Wednesday, December 11, 2024
Homeప్రభుత్వ విధానాలే ప్రజలకు శాపం

ప్రభుత్వ విధానాలే ప్రజలకు శాపం

. జగన్‌, చంద్రబాబు మోదీకి లొంగిపోయారు
. అదానీతో కుమ్మక్కై ప్రజలపై భారాలు
. విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు వామపక్షాల పోరాటం
. నేటి నుంచి ప్రజాచైతన్య సభలు, సమావేశాలు
. రామకృష్ణ, శ్రీనివాసరావు

విశాలాంధ్ర – విజయవాడ: సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించేవరకు తమ పోరాటం ఆపేది లేదని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పది వామపక్ష పార్టీల అధ్వర్యంలో మంగళవారం విజయవాడలో భారీ ధర్నా చేపట్టారు. ధర్నాచౌక్‌ వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు ప్రధాని మోదీకి లొంగిపోయారని… అదానీతో లాలూచీ పడి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రూ.6,072 కోట్లు వసూలు చేసేందుకు చార్జీలు పెంచారని, డిసెంబరు నెల నుంచి పెంచిన చార్జీలతో విద్యుత్‌ బిల్లులు రానున్నట్లు తెలిపారు. మరో రూ.11,820 కోట్లు వసూలు చేసేందుకు విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రతిపాదన తీసుకొచ్చిందని, దీనిపై వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాలు అభ్యంతరాలు తెలియజేసినట్లు చెప్పారు. పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లు పెట్టబోమని మంత్రి అసెంబ్లీలో ప్రకటించటంతో తమ పరిస్థితి ఏమిటని గృహ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాపం తమకు శాపంగా మారిందని టీడీపీ నాయకులు పేర్కొనడం సరికాదని, రెండు ప్రభుత్వాల విధానాలే ప్రజలకు శాపంగా మారాయని విమర్శించారు. విద్యుత్‌ చార్జీలు పెంచం, వీలైతే తగ్గిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు… ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. జగన్‌, చంద్రబాబు ఇద్దరూ అదానీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకు వామపక్షాల పోరాటం ఆగదన్నారు. ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రజల్ని చైతన్యం చేస్తూ సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించి డిసెంబర్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్లు ఎవరు అడిగారని ఏర్పాటు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయమని చెప్పే ప్రభుత్వ పెద్దలు… వైసీపీ ప్రభుత్వ అన్ని నిర్ణయాలను ఇలాగే చేస్తున్నారా అని నిలదీశారు. సర్వే రాళ్లు, పాస్‌ పుస్తకాలు కొనసాగించనట్లే విద్యుత్‌ చార్జీల పెంపు నిర్ణయాన్ని నిలిపివేయాలన్నారు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్లతో వైసీపీ ప్రభుత్వం వేతనాలు పెంచుతామని ఒప్పందం చేసుకుందని, ఆ విధంగా పెంచుతారా అని ప్రశ్నించారు. డిమాండ్‌, సరఫరాకు అనుగుణంగా చార్జీలు నిర్ణయించటం వాస్తవంగా సాధ్యం కాదన్నారు. మోదీని నమ్మిన వారు బాగుపడలేదన్నారు. గతంలో షిర్డీసాయి కంపెనీ జగన్‌ బినామీ కంపెనీ అని చెప్పి నేడు అదే కంపెనీకి స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్టు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే అప్పులపాలై ఉన్నారని, చార్జీలు పెంచితే మరింత రుణభారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటారని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో మత కల్లోలాలు సృష్టించాలని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. మోదీ మానవతావాది అంటూ ఉప ముఖ్యమంత్రి వపన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించటాన్ని తప్పుబట్టారు. ఏపీని మరో మణిపూర్‌ చేయాలని కుట్ర చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల కోసం చేసే పోరాటాలలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రజల కోసం కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా లాంటి విషయాలను అడగకుండా కూటమి ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయటం దుర్మార్గం అన్నారు. ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచినప్పుడు వామపక్షాలు ఉద్యమించాయని, ఆ సందర్భంగా బషీర్‌బాగ్‌లో జరిగిన తుపాకీ కాల్పుల్లో ఉద్యమకారులు మరణించగా ఇప్పటికీ వారి స్మారకసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకుని చరిత్ర పునరావృతం కాకుండా విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు సుధీర్‌ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు సంస్థను డిస్కమ్‌లు పేరుతో మూడు ముక్కలు చేశారని… ఇప్పుడు స్మార్ట్‌మీటర్ల పేరుతో మోదీ తీసుకువచ్చిన విద్యుత్‌ సవరణల బిల్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాకు సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం జిల్లా నాయకులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, రాష్ట్ర నాయకులు ఎస్‌.వెంకట సుబ్బయ్య, సీపీఎం రాష్ట్ర నాయకులు తులసీరావు, డి.రమాదేవి, సీహెచ్‌.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి లంక దుర్గారావు వందన సమర్పణ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు