్శనం కోసం నోరు తెరిచి అడిగి నిరాశతోనే జరిగిపోయాడు. చాలా మంది ప్రతిభావంతులు ఏ హడావిడికి నోచుకోకుండానే వెళ్లిపోతారు. నిజంగానే వారు హడావిడికి ఇష్ట పడరు. ’’లెట్‌ మీ గో ఆన్‌ నోటీస్డ్‌ ‘‘అని రాసుకున్న కవులున్నారు కూడా. లతామంగేష్కర్‌ దాదాపు కారణజన్మురాలు. పాటలు పాడడానికే పుట్టినట్టు పెళ్లి కూడా చేసుకోకుండా పాటకు, కుటుంబానికి అంకితమైన అరుదైన ప్రతిభను కనబరిచిన గాయని. ఆమె చివరలో ఆసుపత్రిలో ఇచ్చిన సేట్‌మెంట్‌ వల్ల ఆమెకు తాత్విక జగత్తులో గొప్ప గుర్తింపు లభించింది. ఆమెను మరాటా సమాజం బొంబాయి, సిని వరల్డ్‌ గౌరవంగానే సాగనంపింది.
తెలుగు గాయని ఎస్‌.జానకి అత్యంత ప్రతిభావంతురాలు, లతాజీకి ఏ మాత్రం తక్కువ కాదు, వీరు లేరని ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌ వచ్చాయి. దానికి ఆమె నవ్వుకుని ఉంటారు. అంటే, పద్మశ్రీ కన్న పెద్ద అవార్డులు రాదగినంత ప్రతిభ ఉన్న ఎస్‌.జానకికి గాడ్‌ ఫాదర్‌ లేడు, రాజకీయాలు తెలియవు కాబట్టి ఏ అవార్డులు రాలేదు. ఆమె హైదరాబాదులో ‘‘అనాయాసేన మరణం – వినాదైన్యేన జీవనం’’ అనుకుంటూ ఎవరి మీద ఫిర్యాదు చేయకుండా ప్రశాంత విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఎస్‌. జానకి కూడా లతా మంగేష్కర్‌ అంతటి ప్రతిభవంతురాలు.
త్యాగరాజు గొప్ప రామభక్తుడు, సంగీత సామ్రాజ్య రారాజు. ఆయనకు మరణం ఆసన్నమైనదని తెలిసింది కాబోలు. తన జీవితకాలంలో సన్నిహితంగా ఉన్న కొందరిని ఒకనాడు భోజనానికి పిలిచి తెలిసో తెలియకో నా వలన మీకు ఎప్పుడైనా ఏదైనా అసౌకర్యం కలిగినా, బాధ కలిగినా నన్ను క్షమించండి అని క్షమాపణలు కోరి భోజనం పెట్టి వారిని సాగనంపి, ఆ పూటే ఆయనా వెళ్లిపోయాడు. పాడె రాజకీయాలు అనగానే వచ్చిన ఆలోచనలు ఇవి. లౌడ్‌ థింకింగ్‌కు అక్షరీకరణ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు