సైకాలజీపై 26 పుస్తకాలు రాసిన ఓ ప్రొఫెసర్ రాసిన కవిత్వం ఇది. వివిధరకాలైన ఛాయాచిత్రాలను చూసి స్పందించి, అనుభూతి పొంది రాసిన కవిత్వంఇది. తెలుగుసాహిత్యంలో ఇది ఓ సరికొత్త ప్రక్రియ. ఛాయాచిత్రాలు, దృశ్యాలనుచూసి వాటిలోని భావోద్వేగాలు, కవి ఆలోచనల దొంతరల నుంచి అక్షరబద్ధంచేసే కవిత్వ ప్రక్రియ ఇది. దీనిని ఛాయాచిత్రాల కవిత్వం (ఫొటో పొయెట్రీ) అంటారు. తెలుగుసాహిత్యంలో ఈ రకమైన కవిత్వానికి ఆద్యుడు అని చెప్పలేంగానీ, ఛాయాచిత్రాల కవిత్వం రాసిన మొదటితరం కవిగా డాక్టర్ మురుగుడు శ్రీహరి నిలుస్తారు. ఈ రకమైన కవిత్వం రాయడం ఆయన 1984లోనే ప్రారంభించారు. అయితే, పుస్తక రూపంలో ఇప్ప్పుడే తీసుకు వచ్చారు. ఈ చిత్రాలలో ఎన్నోభావాలు, బాధలు, వ్యధలు, ఆనందం, చీకటి, వెలుగు, సముద్రం, దాని సవ్వడులు, అలల శబ్దాలు, అగాధం, అలసట, అలజడి, ఆశ, నిరాశ, ఆనందం, అపురూపం, ఒంటరితనం, స్పష్టత, అస్పష్టత, బ్రాంతి, భారతీయ జీవితం, సాగర తీరం, శబ్దం, నిశ్శబ్దం, ప్రకృతి, సంస్కృతి…ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఆ దృశ్యాలను కవితలుగా మలచినతీరు అద్భుతం. మనసు లోతులను తాకుతాయి ఇందులోని చిత్రాలు, కవితలు. ప్రేమ, భావ, అభ్యుదయ,అనుభూతి, మనసు… అన్నిరకాల కవిత్వం ఈ పుస్తకంలో ఉంది. అమ్మ గురించి అద్భుతంగా రాశారు. ‘అమ్మకు నా ఆకలి చెప్పాల్సిన అవసరం రాలేదు…బాల్యంలో నా పిచ్చిభాషను క్షణంలో పసిగట్టేది…’ ఇలా అందరికీ అమ్మ జ్ఞాపకాలు గుర్తుకుతెస్తారు శ్రీహరి. అడుగు మొదలయ్యాక ఆగదు. తర్వాత అద్భుతÛం…చూసికూడా రాయలేని పరీక్షే జీవితం…అని సాగుతుంది శ్రీహరి కవిత్వం. ఒంటరిగా పోరాడే తెగువ ఉంటే, చిన్న బిందువు కూడా సునామీనే, గెలుపురుచి చూపిస్తుందని చక్కటికవిత్వం రాశారు. జీవితం అంటే సమాధానాలు దొరకని, ఎవరూ లీక్‌చేయని పరీక్షాపత్రంగా పేర్కొన్నారు. జీవితం గురించి ఇంతకంటే ఎవరైనా ఏం చెప్పగలం!. దారంకంటే సులువుగా తెగిపోయే బంధాలు… ఎవరికీ ఎవరూ ఏమీ కాని సమాజం…అని ఓ వాస్తవాన్ని చాలాగొప్పగా చెప్పారు. జారుతున్న కన్నీటిబొట్టు గురించి చాలా చక్కగారాశారు. అంతేకాదు, ఆ బొట్టుకు విలువకట్టే తరాజు ఈ సృష్టిలోఎక్కడ? అని ప్రశ్నించారు. ఎలా బతకాలో తెలుసుకోవడానికి ఒక్క జ్ఞాపకం చాలంటారు. నిన్ను నువ్వు మలుచుకునే ఓ ఆయుధం ఒంటరితనం అని ఓ నగ్నసత్యాన్ని చెప్పారు. ఋతువులు సైతం లెక్కచేయ కుండా కబుర్లుచెప్పి, ఇప్ప్పుడు శిథిలమైపోతున్న పోస్టుబాక్సు దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ చక్కటి కవిత రాశారు.
ఇలా ఎన్నోభావాలు, వాస్తవాలు, అనుభూతులు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, అవి ప్రతిబింబించే చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రతి ఫొటోవెనుక ఓకథ మనకు కనిపిస్తుంది. ఫొటోలకు తగ్గట్టుగా కవితలురాశారు. అయితే, ఈ పుస్తకంలోని ఫొటోలు కలర్‌లో లేకపోవడం వెలితిగా అనిపించింది. భావాలను అర్థం చేసుకోవడానికి రంగులు కూడా ముఖ్యం.
శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్, 9440222914
మనసు లోతులను తాకే శ్రీహరి ‘సిత్రా’లు
- Advertisement -


