Homeసాహిత్యంబొద్దింకలంమేము బొద్దింకలం

బొద్దింకలంమేము బొద్దింకలం

- Advertisement -

డా. ఎన్.ఈశ్వర రెడ్డి


బొద్దింకలం మేము బొద్దింకలం
అందలాల కింద నలిగే శాపగ్రస్తులం
బొద్దింకలం మేము బొద్దింకలం
మందిసొమ్ము మింగలేని బుద్ధి జీవులం
బొద్దింకలం మేము బొద్దింకలం
బుక్క బువ్వ దొరకకున్న
హక్కులేమి అడగబోము
తొక్కి తొక్కి నలుపుతున్నా
ఒక్కమాట ఆడబోము
భవనాలను మోస్తువున్న
బల్లులను తిట్టబోము
చీకటొచ్చి మీద పడినా
పాకకుండా మానలేము
బొద్దింకలం మేము బొద్దింకలం
రంకుబొంకు నేర్వలేని మంద బుద్ధులం
రాబందులు గద్దలన్నీ
నక్క జట్టు కట్టినాయి
కందిరీగ గుంపులొచ్చి
కంచెలేసి కాసినాయి
గాది కింద పంది కుక్క
ఇంటి పైన కోతి మూక
కాకి బావ కావు మంటే
గొంతు బట్టి నొక్కుతాయి
బొద్దింకలం మేము బొద్ధింకలం
నోరు కూడా మెదపలేని పేద పురుగులం
కండువాలు మార్చలేము
కనికట్టు చేయలేము
ఎన్నికల యంత్రాలకు
మంత్రాలను నేర్పలేము
నీతులెన్నో చెప్పి మీకు
గోతుల్లో తొయ్యలేము
మంది సొమ్ము కొల్లగొట్టి
మంచాలను వెయ్యలేము
బొద్దింకలం మేము బొద్ధింకలం
పెత్తనాన్ని వంచలేని పిచ్చి గువ్వలం

తిరోగామి చదువుపైన
తిరుగుబాటు చేయలేము
పేపర్ లీకేజీలను
పట్టి పట్టి అడగబోము
ధరల మంట కాల్చుతున్నా
దేహాన్ని దాయలేము
అణుబాంబులు మీద పడినా
అదిరి బెదిరి చెదిరిపోము
బొద్దింకలం మేము బొద్దింకలం
చేయి చేయి కలుపుతున్న చలిచీమలం
బొద్దింకలం మేము బొద్దింకలం
అందలాల కింద నలిగే శాపగ్రస్తులం
బొద్దింకలం మేము బొద్దింకలం
మంది సొమ్ము మింగలేని బుద్ధి జీవులం.
గేయరచయిత అరసం అధ్యక్ష వర్గ సభ్యులు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు