Thursday, December 11, 2025
Homeబనకచర్లకు బ్రేక్‌!

బనకచర్లకు బ్రేక్‌!

- Advertisement -

ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ టెండర్‌ రద్దు
వెనక్కు తగ్గిన చంద్రబాబు సర్కార్‌

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకన్న బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్‌పడిరది. భారీ బడ్జెట్‌ అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన ఈప్రాజెక్టును సీపీఐతో పాటు ఇతర రాజకీయపార్టీలు, ప్రజా, రైతు సంఘాలు మూకుమ్మడిగా వ్యతిరేకించాయి. మరోవైపు తెలంగాణ సర్కార్‌ కూడా వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాయడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లుగా కనబడుతోంది. దాదాపు రూ.80వేల కోట్లకు పైగా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. పోలవరం ప్రాజెక్ట్‌ ద్వారా గోదావరి నదిలో లభ్యమయ్యే అదనపు నీటిని కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. గోదావరి నీటిని బనకచర్ల రిజర్వాయర్‌కు మళ్లించి, అక్కడి నుంచి రాయలసీమ జిల్లాలకు (ప్రత్యేకంగా కర్నూలు, అనంతపురం) సాగు నీరు, తాగునీరు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. రాయలసీమలో తరచూ ఎదురయ్యే వర్షాభావ పరిస్థితులను తగ్గించడం కోసం ఈ లింక్‌ ప్రాజెక్ట్‌ కీలకమవుతుందని చంద్రబాబు చెబుతూ వచ్చారు. గోదావరి బేసిన్‌లో లభ్యమయ్యే అదనపు నీటిని కృష్ణా బేసిన్‌కి మళ్లించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరుల సమతుల్యత సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ను కలిసి ప్రాజెక్టు వివరాలను తెలియజేసి, ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలంటే ఈ ప్రాజెక్టుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టును మొదటి నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో పాటు ఇతర వామపక్ష, ప్రజా, రైతు సంఘాల నేతలు వ్యతిరేకిస్తూ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. రాయలసీమలో పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టడాన్ని తప్పుబడుతూ వచ్చారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడంతో పాటు కేంద్ర జలవనరుల శాఖకు లేఖ రాసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారీకి టెండర్లు ఆహ్వానించింది. తాజాగా ఈ టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ అండ్‌ సీఆర్‌డీ) శాఖ అధ్వర్యంలో టెండర్‌ ఐడీ: 853750 నంబరుతో, 08ఎస్‌ఇ/2025-26 నోటిఫికేషన్‌ నంబరుతో ఈ టెండర్‌ గత నెల 11న విడుదలైంది. బిడ్‌ డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌ అక్టోబర్‌ 13న ప్రారంభం కాగా, సమర్పణ గడువు అక్టోబర్‌ 31గా నిర్ణయించారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు నీటి లింక్‌ సదుపాయానికి సంబంధించిన సాంకేతిక సర్వేలు, పరిశోధనలు, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డీపీఆర్‌ సిద్ధం చేయాల్సిన పనుల కోసం ఈ టెండర్‌ జారీ చేయబడిరది. అయితే తాజాగా ప్రభుత్వ ఇప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌లో టెండర్‌ స్థితి రద్దు చేసినట్లుగా పేర్కొంది. గత 31వ తేదీనే ఈ టెండరును రద్దు చేసినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. టెండరు రద్దుకు కారణాలను తెలియజేయలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు