ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్
న్యూయార్క్: ప్రపంచ శాంతిభద్రతలు, వికాసం సహా అన్ని ఐక్యరాజ్యసమితి విభాగాల్లో భారత్ అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని… అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఐరాస నిర్వహిస్తున్న శాంతి పరిరక్షక మిషన్లలో అత్యధికంగా 5వేల మంది భారత భద్రతాదళ సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఇందుకోసం భారత్‌కు ఐరాస సదా రుణపడి ఉంటుందన్నారు. 2007లో లైబీరియాలో శాంతి పరిరక్షక మిషన్ కోసం పూర్తిగా మహిళలతో కూడిన తొలి పోలీస్ యూనిట్‌ను అందించిన ఘనత భారత్‌కే దక్కుతుందని ఆయన చెప్పారు. జీ20 కూటమి సదస్సును భారత్ నిర్వహించిన సమయంలోనే అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని… భారత్ చొరవ వల్లే గ్లోబల్ సౌత్‌కు మేలు చేసే నిర్ణయాలను ఆ సదస్సులో తీసుకోవడం సాధ్యమైందన్నారు.
ఇక ప్రపంచంలోని ఏదైనా దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ, శాంతిభద్రతలు ప్రశ్నార్ధకంగా మారితే అక్కడికి ఐరాస పీస్ కీపింగ్ మిషన్లను పంపుతుంటామని… ఒక బాధ్యతాయుత ప్రజాస్వామిక దేశంగా, ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకూ భారత్ చేయూత అందిస్తోందని కొనియాడారు. అంతర్జాతీయ సమాజం కోసం ఐరాస ద్వారా భారత్ చాలా పనులు చేస్తోంది. అందుకే భారత్‌కు మేం అధిక ప్రాధాన్యతను ఇస్తాం. జీ7 లాంటి కూటములలో కేవలం సంపన్న దేశాలే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వాటన్నింటి సంయుక్త వాటా చాలా తక్కువ. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాయి. ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక వాటాను భారత ఆర్థిక వ్యవస్థే కలిగి ఉందని గుటెరస్ పేర్కొన్నారు. న్యూదిల్లీలో సోమవారం ప్రారంభమైన ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సు 20 వరకు జరగనుండగా… ఈ సదస్సుకు గుటెరెస్ హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో భేటీ అవుతారు. సదస్సులో పాల్గొనే అంతర్జాతీయ స్థాయి టెక్ కంపెనీల ప్రముఖులతోనూ సమావేశం కానున్నారు.
ప్రపంచ దేశాల అభ్యున్నతికిభారత్ అందిస్తున్న సాయం మాకు కీలకం
- Advertisement -
RELATED ARTICLES


