రెండవరోజు అవకాయ్‌లో సాంస్కృతిక వారసత్వం
విశాలాంధ్రవిజయవాడ: ఆవకాయ్ సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం రెండో రోజు భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రజలు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ కార్యక్రమాలు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ శిబిరం ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. యువత ప్రదర్శించిన నైపుణ్యం అందరినీ ఆకర్షించింది. అలాగే, ప్రసిద్ధ నగాడా వాయిద్య కళాకారుల ప్రదర్శన ఉర్రూతలూగించి, కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కలెక్టర్ డా. జి.లక్ష్మశ పాల్గొని కళాకారులను అభినందించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా సరదాగా నగాడా వాయిద్యం వాయించి ప్రేక్షకులను అలరించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో ఇలాంటి ఉత్సవాల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అమరావతోత్సవం ప్రజల్లో మంచి స్పందన పొందుతోందని తెలిపారు. మరిన్ని ఆకర్షణీయమైన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.


