ఆయన సౌందర్య స్సయాన్ని సమృద్ధిగా పండించిన వెనుకటి తరం సాహితీ హాలికుడు. మెత్తని హృదయం, మరి ఎంతో మెత్తని పలుకుబడి. ఆయనకు ఒకసారి బందర్ లో ఓ సాయంకాలం సన్మానం జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లి పోవడానికి హాలు లోంచి బయటకు వచ్చారు. అక్కడ పేవ్ మెంట్ మీద ఒక ముసలాయన చలికి వణికిపోతూ ముడుచుకుని పడుకుని ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే ఆయన మనసు విలవిల్లాడింది. అంతే! తనకు సన్మానంలో కప్పిన భుజం మీద శాలువా తీసి, ఆ ముసలాయనకి కప్పి, ఇంటి వైపు నడక సాగించారు.
ఆయనే, ఆ సున్నిత హృదయుడే, ఆ సౌహార్రÝ మూర్తే: సౌందరనందం, పౌలస్త్య హృదయము, తొలకరి మొదలైన అద్భుత కావ్యాలను పింగళి లక్ష్మీకాంతంతో కలిసి రాసిన సాహితీ హాలికుడు, తెలుగు కవి, అనువాదకుడు, నాటక కర్త కాటూరి వెంకటేశ్వరరావు.
కాటూరి వెంకటేశ్వరరావు 1895 అక్టోబర్ 15వ తేదీన కృష్ణాజిల్లా ఉయమూయూరు మండలం కాటూరు గ్రామంలో రామ్మ, వెంకట కృష్ణయ్య దంపతులకు జన్మించారు. చిన్న ముత్తాత గారికి దత్తుడై పెరిగారు. వారి ద్వారా చాలా సంపద వీరికి లభ్యమయింది.
ఈయన బందర్‌లో బీఏ సీనియర్ చదువుతూ 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని చదువు విరమించారు. 1930 లో జరిగిన ఉద్యమంలో పాల్గొని ఆరు నెలలు జైల్లో ఉన్నారు. 1932 మొదలు 1939 వరకు ఆంధ్రో పాధ్యాయుడుగా, తరువాత 1943 వరకు బందరు ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగం నిర్వహించారు. కొంతకాలం కృష్ణా పత్రిక సంపాదకుడుగా కూడా పనిచేశారు.
తిరుపతి వెంకట కవుల దగ్గర చేసిన శుశ్రుష ప్రభావం వల్ల కావచ్చు, కాటూరి వారి కవితలో ప్రాచీనార్వాచీనతలు రెండూ సమ్మిళితమయ్యాయి. వస్తువు కొత్తదైతే పద్ధతి పాతది, పద్ధతి పాతదైతే వస్తువు కొత్తది…అలా పాత కొత్తల మేలు కలయికలకు ఒక ఉదాహరణగా వారి కవిత్వం సాగింది. తెలుగులో భావ కవిత్వం పై ఆకర్షణ ప్రబలంగా ఉన్న రోజులలో రచన ప్రారంభించిన ఆయన దృష్టి ఎక్కువగా జాతీయవాదం వైపు, ధార్మిక ప్రబోధం వైపు ప్రసరించింది. గాంధీజీ సిద్ధాంతాలతో ఆయన ఎక్కువగా ప్రభావితులయ్యారు.
వీరు పింగళి లక్ష్మీకాంతంతో కలిసి పింగళి కాటూరి కవులు అనే జంట కవులుగా ప్రసిద్ధులయ్యారు. ఇద్దరూ కలిసి అనేక శతావధానాలు చేశారు. కాటూరి వారు స్వయంగా స్వప్న వాసవ దత్త ,ప్రతిజ్ఞా యౌగంధరాయణము, గాంధీజీ స్వీయ చరిత్ర మొదలైన అనువాద రచనలు చేశారు. గాంధీజీ ఆత్మకథను సత్యశోధన పేరుతో రాశారు. పన్నీటి జల్లు అనే వీరి ఖండకావ్యాల సంపుటి చాలా ప్రసిద్ధికెక్కింది.
చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రికి ఎంతో ప్రియమైన శిష్యుడు ఈయన! వెంకట శాస్త్రికి ఎవరైనా సన్మానం చేస్తామని పిలిస్తే, “ముందు మా కాటూరి వెంకటేశ్వరరావుతో మాట్లాడండి!” అనేవారట. ఎందుకంటే ఈయన,‘తనకు వేళకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఆ సన్మానం జరిగేచోట చక్కగా చూస్తారు’ అని శాస్త్రి నమ్మకం.
కాటూరి వారు ఎంతో సంపన్నులు. ఓ జమీందారు ఫాయిదాలో సుమారు 100 ఎకరాల అసామీ! అయినా సరే వెంకట శాస్త్రి మీద గురుభక్తితో వారి ఒంటికి నూనె రాసి నలుగుబెట్టేవారట ! ఆ నలుగు పెడుతున్నంతసేపూ,‘ఏమైనా కొత్త పద్యాలు చదవరా…నీ పద్యాలు హాయిగా ఉంటాయి. నువ్వు నలుగు పెడుతూ ఉంటే ఎంత సుఖంగా ఉంటుందో నీ పద్యాలు కూడా అంత సుఖంగా నడుస్తాయి!’ అనే వారట వెంకట శాస్త్రి.
అప్పటి రోజుల్లో ఆకాశవాణిలో పనిచేసే కాటూరి వెంకటేశ్వరరావు అబ్బాయి విజయసారథి ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘మా నాన్నగారికి సుమారు 100 ఎకరాలు సుక్షేత్రమైన పొలం సంక్రమించింది. అయితే దానిని ఆయన ఏనాడు పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆయన ఉద్యోగం, కృష్ణా పత్రిక సంపాదకత్వం, రచనా వ్యాసాంగం వీటితోటే ఆయనకు కాలం సరిపోయేది. ఆయన పొలం ఎక్కడుందో దాని సరిహద్దులు ఏమిటో కూడా ఆయనకు సరిగా తెలిసేది కాదు.
ఉదయం ఆయన చుట్ట కాల్చుకుంటూ పొలంలోకి వెళ్లి గట్టుమీద ఉన్న వంగచెట్టు నుండి లేతవంకాయలు తెంపుతూ ఉంటే ఓ రైతు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించాడు.‘నువ్వు కూడా వంకాయలు తెంపుకొని తీసుకెళ్ళరా! పర్వాలేదు!’ అంటూ వాడిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు.
వాడు ఎంతో భక్తితో ఆయన వంక చూస్తూ, ‘అలాగే బాబు తెంపుకుంటాను! ఇది నా పొలమేనండి… తమరి పొలం అటుపక్క ఆ దూరంగా కనపడే తాటిచెట్ల అవతల నించండి!’ అంటూ ఎంతో వినయంగా సమాధానం చెప్పాడట. సంపదను జాగ్రత్త పెట్టుకునే విషయంలో మా నాన్న శ్రద్ధ గురించి చెప్పడానికే ఈ విషయం చెబుతున్నాను!” అన్నారు చిరునవ్వుతో.
‘కాటూరి వెంకటేశ్వరరావుది సపరివిష్ఠతమైన సారస్వత వ్యాసంగం. ఆయన భోగత్యాగాలకు వలయునంత ఉన్నవాడు! ఆదిలో వీరు ‘కలపటపు’ వారు. నాలుగైదు తరాలుగా కాటూరు చేరిన తర్వాత ‘కాటూరి’ అని ఇంటిపేరు మారింది. వీరికి ఒడలెరుగని ఉపన్యాస ధోరణి సాగించు గుణం ఉండేది. కానీ తీయతీయగా పద్యపాఠము చేసి సభ్యుల నూరించును. నిర్లిప్తుతుడు. ఒకరి లక్ష్యము లేదు. అట్లని ఎవరినీ చండనాడడు. వచన శైలిలో పింగళి వారిది, పద్యశయ్యలో కాటూరి వారిది పై చేయిగా ఉండునని దేశమున పలుచనైన ఒక వాడుకవున్నది! రసజ్ఞులగు వారి చెవుల కిట్టి వాడుకలు వినపడవు. వారిరువురిది సరియగుజత. సౌందర్యనందం ఒకటి మాత్రం ఈ ఇద్దరి కీర్తికి పతాక!’ అంటూ కాటూరి వారికి నివాళులర్పించారు కళా ప్రపూర్ణ, మహాకవి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి.
కాటూరి వారు 1962 డిసెంబర్ 25వ తేదీన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వర్గస్తులయ్యారు.
సెల్: 94403 18415
ప్రాచీనర్వాచీనతల మేలు కలయిక కాటూరి
- Advertisement -


