పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సుమారు 5 లక్షల మందిలో 3లక్షల మంది అదివాసులే! ప్రాజెక్టు రాకముందు వరకూ వారికి ఇదేమిటో ఏమాత్రం తెలియదు. తమ తమ గ్రామాలు, అడవులు, నదులు, వాగులు, అసలు తమ జీవన ప్రపంచంలో నుంచి వారిని ఆకస్మాత్‌గా గెంటివేశారు.
ప్రాజెక్టు ప్రారంభమై 20 సంవత్సరాలు గడిచాయి. లక్షాఆరువేల కుటుంబాలలో కేవలం 13 వేల కుటుంబాలకే కాగితాలపై పునరావాసం కల్పించారు. వీరిలో కూడా కొందరికి ఆర్ అండ్ ఆర్ (రీ హబిలిటేషన్` రీ సెటిల్మెంట్ ) పరిహారాలు అందితే, కొందరికి వారి ఇళ్ల నష్ట పరిహారాలు కూడా అందలేదు. కత్తెనపల్లి అనే గ్రామంలో 70 కుటుంబాలలో ఏ ఒక్కరికీ ఇళ్లకు నష్టపరిహారం కానీ, ఆర్ అండ్ ఆర్ పరిహారం కానీ ఏదీ ఈ రోజుకూ అందలేదు. కొండమొదలు పంచాయితికి చెందిన నేలదోనెలపాడు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని మొత్తం 500 కుటుంబాలలో 87 మందికి అన్ని అర్హతలు ఉన్నా నష్టపరిహారాలు, ఆర్ అండ్ ఆర్ పరిహారాలు అందలేదు. వారి వారి గ్రామాల నుంచి ఖాళీ చేయించడానికి అధికారులు ఎన్నో మాయమాటలు చెప్పారు. మీరు ముందు ఖాళీ చేయండి, మీ డబ్బులు మీకు పడతాయని చెప్పారు. బలవంతంగా ప్రజలను తరలించారు. గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రేషన్ ఆపివేశారు, వైద్య సహాయకులను గ్రామాలకు వెళ్లకుండా ఆపివేశారు. ఆదివాసులు ఖాళీచేసి వచ్చాక ఇప్పుడు పోర్టల్ ఓపెన్ కావడంలేదు. అది ఓపెన్ అయినప్పుడు మీకు డబ్బులు పడతాయని చెపుతున్నారు.
చివరకు తమ భూములు, అడవి కోల్పోయిన ఆదివాసులు ఈ కాలనీలలోకి వచ్చారు. దున్నుకోవడానికి భూమిలేదు. అడవి లేదు, కూలిపనులు తప్ప మార్గం లేదు. వీరంతా ఇప్పుడు తీవ్రమైన శ్రమదోపిడికి గురౌతున్నారు. మహిళలు అర్థరాత్రి పనుల కోసం చాలా దూరాలు ప్రయాణించి మరల సాయంత్రాలకు ఇళ్లకు చేరుతున్నారు. అక్కడా కూలీ ఎగవేతలు జరుగుతున్నాయి. నిరాశ, నిస్పృహలతో యవకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆదివాసీ సమాజాలలో ఎన్నడూ లేని ఆత్మహత్యల ధోరణి యువకులలో పెరుగుతున్నది. ఈ నిరాశే మనుషులను తాగుడుకు బానిసలు చేస్తున్నది. భూమి, అటవీ వనరులే ఆదివాసీల మనుగడకు కీలకం! పునరావాస కాలనీలలోకి తరలించే వరకూ ప్రతి ఆదివాసి కుటుంబమూ రైతు కుటుంబమే, రైతు జీవితం నుంచి చౌక కూలీలుగా ఆదివాసులను మార్చడమే ఇప్పుడు పునరావాసంలో కనపడుతున్న అసలు నీతి!
భూమి కోసం కొండమొదలు ఆదివాసులు చాలా కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 1982 నవంబర్ 29వ తేదీన భూస్వాములు, పోలీసులు కుమ్మక్కై సాగించిన కాల్పుల్లో కుంజం రాజులు, మడెం లక్ష్మయ్య అమరులయ్యారు. అమరుల త్యాగాలతో భూములను పోరాడి సాధించుకొన్నాక వారి జీవితాలలో వచ్చిన గొప్ప మార్పులను వారు గుర్తించారు. భూమే వారికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. వారి భూమి హక్కులు కాలరాచే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, 2015లో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొన్నారు. అధికారులు మీరు కేసులు వెనక్కి తీసుకొంటే మీ భూములు 426 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగిస్తామని చెప్పారు. దీని కోసం ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఓయూ) చేసుకొందామని చెప్పారు. మీరు ఇదే విషయంగా, హైకోర్టులో చెపితే మేము అంగీకరిస్తామని ఆదివాసులు చెప్పారు. 2017 జూన్22న ప్రభుత్వం వారితో ఒక ఎంఓయూను కుదుర్చుకొన్నది. చెప్పిన విధంగానే ఆదివాసులు హైకోర్టులోని నాలుగు కేసులను ఉపసంహరించుకొన్నారు. ఇది జరిగి 8 ఏళ్లు అవుతున్నా, భూములలో ఒక్క సెంటు ఈ రోజుకూ ఆదివాసులకు ఇవ్వలేదు. అయినా అదివాసులు వారి నాయకులు నిరంతరం గిరిజన సంఘ నాయకత్వాన పోరాడుతూనే వస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం భూములకు నోటిఫికేషన్లు ఇచ్చింది. భూముల కొనుగోలు కోసం 43 కోట్ల రూపాయిలు కేటాయించింది. 426 ఎకరాలలో 167 ఎకరాలు ఇప్పటికే సేకరించింది. కానీ ఈ తొలకరి నాటికి మొదటి విడతగా ఈ భూములనైనా ఇమ్మని ఆదివాసులు కోరుతున్నారు. తొలకరి వస్తున్నది. వాటిని వెంటనే అధికారులు ఆదివాసులకు అప్పగించాలని, మిగిలిన వాటికి నిధులు విడుదల చేసి భూములు సేకరించి అప్పగించాలని ఆదివాసులు కోరుతున్నారు. కత్తనపల్లి గ్రామానికి 70 కుటుంబాలకు, ఇంకా మిగిలిన గ్రామాల 87 మందికీ ఇళ్ల సష్టపరిహారాలు, ఆర్ అండ్ ఆర్ పరిహారాలు అందచేయాలి.
పంచాయితీ కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండి, 500 పైబడిన ఓటర్లు ఉన్న ఆదివాసి గూడాలను ప్రత్యేక పంచాయితీలుగా గుర్తించాలన్న జీఓఎంఎస్ 63 ప్రకారం కొండమొదలు పెదకాలని (నేలదోనెలపాడు), పెదభీంపల్లి – 3 కాలనీ తదితర కాలనీలను ప్రత్యేక అదివాసి పంచాయితీలుగా వెంటనే నోటిఫీకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక పంచాయితీలోని గ్రామాలు దూరంగా విడిపోయాయి. వాటికి నిధులను ప్రభుత్వం కేటాయించనందున తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా ప్రత్యేక పంచాయితీలు ఏర్పరచాలని అక్టోబరు 2024 లోనే గ్రామసభలు తీర్మానాలు చేసి పంపాయి. కనుక జోవో 63ను అమలు చేయాలి.
పోలవరం నిర్వాసితుల కష్టాలు బాధలు లోతైనవి. ఆదివాసీలలో ఒక తెగ దాని ఉనికిని కోల్పోయిన తీవ్రమైన పరిస్థితి ఇది. విలీన మండలాల పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంది. నిరంతరం ముంపులోనే వారుంటున్నారు. నిర్వాసితులందరి అసలైన జీవితం మాత్రం నాశనమౌతున్నది. భూమి, వనరులపై జీవించే అవకాశం ఇవే ఆదివాసులకు అవసరం. కనుక పోలవరం నిర్వాసితుల ఆసలు మౌలిక జీవిత సమస్యను అర్ధంచేసుకొని, వారి మౌలిక సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ భూమి, ఆడవి, సంపూర్ణమైన పునరావాస సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి.
సింహాద్రి రaాన్సీ
అధ్యక్షులు, రైతుకూలీ సంఘం (ఆం.ప్ర.)