. నియోజకవర్గ పార్టీ ఇంచార్జి బాధ్యతల నుంచి తొలగింపు
. టీడీపీ అధిష్ఠానం నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. భాగస్వామ్యపక్షంలో అపోహలు తొలగించి కూటమిని మరింత పటిష్టమంతం చేయడమే లక్ష్యంగా పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పించింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి ఎస్వీఎసఎన్ వర్మ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వర్మ సీటు ఆశించారు. కానీ పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్‌కు కేటాయించాల్సి వచ్చింది. వర్మకు సీటు రాకపోవటంపై ఆయన మద్దతుదారులు అప్పట్లో ఆందోళనకు దిగారు. టీడీపీ అధిష్ఠానం వర్మను బుజ్జగించి… వైసీపీని గద్దె దించడానికి జనసేనతో భాగస్వామ్యం ఎంత కీలకమో వివరించి నచ్చజెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే వర్మకు సరైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో మెత్తబడిన వర్మ… పవన్ కల్యాణ్‌కు పూర్తిగా సహకరిస్తామని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రకటించారు. పవన్ సైతం తన గెలుపు బాధ్యతలు వర్మకే అప్పగిస్తున్నానని చెప్పారు. ఆ మేరకు భారీ మెజార్టీతో పవన్ కల్యాణ్ గెలవడం, ఉప ముఖ్యమంత్రి కావడంతో వర్మకు కీలక పదవి దక్కుతుందని అక్కడి టీడీపీ వర్గీయులు ఆశపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా వర్మకు ఎటువంటి పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ కానీ, రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి కానీ ఖాయమని అంతా భావించారు. కానీ Âనెలలు, సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి పదవి ఇవ్వక పోగా… పిఠాపురం నియోజక వర్గంలో వర్మకు జనసేన నేతలు సరైన గౌరవం ఇవ్వటం లేదనే అసంతృప్తి టీడీపీ కార్యకర్తల్లో పెరుగుతూ వచ్చింది. దీనివల్లే ఆ నియోజకవర్గంలో కొంతకాలంగా టీడీపీ- జనసేన మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫొటో ఫ్లెక్సీపై లేకపోవటంతో వర్మ బహిరంగంగా జనసేన నేతలను నిలదీశారు. ఆయనే స్వయంగా వివాదం రేపడంతో టీడీపీ- జనసేన వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా మీడియాలో సంచలనమైంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రయాణం చేసేలా తాము నియోజకవర్గాల వారీ కమిటీలు వేసి కూటమి పటిష్టతకు కృషి చేస్తుంటే… కొందరి వల్ల అందరికీ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ వ్యవహారంపై తక్షణమే వర్మతో మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను ఆదేశించారు. ఆ తర్వాత పార్టీ పోలిట్ బ్యూరో, నూతన కమిటీల ప్రమాణ స్వీకార సమయంలోనూ పరోక్షంగా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొందరి ప్రవర్తనతో తాను ఆవేదన చెందానని వ్యాఖ్యానించారు. ఫ్లెక్సీలు, ఫొటోల కోసం తగాదాలు పడి పార్టీకి నష్టం చేకూర్చవద్దని చురకలంటించారు. ఆ తరువాత వర్మ తన కుమారుడితో సహా వివరణ ఇచ్చేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్‌ను కలిసినట్లు తెలిసింది. అయినప్పటికీ పవన్ కల్యాణ్, జనసేన నేతలను సంతృప్తిపరిచేందుకు వర్మను పిఠాపురం పార్టీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ టీడీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. మరో నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా తమ పార్టీ నేతలకు హెచ్చరికగా ఉండేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. అక్కడి పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తా: వర్మ
తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తానని పిఠా పురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న అధిష్ఠానం నిర్ణయంపై వర్మ స్పందించారు. రకరకాల సమీకరణలతో మార్పులు జరుగుతుంటాయి. అంతిమంగా పార్టీ బాగుండాలనేదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.


