Homeప్రతిపక్షం ఐక్యంగా ఉంది

ప్రతిపక్షం ఐక్యంగా ఉంది

- Advertisement -

మహాగట్బంధన్‌లో వివాదాల్లేవ్‌

. 24 గంటల్లో అన్నీ సర్దుకుంటాయి
. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం
. ‘మా’, ‘బేటీ’ పథకాలు అమలు చేస్తాం
. బీహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
. వారికి ఆర్థిక న్యాయం అవసరం
. ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌

పట్నా: మహాగట్బంధన్‌లో విభేదాలున్నాయని వచ్చిన ఊహాగానాలను ఆర్‌జేడీ నాయకుడు, బీహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ తోసిపుచ్చారు. కూటమిలో ఎటువంటి వివాదాలు లేవని పేర్కొన్నారు. గురువారం కల్లా అన్ని సర్దుకుంటాయని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. వారికి శాశ్వత ప్రభుత్వ సిబ్బంది హోదా ఇస్తామని ప్రకటించారు. తేజస్వి మాట్లాడుతూ… ‘‘ప్రతిపక్ష కూటమి మహాఘట్బంధన్‌లో ఎటువంటి వివాదాలు లేవు, రేపటికి అన్నింటికి సమాధానాలు లభిస్తాయి. కాంట్రాక్టు ఉద్యోగులు అన్ని ప్రభుత్వ సేవలను అందిస్తున్నా దోపిడీకి గురవుతున్నారు. వారికి కారణం తెలియజేయకుండానే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేస్తాం. వారికి శాశ్వత ప్రభుత్వ సిబ్బంది హోదా ఇవ్వడానికి మేము కృషి చేస్తాం’’ అని తేజస్వీ యాదవ్‌ తెలిపారు.
బీహార్‌కు ఆర్థిక న్యాయం అవసరమని తేజస్వీ యాదవ్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నామినేషన్‌ దాఖలు ప్రక్రియ పూర్తయిందని, అక్టోబర్‌ 24 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని వెల్లడిరచారు. నామినేషన్‌ దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు ప్రచారం కోసం సమయం ఆసన్నమైంది. ఈసారి, బీహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంతో బీహార్‌ ప్రజలు విసుగు చెందారు. డబుల్‌ ఇంజిన్‌ పాలనలో అవినీతి, నేరాలు పెరిగాయి. నిరుద్యోగం, వలసలతో బీహారీలు విసుగు చెందారు. ప్రస్తుత ప్రభుత్వం మేం గతంలో ఇచ్చిన హామీలను కాపీ చేస్తోంది’’ అని తేజస్వి విరుచుకుపడ్డారు.
ఓట్ల కోసమే ‘మై బహిన్‌ మాన్‌ యోజన’
ఎన్నికల వేళ ఎన్‌డీఏ ప్రభుత్వం ‘మై బహిన్‌ మాన్‌ యోజన’ కింద రాష్ట్రంలోని మహిళలకు రూ. 10వేలు పంపిణీ చేయడాన్ని తేజస్వి తప్పుపట్టారు. ఈ నగదును లంచంగా అభివర్ణించారు. ‘‘బీహార్‌లో మహాగట్బంధన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిటీ సమీకరణకర్తలుగా పనిచేసే జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా ఇస్తాం. వారి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తాం. జీవికా దీదీల జీతాన్ని నెలకు రూ. 30,000కు పెంచుతాం. జీవికా దీదీలకు రూ.2వేలు అదనపు అలవెన్స్‌ను అందిస్తాం. రూ.5లక్షలకు జీవిత బీమా కల్పిస్తాం. జీవికా దీదీలు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తాం. రాబోయే రెండేళ్లు వడ్డీ లేని రుణాలను వారికి ఇస్తాం. జీవికా దీదీలు లేకుండా గ్రామాలు లేదా నగరాల్లో ఏ పని కూడా సాధ్యం కాదు. అయితే, వారి కోసం ఎన్‌డీఏ సర్కార్‌ ఏమీ చేయలేదు. అందుకే వారికి మహాఘట్బంధన్‌ సర్కార్‌ సాయం చేస్తుంది. ప్రజల బాధలు అవినీతి అధికారులను, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయవు’’ అని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు.
బీహార్‌ ప్రజలు అవినీతి, వలసలు, నిరుద్యోగం, పెరుగుతున్న నేరాలు వంటి సమస్యలపై నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌పై విసిగిపోయారని తేజస్వీ యాదవ్‌ విమర్శించారు. అందుకే బీహారీలు తమ మనసులో మార్పును కోరుకుంటున్నారన్నారు. బీహార్‌ లో మహాగట్బంధన్‌ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రంలోని మహిళల కోసం ‘భేటీ’, ‘మా’ పథకాలను ప్రవేశపెడతామని ప్రకటించారు. బీహార్‌కు ఇప్పుడు కావాల్సింది ఆర్థిక న్యాయం’’ అని తేజస్వి పేర్కొన్నారు.
ప్రజాతీర్పుపై తీవ్ర ఉత్కంఠ
బీహార్‌లో రెండు విడతల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబరు 6న మొదటి విడత, నవంబరు 11న రెండో విడత పోలింగ్‌ జరగనుంది. అదే నెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ, మహాగట్బంధన్‌ భాగస్వామ్య పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. చాలామంది అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. యువజన సంక్షేమం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కుల సమీకరణాలపైనా మహాగట్బంధన్‌ దృష్టి సారిస్తోంది. మరోవైపు ఎన్‌డీఏ కూటమి అభివృద్ధి, సుస్థిరత అనే అంశాలను నినాదంగా మార్చుకుంది. రాష్ట్ర వికాసం కోసం మళ్లీ తమ కూటమినే గెలిపించాలని బీజేపీ, జేడీయూ, ఎల్‌జేపీ నేతలు ఓటర్లను కోరుతున్నారు. తొలి ఎన్నికల్లో సత్తాను చాటుకోవాలని జన్‌ సురాజ్‌ పార్టీ భావిస్తోంది. ఈఎన్నికల్లో బీహార్‌ ప్రజలు ఎవరి వైపు నిలుస్తారు? ఎలాంటి తీర్పు ఇస్తారు? అనేది తెలియాలంటే ఇంకొన్ని వారాలు వేచి చూడాల్సిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు