Homeపోలవరం… పొలికేక!

పోలవరం… పొలికేక!

- Advertisement -

బాంబు పేలుళ్లతో గిరిపుత్రుల బెంబేలు

. బీటలువారుతున్న ఇళ్లు… దెబ్బతింటున్న పంటలు
. క్వారీ తవ్వకాల్లో నిబంధనలకు పాతర
. మామూళ్ల మత్తులో అధికారులు, పాలకులు
. కొరవడిన పర్యవేక్షణ… యథేచ్ఛగా తరలుతున్న నల్లబంగారం

విశాలాంధ్ర బ్యూరో- రంపచోడవరం: రాష్ట్రంలో అనేక తర్జనభర్జనల తరువాత గిరిజన ప్రజానీకం కోరికను మన్నిస్తూ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లా వాసులు… మైనింగ్ మాఫియా దెబ్బకు పొలికేకలు పెడుతున్నారు. నిత్యం బాంబు పేలుళ్లకు భయభ్రాంతులవుతున్నారు. కిలోమీటర్ల మేర వచ్చిపడుతున్న రాళ్లకు గాయపడుతున్నారు. ఇళ్లు ధ్వంసం అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. క్వారీ పేలుళ్లకు భూమి దద్దరిల్లడమే కాదు పంటలను సైతం నష్టపోతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇదంతా కళ్లముందే కానవస్తున్నా తమను ఎవరూ పట్టించుకోవడంలేదని గగ్గోలు పెడుతున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం నర్సాపురం వద్ద రెండు నల్లరాయి క్వారీలు, గంగవరం మండలం ఓజుబంధ వద్ద నల్ల రాయి క్వారీ తవ్వకాలకు వినియోగిస్తున్న బాంబు పేలుళ్లకు గ్రామస్థులు బెంబేలెత్తిపోతున్నారు. నిత్యం నిద్రలేని రాత్రుళ్లు గడువుతున్నారు. నిబంధనలకు పాతరేసి సమీప గిరిజన గ్రామాల ప్రజలకు క్వారీ యజమానులు నరకం చూపుతున్నారు. ప్రజాప్రతినిధులు గాని, అమ్యామ్యాలకు అలవాటు పడిన అధికారులు గాని ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆస రాగా తీసుకుని అక్రమార్కులు అడ్డగోలు తవ్వకాలు జరిపి జేబులు నింపుకుంటు న్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారు. ప్రధానంగా గిరిజనులు నివశించే ప్రాంతాలనే ఎంచుకుని తమను ఎదిరించే వారే లేరన్నట్టుగా పగలూ రాత్రీ అన్న తేడా లేకుండా ఇష్టరీతిన బాంబులతో క్వారీని పేల్చివేస్తూ రాయిరప్పలతో కూడిన మట్టి బంగారాన్ని దోచేస్తున్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన బోర్ బ్లాస్టింగ్ విధానం ద్వారా క్వారీని పేల్చేస్తుండడంతో రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలు దద్దరిల్లిపోతున్నాయి. రాళ్లు పడి ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. రేకులు, గోడలు బీటలువారుతున్నాయి. ప్రజలు గాయపడిన సంఘటనలు కోకొల్లలు. ఏళ్లుగా క్వారీలు నడుస్తున్నా… గతంలో పెద్దమొత్తంలో తవ్వేందుకు కంప్రెషర్ జాకీ విధానంలో రాయిని పగులగొట్టేవారు. నాడు అంత నష్టం వాటిల్లేదే కాదు. కానీ ఈ మూడు చోట్లా క్వారీలో నిర్వహిస్తున్న బోర్ బ్లాస్టింగ్ వల్ల భూమి బద్దలవడమే కాకుండా తాము పంటలు సైతం నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. రాళ్లు మీద పడటంతో గాయపడుతున్నామన్నారు. తరచూ ఇళ్లు మరమ్మతులు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. క్వారీ కార్మికుల రక్షణకు సైతం యాజమాన్యం చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు అంటున్నారు. రెనెన్యూ, పోలీస్ శాఖ, ఐటీడీఏ సహా మైనింగ్ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పేలుళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న విమర్శలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే విధంగా సమీప గ్రామాలను అభివృద్ధి చేస్తామని నమ్మబలికి రంపచోడవరం మండలం చూప్పరిపాలెం గ్రానైట్, రామన్నపాలెం ఊట్ల నల్లరాయి క్వారీ, గంగవరం మండలం జడ్డేరు గ్రానైట్ క్వారీ తవ్వకాలూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మామూళ్ల మత్తులో పడి అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు గుప్పిస్తు న్నారు. తమ గోడు వెళ్లబుచ్చుకుంటే న్యాయం జరుగుతుందన్న ఆశతో జిల్లా స్థాయి అధికారులకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకుకట్టినట్టు చెప్పినా… తామేమీ తక్కువ తినలేదన్నట్టుగా వారిలో కొందరు అమ్యామ్యాలకు కక్కుర్తిపడి అక్రమార్కులకు సహకరిస్తూ చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్వారీ పేలుళ్లతో తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రాణాలు సైతం పోతున్నాయని, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు